గంజాయి తాగి పట్టుబడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్: ఏపీలోని జమ్మలమడుగు ఎమ్మెల్యే, భాజపా నేత ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి గంజాయి తీసుకుని తెలంగాణ ఈగల్(ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. శనివారం నార్సింగిలోని తన విల్లాలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు సోదాలు నిర్వహించారు. డ్రగ్ కిట్‌తో పరీక్షలు చేయగా సుధీర్‌కు పాజిటివ్ వచ్చింది. ఈగల్ అధికారుల వివరాల ప్రకారం.. సుధీర్‌రెడ్డి(36) నార్సింగిలోని ఏక్తా హైలాండ్ పార్క్‌లోని ఒక విల్లాలో ఉంటున్నారు. అక్కడ పార్టీ జరుగుతోందని, గంజాయి వినియోగిస్తున్నారని ఈగల్ అధికారులకు సమాచారం అందింది. ప్రత్యేక బృందం శనివారం మధ్యాహ్నం సమయంలో విల్లాలో ఆకస్మిక తనిఖీలకు దిగింది. అక్కడ మొత్తం ముగ్గురుండగా సుధీర్ వ్యవహార తీరు అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులతో వాదనకు దిగారు. దీంతో వారు డ్రగ్ కిట్‌తో పరీక్షించగా గంజాయి పాజిటివ్ వచ్చింది. మిగిలిన ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. వారిలో ఒకరు సుధీర్‌రెడ్డి బంధువు, మరొకరు స్నేహితుడని తేలింది. అనంతరం పోలీసులు విల్లా మొత్తం తనిఖీలు చేయగా.. ఎలాంటి మత్తుపదార్థాలు దొరకలేదు. సరఫరా చేసినట్లు కూడా ఆధారాలు లేకపోవడంతో వినియోగదారుడి కింద పరిగణించి డీఎడిక్షన్ కేంద్రానికి తరలించాలని నిర్ణయించారు. అతని ఫ్యామిలీ డాక్టర్, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా సమాధానం చెప్పలేదని ఓ అధికారి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ కారిడార్‌లో ఓ మహిళ అనుచరుల ద్వారా గంజాయి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :