CM Chandrababu: ఆధ్యాత్మిక విధ్వంసానికి జగన్‌ కుట్ర

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 09 Jan 2026 04:18 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఈనాడు, అమరావతి: ఆధ్యాత్మిక వాతావరణాన్ని విధ్వంసం చేసే వ్యక్తి జగన్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ నాయకులే తప్పులు చేసి, వాటిని ప్రభుత్వానికి ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల నిర్వాకమే దీనికి తాజా నిదర్శనమన్నారు. ఆ పార్టీ నాయకులే ఖాళీ మద్యం సీసాలు పట్టుకొచ్చి తిరుమలలో పడేశారని, దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేందుకు జగన్‌ ఛానల్‌లో నానా యాగీ చేశారని ధ్వజమెత్తారు. ఆ మద్యం సీసాలపై ఉన్న హోలోగ్రామ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తే వాటిని ఎక్కడ కొన్నారు, ఎవరు పట్టుకొచ్చి తిరుమలలో వేశారన్నదీ తేలిందని తెలిపారు.

గురువారం మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా తీరును దుయ్యబట్టారు. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్‌ ప్రభుత్వ హయాంలోనే ఆగిపోయింది. ఆ నెపాన్ని మనపై నెట్టేయాలని చూస్తున్నారు. భోగాపురం విమానాశ్రయంపై గతంలో జగన్‌ విషం కక్కారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ చొరవతో ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుంటే.. క్రెడిట్‌ చోరీ అంటూ అవాకులూచవాకులూ మాట్లాడుతున్నారు. మంత్రులు అప్రమత్తంగా ఉండి.. వైకాపా కుట్రల్ని, కుయుక్తుల్ని తిప్పికొట్టాలి’ అని పేర్కొన్నారు. 

సముద్రంలోకి పోయే నీళ్లను తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మేలు

సముద్రంలోకి వృథాగా పోయే నదీ జలాల్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మేలని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం, నల్లమల సాగర్‌ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. నీటి లభ్యత పెరిగితే స్థానిక వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావాన్ని బట్టి లాభసాటిగా ఉండే కొత్త పంటల్ని సాగు చేసేలా రైతుల్ని ప్రోత్సహించవచ్చని చెప్పారు.

2029కి యూనిట్‌ విద్యుత్‌పై రూ.1.19 తగ్గిస్తాం 

గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు 13 పైసలు తగ్గించామని, మార్చి నాటికి మొత్తం 39 పైసలు తగ్గించాలన్నది లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి యూనిట్‌పై రూ.1.19 తగ్గిస్తామన్నారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించడంతో పాటు వైకాపా ప్రభుత్వ హయాం నాటి రూ.4,498 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తోందని సీఎం పేర్కొన్నారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలంటే ఉత్పత్తి బాగా పెరగాలని, పంపిణీ నష్టాలు తగ్గాలని, కొత్త సబ్‌ స్టేషన్లు, విద్యుత్‌లైన్లు వంటి మౌలిక వసతులు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. పీఎం కుసుమ్‌ ప్రాజెక్టును వచ్చే ఏడాది వేసవి నాటికి నూరు శాతం పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సీఎం మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా ప్రతి నెలా రాష్ట్ర జీఎస్‌డీపీని లెక్కిస్తున్నామని తెలిపారు. సీఎం చెప్పిన ఇతర అంశాలివీ..

మంత్రులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి  

  • మంత్రులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆర్థిక అంశాలపైనా లోతైన అవగాహనతో మాట్లాడాలి. 
  • ప్రపంచంలో జలరవాణా అత్యంత చౌక. రాష్ట్రంలో సముద్రతీరం ఉన్న ప్రతి జిల్లాలోనూ పోర్టులు అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఉపరితల జలరవాణా ప్రాజెక్టును ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతాం.  
  • కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్న పీపీపీ విధానాన్ని అందిపుచ్చుకోవడంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ విధానంలో 270 ప్రాజెక్టులు చేపట్టాం. 2026-27లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా ప్రాజెక్టుల్ని దీనికింద చేపడతాం. 

పర్యాటక హబ్‌గా సూర్యలంక 

  • బాపట్ల జిల్లాలోని సూర్యలంకను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాం. అక్కడ ఇప్పటికే 1,100 హోటల్‌ గదులున్నాయి. కొత్తగా ఒక త్రీస్టార్, రెండు ఫైవ్‌స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాం. రెండేళ్లలో అవి అందుబాటులోకి వస్తాయి. సూర్యలంక హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తారు. 
  • వైకాపా హయాంలో వచ్చిన చెడ్డపేరును తొలగించి, పెట్టుబడులకు రాష్ట్రం అత్యంత అనుకూలమైన ప్రదేశమన్న బ్రాండ్‌ ఇమేజ్‌ను చాలా త్వరగా తీసుకురాగలిగాం. దాన్ని మరింతగా పెంచుకోవాలి. ఇప్పటి వరకు ఒప్పందాలు జరిగిన ప్రాజెక్టులన్నీ ఆచరణలోకి వచ్చేలా అధికారులతో మంత్రులు సమన్వయం చేసుకోవాలి. 
  • ఫెర్రోఅల్లాయ్స్‌ పరిశ్రమలు ఏడాదిలోగా సొంత విద్యుత్‌ ప్లాంట్‌లు, బ్యాటరీ స్టోరేజీ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తాం. ఈలోగా వారికి విద్యుత్‌ రాయితీలు ఇస్తాం. 
  • ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించాం. కోకో, మామిడి, ఉల్లి, బ్లాక్‌బర్లీ పొగాకు వంటి వంటలు సాగు చేసిన రైతుల్నీ ప్రభుత్వం ఆదుకుంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:11 IST