Mo Farah: ఎంత వేగంగా?

Eenadu icon
By Editorial Team Published : 09 Jan 2026 04:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

‘‘మోఫరా కూడా ఉసేన్‌ బోల్ట్‌ లానే వరల్డ్‌ ఛాంపియన్‌ సార్‌. ఉసేన్‌ బోల్ట్‌ గోల్డ్‌ మెడల్‌ గెలిచిన అదే ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు గోల్డ్‌ మెడల్స్‌ గెలిచాడు. కానీ అది 100 మీటర్లలో కాదు... 200 మీటర్లలోనూ కాదు. అయిదువేల మీటర్లు... పదివేల మీటర్లు. కానీ ఎవరికీ మో ఫరా గుర్తుండడు. కేవలం వంద మీటర్లు వేగంగా పరిగెత్తే ఉసేన్‌ బోల్ట్‌ని గుర్తుపెట్టుకుంటారు...’’

‘మహర్షి’ సినిమాలోని ఈ డైలాగ్స్‌ చాలామందికి తెలుసు. కానీ తెలియని విషయం ఒకటుంది. మో ఫరా 2023లో పరుగు పోటీల నుంచి రిటైర్‌ అయితే, ఆయనకన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడైన బోల్ట్‌ 2017లోనే అనారోగ్యం కారణంగా పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2017 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 400 మీటర్ల రిలేలో ఉసేన్‌ బోల్ట్‌ గాయంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అదే చోట పదివేల మీటర్ల పోటీలో మో ఫరా కాంస్య పతకం సాధించి విజేతగా నిలిచాడు.

మో ఫరా తన చివరి పోటీని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ముగిస్తే, బోల్ట్‌ ప్రేక్షకుల జాలి చూపుల మధ్య నిస్సహాయంగా ముగించాడు. ప్రస్తుతం మో ఫరా తన రిటైర్మెంట్‌ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటే, బోల్ట్‌ మాత్రం వెన్నెముక, మడమ సమస్యలతో బాధపడుతున్నాడు. మెట్లు ఎక్కాలంటే ప్రాణం పోయినట్లుగా ఉంటుందని ఆయనే స్వయంగా చెప్పాడు. బోల్ట్‌ విజయాల నుంచి స్ఫూర్తి పొందడంతో పాటు, ఆయన ప్రస్తుత పరిస్థితి నుంచి పాఠాలు నేర్చుకోవడం కూడా అవసరమే.

వంద మీటర్ల పరుగు పందెంలో వేగమే ప్రధానం. అందుకే ఆ పది సెకండ్లూ సర్వశక్తులూ ఒడ్డి పరిగెడతారు. కానీ లాంగ్‌ డిస్టెన్స్‌ పోటీ అలా ఉండదు. నిలకడగా ఎక్కువసేపు పరిగెత్తాల్సి ఉంటుంది. అందుకే వంద మీటర్ల రేస్‌లో ఉండే మజా లాంగ్‌ డిస్టెన్స్‌ రేస్‌లో ఉండదు. కానీ జీవితం 100 మీటర్ల పరుగు పందెం కాదు... వందేళ్ల మారథాన్‌. ఇందులో గెలవడానికి వేగం ఒక్కటే సరిపోదు. నిలకడగా ఎక్కువ కాలం పాటు పరిగెత్తే వారిదే గెలుపు. ఆ విషయం తెలియక కొంతమంది వేగంగా పరిగెత్తుతూ మార్గమధ్యంలోనే పోటీనుంచి తప్పుకొంటుంటారు. 

జీవితంలో వేగంగా ఎదగాలనుకోవడం తప్పుకాదు. కానీ ఎంత వేగంగా? వృద్ధులైన తల్లిదండ్రుల్ని పలకరించలేనంత వేగంగానా? పిల్లలు ఏ క్లాసు చదువుతున్నారో తెలుసుకోలేనంతా? జీవిత భాగస్వామితో వారానికోసారైనా కలిసి కాఫీ తాగలేనంతా? ఆఖరికి ఇష్టమైన పదార్థాలను కూడా తృప్తిగా తినలేనంత వేగంగానా? 

ఆరోగ్యం, కుటుంబం, విలువలు, సామాజిక బంధాలను కాపాడుకుంటూ నిలకడగా పరిగెత్తే వారికి ఉసేన్‌ బోల్ట్‌ అంత గొప్ప పేరు, సంపద రాకపోవచ్చు. కానీ అతనిలా బాధపడే పరిస్థితి మాత్రం రాదని కచ్చితంగా చెప్పొచ్చు!

అభివృద్ధి పేరుతో ఆత్మహత్యాసదృశమైన కార్యక్రమాలు చేపట్టడమే హిమాలయాల్లాంటి చోట్ల ప్రజల జీవితాలు సంక్షోభంలో పడటానికి కారణం. స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం శాశ్వతంగా ఉండాల్సిన పర్వతాలనూ నదులనూ నాశనం చేసుకుంటున్నాం. 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.