Droupadi Murmu: ద్రౌపదీముర్ము జీవితం.. ఒక దిక్సూచి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Jan 2026 04:44 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, అమరావతి, విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ‘రాష్ట్రపతి ద్రౌపదీముర్ము జీవితం నేటితరానికి ఆశాకిరణం. ఆమె జీవితంలోని ప్రతి దశ.. విద్యార్థులు, యువత, మహిళలకు మార్గదర్శనం. ఓ సామాన్య మహిళ.. పట్టుదలతో చదువుకుని, అంచెలంచెలుగా పైకి ఎదిగి.. దేశమే గర్వించే స్థాయికి చేరిన విధానం ప్రతి ఒక్కరికీ దిక్సూచి లాంటిది’ అని ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు కొనియాడారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ‘అగ్ని సరసులో వికసించిన కమలం ద్రౌపదీముర్ము’ పుస్తకావిష్కరణ సభ విజయవాడలోని చిగురుపాటి కృష్ణవేణి పాఠశాలలో శనివారం జరిగింది. ఎమెస్కో విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హరిబాబు ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము జన్మించిన రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండి.. ఆమె జీవితచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. 

అగ్నిసరసులో వికసించిన కమలం అనే ఈ పుస్తకం పేరే.. ఆమె జీవితానికి దర్పణంలా ఉందని హరిబాబు పేర్కొన్నారు. ‘మౌనంగా బాధలను భరిస్తూ.. మహోన్నత శిఖరాలను అధిరోహించిన ఒక సాధారణ మహిళ.. అసాధారణ కథకు ఈ పేరు సంపూర్ణ న్యాయం చేస్తుంది. ఒక కుగ్రామంలో జన్మించి.. పరిమిత వనరులు, సామాజిక అడ్డంకులు, కష్టాలతో కూడిన గిరిజన నేపథ్యం నుంచి.. అత్యున్నత స్థానానికి ఎదిగారు. జీవితాన్ని ఎక్కడ ఆరంభించామన్నది కాదు.. ఎంత దూరం వెళ్లామన్నదే ముఖ్యం అనే గొప్ప సత్యాన్ని.. ఆమె జీవితం చాటిచెబుతోంది. కళాశాలలో చదువు పూర్తిచేసిన తర్వాత.. ఒక చిన్న పాఠశాలలో అధ్యాపకురాలిగా ఆరంభించి.. తర్వాత వార్డు కౌన్సిలర్‌గా ప్రజా జీవితంలోకి ప్రవేశించి.. రాష్ట్రపతి స్థాయికి ఎదిగి.. దేశ మహిళలకు అచంచలమైన ఆత్మవిశ్వాసం అందించారు’ అని హరిబాబు కొనియాడారు. చదువుతో కుటుంబ స్థితిగతులే కాకుండా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కూడా మారుతుందనడానికి ఆంధ్రప్రదేశ్‌ ఒక ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ద్రౌపదీముర్ము పుస్తకం ఒక జీవితచరిత్ర మాత్రమే కాదని, ఇది ఎంతోమందికి ప్రేరణ అన్నారు. కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సీనియర్‌ పాత్రికేయులు కృష్ణారావు, చిగురుపాటి కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత వరప్రసాద్, వేములపల్లి విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

పుస్తక ప్రదర్శనను సందర్శించిన హరిబాబు

36వ విజయవాడ పుస్తక ప్రదర్శనను ఒడిశా గవర్నర్‌ హరిబాబు శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. వందల స్టాళ్లను ఏర్పాటుచేసి అన్నిరకాల పుస్తకాలూ ఒకేచోట ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రదర్శనలను అందరూ తప్పకుండా సందర్శించాలన్నారు. డిజిటల్‌ వేదికలపై చదువుకునేందుకు ఎన్నో అవకాశాలున్నా.. పుస్తకం ద్వారా కలిగే తృప్తి వాటిలో ఉండదని పేర్కొన్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :