Belly fat: మేటవేసిన కొవ్వును తగ్గించే మీట!

Eenadu icon
By Telangana News Desk Published : 08 Feb 2026 19:18 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ లోపించిన జీవనశైలి వంటి కారణాల వల్ల ఊబకాయం, ఫ్యాటీ లివర్‌ వ్యాధి కేసులు ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఊబకాయం పెను సమస్యగా మారుతోంది. అనారోగ్యానికి, అకాల మరణానికి ప్రధాన కారణమవుతోంది. ఈ సమస్య వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ శరీరంలో కొవ్వు తయారీకి దోహదపడే ఒక ఎంజైమ్‌ను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ‘మాస్టర్‌ స్విచ్‌’లా పనిచేస్తుందని కనుగొన్నారు. దాన్ని ‘ఆఫ్‌’ చేస్తే ఆరోగ్యపరంగా అద్భుత ప్రభావాలు ఉంటాయని తేల్చారు. దీని ఉనికి గురించి వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి. 

ఏమిటీ ఎంజైమ్‌? 

శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ అనే వాయువు సహజసిద్ధంగానే ఉత్పత్తవుతుంది. అది అనేక జీవ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. ప్రొటీన్లకు అతుక్కొని, వాటి పనితీరును మార్చేస్తుంది. ఈ వాయువు పరిమాణం విషయంలో సమతౌల్యత చాలా కీలకం. ఒకవేళ అది కీలక ప్రొటీన్లకు మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా అతుక్కోవడం జరిగితే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఈ నేపథ్యంలో క్లీవ్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్స్, కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ వెలుగు చూడని ఎస్‌సీవోఆర్‌2 అనే ఎంజైమ్‌ను గుర్తించారు. 

  • ఈ ఎంజైమ్‌.. కొవ్వు పేరుకుపోవడాన్ని నియంత్రించే ప్రొటీన్ల నుంచి నైట్రిక్‌ ఆక్సైడ్‌ను తొలగిస్తుంది. ఈ వాయువును తొలగించినప్పుడు కొవ్వు ఉత్పత్తి ప్రక్రియ స్విచ్ఛాన్‌ అయింది. దీన్ని బట్టి కొవ్వు తయారీకి ఎస్‌సీవోఆర్‌2 ఎంజైమ్‌ అవసరమని స్పష్టమవుతోంది. 
  • ఎస్‌సీవోఆర్‌2ను అడ్డుకున్నప్పుడు ఏం జరుగుతుందన్నది కూడా శాస్త్రవేత్తలు పరీక్షించారు. జన్యు విధానాలతోపాటు ఆ ఎంజైమ్‌ను నిలువరించే ఔషధాన్ని రూపొందించి కూడా పరీక్షలను నిర్వహించారు. 
  • ఎలుకల్లో ఎస్‌సీవోఆర్‌2ను అడ్డుకున్నప్పుడు ఆ జీవుల్లో బరువు పెరగడం ఆగిపోయింది. కాలేయానికి గాయాల నుంచి రక్షణ లభించింది. చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం కూడా తగ్గింది. 

భిన్న కణాల్లో కొవ్వు ఉత్పత్తికి సంబంధించి సహజసిద్ధ బ్రేక్‌లా నైట్రిక్‌ ఆక్సైడ్‌ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాలేయంలో ఈ వాయువు.. కొవ్వును ఉత్పత్తి చేసే ప్రొటీన్లను నిలువరిస్తుందన్నారు. కొవ్వు కణజాలంలో కొవ్వును ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ల తయారీకి దోహదపడే జన్యు ప్రోగ్రామ్‌ను అడ్డుకుంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో తాము రూపొందించిన మందు.. ఊబకాయం, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అదనంగా కాలేయానికీ మేలు చేయవచ్చని వివరించారు. దీన్ని మానవులపై పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియకు 18 నెలలు పట్టే అవకాశం ఉంది. 

శరీరానికి కీలకం..

రక్తనాళాలను విశ్రాంత స్థితిలో ఉంచడం నైట్రిక్‌ ఆక్సైడ్‌ ప్రధాన విధి. దీనివల్ల శరీరం గుండా మరింత ఎక్కువగా రక్తం, ఆక్సిజన్, పోషకాలు బట్వాడా అవుతాయి. ఫలితంగా కీలక అవయవాలకు సరిపడా పోషణ అందుతుంది. రక్తనాళాల్లోని ఎండోథీలియం పొరను కూడా నైట్రిక్‌ ఆక్సైక్‌ సంరక్షిస్తుంది. శరీరంలో ఈ వాయువు లోపిస్తే రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తినడం ద్వారా నైట్రిక్‌ ఆక్సైడ్‌  ఉత్పత్తిని పెంచుకోవచ్చు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :