Deputy cm pawan kalyan: కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటున్నా

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 Jan 2026 06:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈనాడు, కరీంనగర్‌- మల్యాల, కొడిమ్యాల, న్యూస్‌టుడే: కొండగట్టు అంజన్న అంటే తనకిష్టమని.. ఆయన తనకు పునర్జన్మనిచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గతంలో తన వాహనానికి హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తగిలినప్పుడు తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ తెలియదని.. ఇది ముమ్మాటికీ కొండగట్టు అంజన్న దయేనని చెప్పారు. అందుకే స్వామి పట్ల అపార భక్తిని, కృతజ్ఞతను కనబర్చేందుకు తన వంతు సేవ చేస్తున్నానన్నారు. శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో తితిదే నిధులు రూ.35.19 కోట్లతో నిర్మించ తలపెట్టిన 96 గదుల ధర్మసత్ర భవన సముదాయంతోపాటు మాల విరమణ క్షేత్ర నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. ‘‘గతంలో ఈ ఆలయానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాన్ని నిర్మించాలని అర్చకులు కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటవడంతో ఈ విన్నపాన్ని తితిదే బోర్డు సభ్యుల ముందు పెట్టగా వారు ఆమోదించడంతో ఈ నిధులు వచ్చాయి. ఇందుకు సహకరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడులకు కృతజ్ఞతలు. మోదీ, చంద్రబాబుల సహకారంతో ఇలా అంజన్న దేవుడి రుణాన్ని తీర్చుకుంటున్నా. కొండగట్టు అంజన్న విశ్వాంతర్యామి. ఆయనకు సేవ చేసుకునే అవకాశాన్ని భాగ్యంగా భావిస్తున్నా. తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కోరిన విధంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ వసతికి నా వంతు సహకారం అందిస్తా. నేను కూడా వచ్చి అందుకోసం కరసేవ చేస్తా. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఉప ఆలయాల్ని కూడా దర్శించుకున్నారు. 

రాజ్యాంగానికి మాత్రమే కొమ్ముకాస్తా..

తెలంగాణలో పోరాట శక్తి ఉన్న యువతకు కొదవ లేదని.. అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు బలాన్నిస్తాయని పవన్‌కల్యాణ్‌ అన్నారు. జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్‌లో తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నాయకులతో అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘జనసైనికులు తెలంగాణకు భవిష్యత్తు కావాలి. డబ్బున్న నాయకులు నాకు వద్దు.. దమ్మున్న యువత కావాలి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే నేను పార్టీ పెట్టాను. నాకు సిద్ధాంతం లేదని కొందరు విమర్శిస్తుంటారు.. సిద్ధాంతపరంగా లెఫ్టో, రైటో ఏదో ఒకటి తెల్చుకోవడం తేలిక. కానీ నిలకడగా ఉండటమే కష్టం. అందుకే జనసేన పరంగా నేను సెంట్రలిస్ట్‌ని. దేశంలో మెజారిటీ శాతం ప్రజలు పాటించే హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన నేను ఇస్లాంను వ్యతిరేకించినట్లు కాదు. నేను ఏ వర్గానికి, మతానికి కొమ్ముకాయను. కేవలం రాజ్యాంగానికి మాత్రమే కొమ్ముకాస్తా. ఏపీ నుంచి తెలంగాణకు వలసలు పెరిగితే ఇక్కడ ఉన్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. అక్కడ ప్రగతి కనిపిస్తే వలసలు తగ్గి తెలంగాణ యువతకు కూడా మేలు జరుగుతుంది’ అని పేర్కొన్నట్లు పార్టీ నాయకులు ప్రకటనలో తెలిపారు. సమావేశంలో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్, ప్రచార కార్యదర్శి సాగర్‌తోపాటు రాష్ట్ర మహిళా నాయకులు శిరీష, స్వాతిరెడ్డి, లిఖిత పాల్గొన్నారు. 

పార్టీ నేతలతో సమావేశానంతరం పవన్‌ కల్యాణ్‌ హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లడానికి కారులో రిసార్టు నుంచి బయటకు వస్తుండగా గేటు బయట వందల సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. వారి కోసమని వాహనంపై కూర్చుని అభివాదం చేస్తూ వచ్చారు. వాహనం ముందుకు కదులుతున్న సమయంలో పైన కేబుల్‌ టీవీకి సంబంధించిన తీగలు కనపడగానే అప్రమత్తమైన పవన్‌కల్యాణ్‌ ఒక్కసారిగా వాహనంపైన పడుకున్నారు. తర్వాత లేచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 04:43 IST