Nepal just miss stunning england in t20 world cup 2026

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఓ పెను సంచలనం తృటిలో మిస్‌ అయ్యింది. ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 8) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ రెప్పపాటులో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టును దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన లక్ష్యానికి అతి సమీపంగా వచ్చి, 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. 

నేపాల్‌ ఓడినా, ఇంగ్లండ్‌ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన వైనం క్రికెట్‌ ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌కు ఆది నుంచి మంచి ఆదరణ లభించింది. హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండే అయినా, వాంఖడే స్టేడియంలోని (ముంబై) ప్రేక్షకులు నేపాల్‌ ఆటగాళ్లకు బ్రహ్మారథం పట్టారు. ఆ జనాలను చూసి, ఇది ఖాట్మండునా (నేపాల్‌ రాజధాని) లేక ముంబైనా అన్న అనుమానం వచ్చింది. 

ప్రేక్షకులు వేల సంఖ్యలో నేపాల్‌కు మద్దతిచ్చేందుకు తరలివచ్చారు. ఇందుకు నేపాల్‌ ఆటగాళ్లు తగిన న్యాయం చేశారు. వారి అభిమానులకు కావాల్సినంత మజాను అందించారు. ఇంగ్లండ్‌పై దాదాపు గెలిచినంత పని చేశారు. చివరి ఓవర్‌లో ఒక్క బౌండరీ నమోదై ఉంటే నేపాల్‌ పెను సంచలన సృష్టించేదే. 

185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్‌కు చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్‌ను సామ్‌ కర్రన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పర్ఫెక్ట్‌ యార్కర్లు వేసి నేపాల్‌ బ్యాటర్లు కరణ్‌, లోకేశ్‌ బామ్‌ను ఇబ్బంది పెట్టాడు. కర్రన్‌ కట్టడి చేయడంతో నేపాల్‌ ఆ ఓవర్‌లో కేవలం 5 పరుగులే చేయగలిగింది. 

అప్పటిదాకా మెరుపులు మెరిపించిన లోకేశ్‌ బామ్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్‌లో ఏమీ చేయలేకపోయాడు. కర్రన్‌ అతన్ని అద్భుతంగా కట్టడి చేశాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. లోకేశ్‌ సిక్సర్‌ బాది తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కర్రన్‌ ముందు లోకేశ్‌ పప్పులు ఉడకలేదు. 

కర్రన్‌ తన అనుభవాన్నంతా రంగరించి అద్భుతమైన యార్కర్లు సంధించాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 18వ ఓవర్‌ నేపాల్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. అప్పటివరకు ఆచితూచి ఆడిన నేపాల్‌ బ్యాటర్లు.. ఆ ఓవర్‌లో చెలరేగిపోయారు. ఆసిఫ్‌ షేక్‌, లోకేశ్‌ బామ్‌ రెండు సిక్సర్లు సహా 22 పరుగులు పిండుకొని ఇంగ్లండ్‌వైపు నుంచి మ్యాచ్‌ను తమవైపు మళ్లించుకున్నారు. 

ఆతర్వాత 19 ఓవర్‌లోనూ 14 పరుగులు రావడంతో ఇంగ్లండ్‌ శిబిరంలో కలవరం మొదలైంది. పసికూన అయినా, నేపాల్‌ను తక్కువ అంచనా వేయడం తప్పని అప్పుడు వారికి అర్దమైంది. కొంచెం అటుఇటు అయి ఉంటే, ఇంగ్లండ్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చేది. 

నేపాల్‌ బ్యాటర్లు ఆది నుంచే అద్భుతంగా ఆడారు. ఓపెనర్‌ కుషాల్‌ భుర్టెల్‌ (29) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (44), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (39) మూడో వికెట్‌కు 54 బంతుల్లో 82 పరుగులు జోడించి అప్పుడే ఇంగ్లండ్‌ను భయపెట్టారు. ఆఖర్లో లోకేశ్‌ బామ్‌ ఇంగ్లండ్‌ను కంగారు పెట్టాడు. 

ఈ మ్యాచ్‌లో నేపాల్‌ ఓడినా, యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అభిమానాన్ని చూరగొంది. అంతకుముందు నేపాల్‌ బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను ఇబ్బందులకు గురి చేసింది. జేకబ్‌ బేతెల్‌ (55), హ్యారీ బ్రూక్‌ (53), విల్‌ జాక్స్‌ (39 నాటౌట్‌) సత్తా చాటకపోయుంటే బౌలింగ్‌కు దిగకముందే మ్యాచ్‌ ఓడిపోయి ఉండేది. 

వారు ముగ్గురు రాణించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  నందన్‌ యాదవ్‌, దీపేంద్ర సింగ్‌ తలో 2, షేర్‌ మల్లా, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో వికెట్‌ తీసి సత్తా చాటారు. నేపాల్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 12) ఇటలీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ తప్పక గెలిచే అవకాశం ఉంది.