Mustafizur Rahman: ముస్తాఫిజుర్‌ను పంపేయండి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

గువాహటి: బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కేకేఆర్ వేలంలో రూ.9.20 కోట్లకు ముస్తాఫిజుర్‌ను దక్కించుకుంది. ఇప్పుడు అతడి స్థానంలో కోల్‌కతా మరొక ఆటగాడిని తీసుకోవడానికి అనుమతిస్తామని బీసీసీఐ చెప్పింది. ‘‘జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. అవసరమైతే ఆ జట్టు అతడి స్థానంలో మరొకరిని తీసుకోవచ్చు. కోరితే అందుకు అనుమతిస్తాం’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం చెప్పాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేసినట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఓ హిందువు హత్య నేపథ్యంలో ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్‌ను ఆడించడానికి సంబంధించి బీసీసీఐపై ఒత్తిడి బాగా పెరిగింది. కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ కూడా విమర్శలకు గురయ్యాడు. ముస్తాఫిజుర్ 2016 నుంచి 8 ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. అతడు సన్‌రైజర్స్, ముంబయి, దిల్లీ, చెన్నై, రాజస్థాన్ ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆ సిరీస్ అనుమానమే..:భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ కూడా ఆగిపోయినట్లే. షెడ్యూలు ప్రకారం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే అవకాశం కనిపించట్లేదు. బంగ్లాలో భారత్ ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాల్సివుంది. సెప్టెంబరు 1, 3, 6వ తేదీల్లో వన్డేలు, సెప్టెంబరు 9, 12, 13వ తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగాల్సివుంది. నిజానికి ఈ సిరీస్ నిరుడే జరగాల్సినప్పటికీ భద్రత కారణాలతో భారత్ వెళ్లలేదు. ఈసారి కూడా బీసీసీఐ బంగ్లా పర్యటనకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేయమని కేకేఆర్‌ను ఆదేశించడం దీనికి సూచికగా భావిస్తున్నారు. గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస చెలరేగుతోంది. ముందు ముందు భారత్-బంగ్లా క్రికెట్ సంబంధాలు కూడా భారత్-పాక్ క్రికెట్‌లాగే మారితే ఆశ్చర్యం లేదు.
భారత్‌లో బంగ్లా ప్రపంచకప్ ఆడుతుందా?:తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌లో బంగ్లాదేశ్ 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్‌కు సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకున్నామని, ప్రపంచకప్ గురించి చర్చించలేదని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ చెప్పాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :