
Venezuela: అగ్గి రాజేసింది చమురే!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
లాటిన్ అమెరికా దేశాలపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు ఏళ్ల తరబడి కొరకరాని కొయ్యలుగా మారిన వాటిల్లో ఒకటి క్యూబా... మరొకటి వెనెజువెలా. 1961 నుంచి క్యూబాలో, 1999 నుంచి వెనెజువెలాలో సైద్ధాంతికంగా తనకు ఏమాత్రం నచ్చని ప్రభుత్వాలు అక్కడ కొలువుదీరడాన్ని అమెరికా సహించలేకపోతోంది. వాటిని కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. తీవ్రమైన ఆంక్షలు విధించడంతో ఆర్థికంగా కుంగిపోయినప్పటికీ ఆ రెండు దేశాలను అమెరికా తన దారికి తెచ్చుకోలేకపోయింది.
వెనెజువెలాపై ఆగ్రహం ఎందుకంటే...
హ్యూగో చావెజ్ 1999లో వెనెజువెలాలో అధికారంలోకి రాకముందు వరకూ ఆ దేశంలోని చమురు రంగంలో అమెరికా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. వెనెజువెలా పాలకులు అమెరికా అనుకూల విధానాలను అనుసరించారు. వెనెజువెలా చమురు ఎగుమతులకు అగ్రరాజ్యం అతిపెద్ద విపణిగా ఉండేది. సామ్యవాద సిద్ధాంతంతో, పేదరిక నిర్మూలన నినాదంతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఛావెజ్... దేశంలోని చమురు కంపెనీలన్నింటినీ జాతీయం చేశారు. దీంతో ఈ రంగంలో అమెరికా కంపెనీల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా ఛావెజ్... అమెరికా వ్యతిరేక దేశాలైన రష్యా, చైనా, ఇరాన్, క్యూబాలకు బాగా సన్నిహితమయ్యారు. చావెజ్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి అమెరికా మద్దతుతో జరిగిన తిరుగుబాటు 2002లో విఫలమైంది. ప్రజల భారీ మద్దతుతో రెండు రోజుల్లోనే ఛావెజ్ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారు.
చావెజ్ బాటలో మదురో...
అనారోగ్యంతో 2013లో చావెజ్ మృతి చెందగా ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన మదురో కూడా అమెరికా వ్యతిరేక విధానాలనే కొనసాగించారు. రష్యా, చైనా, ఇరాన్‌ల నుంచి ఆయుధాలు కొనుగోలు చేశారు. చావెజ్ అధికారంలో ఉన్నప్పుడు వెనెజువెలాపై మొదలైన ఆర్థిక ఆంక్షలను బరాక్ ఒబామా, జో బైడెన్, ట్రంప్ ప్రభుత్వాలు మరింత తీవ్రం చేశాయి. దీంతో దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం తలెత్తి నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రజల్లో అసంతృప్తి ప్రబలింది. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ వెనెజువెలా చట్టబద్ధమైన పాలకుడిగా మదురోను గుర్తించలేదు. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలన్న ఒత్తిళ్లకూ వెనెజువెలా అధ్యక్షుడు తలవంచలేదు. చావెజ్ మరణం తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన మదురో... 2018, 2024 ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ప్రకటించుకోవడం వివాదాస్పదమైంది. అమెరికా సహా 50 దేశాలు వెనెజువెలా అధ్యక్షుడిగా ఆయనను గుర్తించటానికి నిరాకరించాయి.
అమెరికాకు ఎందుకంత ఆసక్తి...
వెనెజువెలాలో చమురు, బంగారం, సహజవాయువు నిల్వలు దండిగా ఉన్నాయి.
ప్రపంచంలోనే భారీగా చమురు నిల్వలున్న దేశాల్లో ఇదొకటి. సుమారు 30,300 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయని అంచనా. సౌదీ అరేబియా చమురు నిల్వల కన్నా అధికం. వెనెజువెలా చమురు వనరులు అమెరికా చేతికి వస్తే పశ్చిమాసియా దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. చమురు విక్రయాలతో వస్తోన్న ఆదాయంతోనే తీవ్ర ఆంక్షలను సైతం వెనెజువెలా ఈ మాత్రంగా నైనా తట్టుకోగలగుతోంది. పైగా అమెరికా ఆధిపత్యాన్ని వెనెజువెలా పాలకులు తరచూ ప్రశ్నిస్తున్నారు. అమెరికా సైనిక దుస్సాహసానికి పాల్పడితే సమర్థంగా తిప్పికొట్టగలమని మదురో ఇటీవల ప్రకటించడంతో పాటు గత ఏడాది నవంబరు 12న దేశవ్యాప్తంగా సైనిక విన్యాసాలూ నిర్వహించారు.
భారత్‌కు ముడి చమురు ఎగుమతులు
2013లో భారత దేశ ముడి చమురు దిగుమతుల్లో 10.3శాతం వాటా వెనెజువెలా నుంచే ఉండేది. 2019లో ఇది 5.6శాతానికి, 2020లో 3.6శాతానికి తగ్గింది. అయితే, 2024 నుంచి మళ్లీ పెరుగుతోంది. భారత్‌కు ముడిచమురు ఎగుమతి చేసే దేశాల్లో వెనెజువెలా ప్రస్తుతం పదో స్థానంలో ఉంది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- షేక్ హసీనా అప్పగింతకు న్యాయ ప్రక్రియే కీలకం బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు.
- కప్ప విషంతో నావల్నీ హత్య రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని రష్యా ప్రభుత్వం.. డార్ట్ ఫ్రాగ్ అనే ఒక జాతి కప్ప విషంతో చంపిందని ఐదు ఐరోపా దేశాలు ఆరోపించాయి.
- రష్యా, ఉక్రెయిన్‌ల పరస్పర డ్రోన్ దాడులు యుద్ధాన్ని ముగించే దిశగా వచ్చేవారం చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం డ్రోన్ దాడులకు పాల్పడ్డాయి.
- ఐరోపాతో అమెరికా మైత్రి శాశ్వతం ఐరోపాతో తమ స్నేహ బంధం శాశ్వతమైనదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చిరకాల మిత్రదేశాలకు భరోసా ఇచ్చారు.
- ‘ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చండి’ ఇరాన్‌లో ప్రభుత్వ మార్పిడికై ఒత్తిడి తేవాలని విదేశాల్లో తలదాచుకుంటున్న ఆ దేశ మాజీ రాజు కుమారుడు రెజా పహ్లవీ శనివారం ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు.
- మాదక ద్రవ్యాల నౌకపై అమెరికా దాడి కరీబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఓ నౌకపై అమెరికా సైన్యం జరిపిన భీకర దాడిలో ముగ్గురు మరణించారు.