Stock market: ఐదో రోజూ నష్టాలే.. 25,700 దిగువకు నిఫ్టీ

Eenadu icon
By Business News Team Published : 09 Jan 2026 16:24 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు ప్రభావం చూపాయి. ముఖ్యంగా రియల్టీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఆటో స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ మళ్లీ 25,700 దిగువకు చేరింది. గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 2,200 పాయింట్లకు పైగా పతనమైంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌లపై ఆ దేశ సుప్రీంకోర్టు నేటి (శుక్రవారం) రాత్రి తీర్పు వెలువరించనుంది. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మన మార్కెట్లకు ఊరట కలుగుతుంది. అనుకూలంగా తీర్పు వస్తే ఆయా దేశాలపై మరిన్ని టారిఫ్‌లు విధించేందుకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఇది మార్కెట్లకు ప్రతికూల అంశం. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు.

సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 84,022.09 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,180.96) నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపు లాభాల్లో కదలాడిన సూచీ.. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం తర్వాత మరింత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఇంట్రాడేలో 83,402.28 వద్ద కనిష్ఠాలను తాకిన సూచీ.. చివరకు 604.72 పాయింట్ల నష్టంతో 83,576.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 193.55 పాయింట్ల నష్టంతో 25,683.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.16గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ప్రధానంగా ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బీఈఎల్‌, రిలయన్స్‌, ఎటెర్నల్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 62.12 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4,471 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :