Revanth Reddy: సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయమూ తీసుకోం: సీఎం రేవంత్‌రెడ్డి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

గణపురం: సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయమూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని, మెడికల్ బోర్డు విషయంలో విషం చిమ్మితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు.
పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Revanth Reddy)ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. రేగొండ మండలం కొడవటంచ చేరుకున్న సీఎం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి, పక్కనే ఉన్న బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.12.15 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ పనుల్లో భాగంగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
‘‘ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. దేశానికే నాయకత్వం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్ర. సింగరేణి కార్మికుల ప్రత్యేకతను ఉద్యమంలో చూశాం. భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలను రద్దు చేసే ఆలోచన మాకు లేదు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేయాలంటే ప్రజలతో చర్చించే చేస్తాం. భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు.. కొనసాగుతుంది.
కేసీఆర్, కేటీఆర్‌ను కాపాడుతున్నది కిషన్‌రెడ్డి కాదా?
2004-14 మధ్య 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చాం. గత పదేళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితకు మాత్రం ఫామ్‌హౌస్‌లు వచ్చాయి. కేసీఆర్‌కు పేదల పట్ల ఎలాంటి పట్టింపు లేదు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉన్న ఊరిలో ఓట్లన్నీ బీఆర్‌ఎస్‌కు.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊరిలో ఓట్లన్నీ కాంగ్రెస్‌కు అని ఆనాడు చెప్పా. అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు గంపగుత్తగా ఓట్లు వేశారు. ఏప్రిల్ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ఇస్తాం. దక్షిణ కుంభమేళాగా సమ్మక్క.. సారలమ్మ జాతర నిర్వహించుకొన్నాం. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో రిసార్ట్‌లను అభివృద్ధి చేస్తాం.
బీఆర్‌ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులను బెదిరించి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో రూ.1500 కోట్లు తీసుకున్నారు. బీఆర్‌ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. పాపాల ఊబిలో ఆ పార్టీ కూరుకుపోతుంది. కిషన్‌రెడ్డి.. కల్వకుంట్ల కిషన్‌రావుగా మారి కేసీఆర్, కేటీఆర్ అరెస్టును ఆపుతున్నారు. ‘నేను ముఖ్యమంత్రినా కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి’ అని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని సీబీఐ, ఈడీ కేసులతో అవమానిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడంలేదు. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను కాపాడుతున్నది మీరు కాదా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 17:44 IST