Piyush Goyal: యూఎస్‌ నుంచి 500 బి.డాలర్ల దిగుమతులు.. పెద్ద విషయం కాదు: గోయల్‌

Eenadu icon
By Business News Team Published : 09 Feb 2026 00:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి వచ్చే ఐదేళ్లలో భారత్‌ 500 బిలియన్‌ డాలర్ల (రూ.45 లక్షల కోట్లకుపైగా) విలువైన వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వృద్ధి చెందుతున్న మన దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు రెండు ట్రిలియన్ డాలర్ల డిమాండ్‌ను సృష్టిస్తుందనే విషయాన్ని లెక్కలోకి తీసుకుంటే.. ఇది చాలా తక్కువేనని చెప్పారు.

‘‘భారత్‌ ప్రస్తుతం ఆయా దేశాల నుంచి ఏటా దిగుమతి చేసుకుంటున్న 300 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను.. అమెరికా నుంచి కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా మన దేశ మొత్తం దిగుమతుల డిమాండ్‌ రాబోయే ఐదేళ్లలో రెండు ట్రిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని అమెరికన్‌ అధికారులకూ తెలిపాం. మార్కెట్‌ విషయంలో పోటీతత్వాన్ని కలిగి ఉండాలని సూచించాం’’ అని పీయూష్‌ గోయల్‌ ( Piyush Goyal) ‘పీటీఐ’ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో తెలిపారు. అగ్రరాజ్యం ( USA) నుంచి మన దేశం ఇప్పటికే ఏటా 45-50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందన్నారు.

‘‘ప్రముఖ టెక్ సంస్థలు భారత్‌లో భారీ పెట్టుబడులను ప్రకటించాయి. దేశంలో 10 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. వాటి కోసం పరికరాలు అవసరమవుతాయి. ఈ డిమాండ్‌ను అమెరికా తీర్చొచ్చు. విమాన పరిశ్రమకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి. విమానాల విషయంలో ఒక్క బోయింగ్‌కే మన దేశం నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.

డేటా సెంటర్లు, ఏఐ మిషన్‌, తయారీ రంగం, ఖనిజాల ప్రాసెసింగ్‌ వంటి కార్యకలాపాలకు అధిక నాణ్యత కలిగిన యంత్రాలు, ఐసీటీ ఉత్పత్తులు, ఎన్విడియా చిప్‌లు, క్వాంటం కంప్యూటింగ్ కోసం ఏఐ యంత్రాలు, ఉక్కు పరిశ్రమల కోసం కోకింగ్ బొగ్గు అవసరం. ఇవన్నీ అమెరికా సమకూర్చగలదు. కాబట్టి.. 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు ఆ దేశం నుంచి ఏటా 100 బిలియన్ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ అంచనా’’ అని గోయల్‌ అన్నారు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :