
Revanth Reddy: సర్.. వెనుక పెద్ద కుట్ర

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, హైదరాబాద్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరిట చేపట్టిన కార్యక్రమం వెనుక పెద్ద కుట్ర దాగుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇల్లు, ఆస్తిలేని పేదలకు ఓటుహక్కు ఒక గుర్తింపు అని, దాన్ని తీసివేసే పన్నాగంతోనే ‘సర్’ తీసుకొచ్చారన్నారు. ఓటుహక్కు పోతే ఆధార్, రేషన్‌కార్డులు పోతాయని అప్పుడు పేదలకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. కోట్ల మంది పేదలను కట్టుబానిసలుగా తయారు చేయడానికి భాజపా కుట్ర చేస్తోందని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
‘‘దేశ ప్రజలందరికీ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మోదీ కుట్రపన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమకు 400 సీట్లు ఇస్తే నూతన పరిపాలన తెస్తామంటూ ప్రజల దగ్గరకు వెళ్లారు. అదే జరిగితే... భాజపా రాజ్యాంగాన్ని కాలరాసి, దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తుందని, జాగ్రత్తగా ఆలోచించండని రాహుల్‌గాంధీ, ఖర్గేలు ప్రజలను చైతన్యపరిచారు. ఫలితంగా భాజపా 240 సీట్ల దగ్గరే ఆగిపోయింది. వారి ఆలోచనను మరో రూపంలో అమలు చేయడానికి ఓటరు జాబితాల ప్రక్షాళనకు బయలుదేరారు.
పేదలను కట్టుబానిసలుగా మార్చేందుకు...
పేదలను కార్పొరేట్ కంపెనీలకు కట్టుబానిసలుగా మార్చేందుకు ఉపాధి హామీ పథకానికి సవరణలు చేసిన మోదీ కొత్తగా జీ రామ్‌జీ చట్టాన్ని తెచ్చారు. అదానీ, అంబానీ వంటివారికి తక్కువ రేట్లకు కూలీలు దొరకడం లేదు. ఈ పథకాన్ని రద్దుచేస్తే పేదలు మళ్లీ గ్రామాల నుంచి పట్టణాలకు వలస వస్తారని, వారిని కార్పొరేట్ కంపెనీలకు తక్కువ రేటు కూలీలుగా మార్చొచ్చని మోదీ ప్రయత్నిస్తున్నారు. గతంలో వ్యవసాయాన్ని అమెజాన్, అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టాలని మూడు నల్ల చట్టాలను తెచ్చారు. వాటిని ఉపసంహరించుకునేలా చేసి, ఈ జాతికి క్షమాపణ చెప్పిస్తానని అప్పుడు రాహుల్‌గాంధీ స్పష్టంగా మోదీకి చెప్పారు. అప్పటివరకూ పోరాటం చేస్తామన్నారు. అది నిజమైంది.
గ్రామసభల తీర్మానాల బాధ్యత మంత్రులదే
రాష్ట్రమంతా సర్పంచులు ఈ నెల 20 నుంచి 30లోగా గ్రామసభలు పెట్టి జీ రామ్‌జీ చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మొత్తం 15 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక్కో మంత్రి బాధ్యత తీసుకుని... ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలంటూ గ్రామసభల్లో తీర్మానించేలా చూడాలి. ప్రతి మండలానికి ఒక నాయకుడిని నియమించి బాధ్యతలు అప్పగించాలి. నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుని పర్యవేక్షిస్తా. ఫిబ్రవరి 3న మహబూబ్‌నగర్‌తో ప్రారంభించి తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో లక్ష మంది చొప్పున ప్రజలతో బహిరంగ సభలు పెట్టి ఈ పథకంలో తెచ్చిన మార్పులను ప్రజలకు చెపుతా. ములుగులో సభకు సోనియాగాంధీ వచ్చేలా చూస్తాం. ఆమె రాలేకపోతే ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీలను తీసుకొస్తాం.
పంచాయతీ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలు 66% విజయాలు సాధించారు. ఇక మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తేనే మంత్రులు, ఎమ్మెల్యేలు నిధులివ్వగలరని ప్రజలకు చెప్పాలి. భారాస వాళ్లు శాసనసభలో చర్చలకే రావడం లేదు. గత రెండేళ్లలో వారిలో ఒక్కరైనా సమస్యల పరిష్కారానికి నిధులు కావాలని నన్ను అడగలేదు. భారాసకు అభివృద్ధిపై పట్టింపు లేదనే విషయాన్ని ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు వివరించాలి.
గెలిచిన వారే గొప్పవారు
ప్రభుత్వంలోని చాలామంది మంత్రులు తాతల వారసత్వం నుంచి వచ్చినవారు కాదు. సీతక్క మారుమూల గూడెం నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చారు. సమక్క-సారలమ్మ గద్దెల అభివృద్ధికి నిధులు తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఓడితూ ఎన్ని చెప్పినా ఎవరూ వినరు. గెలిచిన వారే గొప్పవారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, పంచాయతీ ఎన్నికల్లో గల్లీగల్లీలో సీఎం ఎందుకు తిరుగుతున్నారని కొందరు అన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే ఎవరు వింటారు? ఎన్నికల్లో పార్టీ బీఫాం ఎవరికి ఇస్తే వారిని గెలిపించాల్సిందే’’ అని సీఎం రేవంత్ స్పష్టంచేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, ప్రవీణ్ చక్రవర్తి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :