శాంతిపథం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

నేటి ఉరుకులు పరుగుల జీవనపోరాటంలో ‘శాంతి’ అనే పదానికి చోటు లేకుండా పోయింది. చీకూచింతా లేకుండా ఉండటమే ‘శాంతి’ అని చెప్పవచ్చు. కానీ సంకటాలు లేని మనిషి జీవితం ఊహకందదే. తెల్లారి నిద్ర లేచింది మొదలు రకరకాల ఈతి బాధలు. సంసారం, సంపాదన, సంతానం... వీటి చుట్టూనే సమస్యలన్నీ. కోరికలే బాధలకు మూలమన్నాడు గౌతమబుద్ధుడు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎప్పుడైనా కోరిక లేకుండా గడపడం సాధారణ మనిషికి ఎలా సాధ్యం?
రకరకాల విద్యలు నేర్చుకోవాలన్న కోరిక, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలన్న ఆశ, మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆకాంక్ష, సంసారం సుఖంగా సాగిపోవాలన్న ఇచ్ఛ, సంతానాన్ని వృద్ధిలోకి తేవాలన్న ఆశయం... ఇవేవీ లేకుంటే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అయితే ఈ కోరికలన్నీ ధర్మాన్ని అనుసరించాలి. ధర్మబద్ధమైన కోరిక అత్యాశకు అవకాశమివ్వదు. మనిషి పెరిగే క్రమంలో ఏర్పడే కోరికలన్నిటినీ ధర్మబద్ధంగా సాధించడానికి శ్రమించాలి. దాని ద్వారా కలిగే తృప్తి అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందమే మనశ్శాంతికి దారితీస్తుంది.
మనశ్శాంతి ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా లభిస్తుంది. తన కుటుంబ సౌఖ్యంతోపాటు పరోపకారమనే తోవలో నడిచేవారికి తృప్తి, తద్వారా మనశ్శాంతి లభిస్తాయి. శ్రీకృష్ణుడు బాల్యక్రీడలు ఆడిఆడి అలసి మిత్రులతో ఒక చెట్టు కింద విశ్రమిస్తాడు. చెట్టును ఆదర్శంగా తీసుకోగలిగితే మానవజన్మ ధన్యమవుతుందని మిత్రులకు వివరిస్తాడు. శత్రువుకు కూడా నీడనిచ్చి ప్రేమతో చూడటం చెట్టుకే సాధ్యం. రాళ్లతో కొట్టినా పండ్లనే ఇస్తుంది, నరికినా కలపనిస్తుంది. అలా మనిషి తీరుతెన్నులు ఉంటే అది ఇచ్చే తృప్తికి వెలకట్టగలమా?
కోరిక లేనిదే అసలు లోకం ఈ విధంగా అభివృద్ధిపథాన నడవగలిగేదా? 2030 నాటికి చంద్రమండలంపైకి మానవసహిత అంతరిక్ష నౌకను పంపాలనే లక్ష్యం కొందరు శాస్త్రవేత్తలది. భయంకర రోగాలకు చికిత్స కనిపెట్టాలనే లక్ష్యం కొందరు పరిశోధకులది. కోరిక వ్యక్తిగతమైతే లక్ష్యం సామాజికమైనది. ఇవన్నీ దేశానికి గర్వకారణం! పరులకు హాని కలిగించని కోరిక సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి ఉత్తమ ఫలితాలను సాధించడంలోనే తృప్తి ఉంటుంది. నేటి యాంత్రిక జీవితగమనంలో నైతిక విలువలు, ఆప్యాయత, అనురాగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులే వ్యక్తులకూ, సమాజానికీ అశాంతి కారకాలవుతున్నాయి. కుటుంబాలలో పెద్దలను చూసే, వారి జీవనశైలి నుంచే సచ్ఛీలత, ప్రేమానురాగాలను నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి పెద్దవాళ్ల చేతలు అనుసరణీయమైనవి కావాలి. తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను వదిలి శాంతిని వెతుకుతూ వెళ్లిన విష్ణుశర్మ అసలైన శాంతి తన ధర్మాన్ని తాను నిర్వర్తించడంలోనే ఉందని ధర్మవ్యాధుని ద్వారా తెలుసుకుంటాడు. తల్లిదండ్రుల సేవ, భార్యాబిడ్డల సంరక్షణ ఇవి గృహస్థు ధర్మాలు. వాటిని ఆచరించడంలోనే మనసుకు ‘శాంతి’ లభిస్తుందని గ్రహిస్తాడు. ఇలానే కదా ఇళ్లన్నీ శాంతినివాసాలయ్యేది!
స్థూలంగా సమాజం శాంతియుతంగా ఉండాలంటే ప్రతి వ్యక్తీ తన వయసు ధర్మం, వృత్తిధర్మం పాటించాలి. ఇతరుల మేలు కోరాలి. తద్వారా కలిగే తృప్తే మనసుకు హాయినిస్తుంది. శాంతియుత జీవనమే ఆదర్శప్రాయం, ఆచరణీయం.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :