Cyber crime: విజయవాడలో తెరుస్తున్న ఖాతాలు.. ఫిలిప్పీన్స్‌లో తేలుతున్నాయ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, అమరావతి: నిరుద్యోగులు, అమాయకులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఆ వివరాలను చట్టవిరుద్ధ లావాదేవీల కోసం ఫిలిప్పీన్స్‌కు పంపిస్తున్న విజయవాడకు చెందిన ముఠాను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. కరెంటు ఎకౌంట్ తెరిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించి, బ్యాంకు ఎకౌంట్లు సేకరిస్తున్న ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన అనుమానితుల కోసం గాలిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలివి.. విజయవాడకు చెందిన పేరపోగు దేవదాసు.. ఓ నిరుద్యోగి. గతేడాది అతని ఇంటిపక్కన ఉండే కృష్ణారెడ్డి (ఏ3).. దేవదాసును కలిసి బ్యాంకులో కరెంటు ఎకౌంట్ తెరిచి, ఆన్‌లైన్‌లో షేర్ చేస్తే డబ్బులిస్తారని ఆశ చూపించాడు. రూ.10 వేలు వస్తాయన్న ఆశతో కృష్ణారెడ్డితో కలిసి దేవదాసు భవానీపురంలోని సిటీ యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ కరెంటు ఖాతా తెరిచి, కిట్‌ను కృష్ణారెడ్డికి ఇచ్చాడు. తర్వాత బాధితుడి ఫోన్‌పే ఖాతాలకు రూ.7 వేలు జమ చేశారు. ఇటీవల దేవదాసు.. తన ఖాతాను పరిశీలించగా రూ.2 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించాడు. భయపడి విజయవాడలోని సైబర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

ఫిలిప్పీన్స్‌కు చేరుతున్న ఖాతాలు
కృష్ణారెడ్డిని పోలీసులు విచారించగా కీలక విషయాలు వెలుగుచూశాయి. అతని భార్య సౌభాగ్యలక్ష్మి (ఏ4) కూడా అమాయకులతో బ్యాంకు ఖాతాలు తెరిపించేదని తేలింది. వీరిపై నగరానికి చెందిన సూర్య శ్రీనివాస మణికంఠ ఎలియాస్ సూర్య (ఏ1) పర్యవేక్షించేవాడు. కృష్ణారెడ్డి దంపతులు సేకరించిన ఖాతాలను ఏ1 తీసుకొని.. వాటిని చట్టవిరుద్ధ లావాదేవీల కోసం పార్వతి(ఏ2)కి ఇచ్చేవాడు. ఆమె వీటిని ఫిలిప్పీన్స్‌లో ఉన్న మరో మహిళకు అందించేది. అక్కడి నుంచి ఈ ఖాతాలను బెట్టింగ్‌లు, సైబర్ నేరాల్లో సొమ్ము బదిలీలకు వాడేవారు. ప్రతి ఖాతాకూ వీరికి రూ.30 వేల కమీషన్ అందేది. ఆ డబ్బును అన్ని దశల్లో పంచుకునేవారు. ఈ ముఠా మొత్తం 199 ఖాతాలు తెరిపించగా, వాటిలో 36 ఖాతాల ద్వారా 56 లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ, కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో జరిగిన మోసాలకు ఈ ఖాతాలను ఉపయోగించారు.
ప్రధాన నిందితుడు సూర్యను.. 2023లోనూ అద్దె ఖాతాల కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా పోలీసులు అరెస్టు చేశారు. 9 నెలలు జైలులో గడిపాడు. బయటకు వచ్చాక టెలిగ్రామ్ ద్వారా అద్దె ఖాతాలు సేకరిస్తూ దందా కొనసాగిస్తున్నట్లు తేలింది. పోలీసులు సూర్యతో పాటు కృష్ణారెడ్డి, అతని భార్య సౌభాగ్యలక్ష్మిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్య తన కారుపై రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేరుతో ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ వేసుకున్నారు. దీనిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక నిందితురాలు పార్వతి సహా పలువురి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 05:27 IST