పబ్లిక్‌ ఇష్యూలకూ ‘వాణిజ్య ఒప్పందం’ జోష్‌

Eenadu icon
By Business News Desk Updated : 08 Feb 2026 03:57 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

త 12-18 నెలలుగా స్టాక్‌ మార్కెట్‌ దిద్దుబాటు దిశలో సాగడంతో.. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే విషయంలో పలు కంపెనీలు వేచిచూసే ధోరణిని అవలంబించాయి. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొనడం, భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత వల్ల ఐపీఓ సమయంపై ఒక నిర్ణయానికి రావడం వాటికి సవాలుగా మారింది. అయితే ఇప్పుడు భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సాకారం అవుతుండటంతో అటు స్టాక్‌ మార్కెట్‌కే కాకుండా, ప్రైమరీ మార్కెట్‌లోనూ జోష్‌ను తీసుకొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నాయి. ఈ వారంలో రెండు కంపెనీలు- ఆయ్‌ ఫైనాన్స్, ఫ్రాక్టల్‌ అనలటిక్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి మొత్తంగా రూ.3,800 కోట్లను సమీకరించాలని అనుకుంటున్నాయి. అయితే మునుపు ప్రకటించిన దానితో పోలిస్తే ఈ రెండు సంస్థలు తమ ఇష్యూ పరిమాణాన్ని తగ్గించుకోవడం  గమనార్హం. 

సూక్ష్మ రుణాల సంస్థ ఆయ్‌ ఫైనాన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) 9న ప్రారంభమై 11న ముగియనుంది. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా రూ.1,010 కోట్లను సమీకరించాలని కంపెనీ అనుకుంటోంది. కాగా.. డిసెంబరులో ముసాయిదా పత్రాలను సమర్పించిన సమయంలో ఇష్యూ పరిమాణాన్ని  రూ.1,450 కోట్లుగా పొందుపరిచింది. తాజా షేర్ల ద్వారా రూ.885 కోట్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా   రూ.565 కోట్లను సమీకరించనున్నట్లు ఆ సమయంలో తెలిపింది. అయితే ప్రస్తుతం తాజా షేర్ల జారీ పరిమాణాన్ని రూ.710 కోట్లకు, ఓఎఫ్‌ఎస్‌ ద్వారా నిధుల సమీకరణను రూ.300 కోట్లకు తగ్గించింది. ఇష్యూ ధరల శ్రేణి రూ.122-129.

కృత్రిమ మేధ, అనలటిక్స్‌ సంస్థ ఫ్రాక్టల్‌ అనాలటిక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ కూడా 9న ప్రారంభమై 11న ముగియనుంది. ఐపీఓ ద్వారా రూ.2,834 కోట్లను సమీకరించాలని అనుకుంటోంది. ఈ సంస్థ కూడా తాజా షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణను రూ.1,279 కోట్ల నుంచి రూ.1,024 కోట్లకు తగ్గించింది. ఓఎఫ్‌ఎస్‌లో విక్రయించనున్న షేర్ల విలువను కూడా రూ.3,621 కోట్ల నుంచి తగ్గించి రూ.1,810 కోట్లకు పరిమితం చేసింది. ఇష్యూ ధరల శ్రేణి రూ.857-900. 

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 03:03 IST