Bhogapuram: ఎన్నాళ్లో వేచిన ‘ఉదయం’

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న హరిత అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్ 26న ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.ప్రభాకరరావు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 96 శాతం పూర్తయిందన్నారు. ట్రయల్ రన్‌గా ఆదివారం వాణిజ్య విమానం ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగనుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన శనివారం విమానాశ్రయం ఆవరణలో విలేకర్లతో మాట్లాడారు. దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఆదివారం ఉదయం 10.15 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర అధికారులతో విచ్చేస్తారని చెప్పారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుందన్నారు.
తుపాన్లను తట్టుకునేలా..
హుద్‌హుద్ వంటి తుపాన్లను తట్టుకునేలా విమానాశ్రయాన్ని డిజైన్ చేశాం. గంటకు 275 కి.మీ. వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరదు. 27 సెం.మీ. వర్షం కురిసినా నీరు బయటకు వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. తొలి దశలో రూ.4,725 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టాం. జులై తొలి వారం నుంచి అధికారికంగా విమానాల రాకపోకలు ఉంటాయి. రోజుకు 200 విమానాలు దిగే సామర్థ్యం ఉంది. ఏటా 20 వేల టన్నుల సరకు ఎగుమతులకు అవకాశం ఉంది. రాత్రిపూట 18 విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో 33 శాతం మంది విశాఖ నగరవాసులు, మిగిలిన 67 శాతం మంది ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు ఉంటారు. 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.

రహదారులు సిద్ధం
విమానాశ్రయానికి విశాఖనగరం నుంచి వచ్చే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం మూడు ప్రధాన రోడ్లను సిద్ధం చేస్తోంది. ఆంధ్రాలోని ఫార్మా, మెరైన్, టెక్స్‌టైల్ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ కార్గో టెర్మినల్ సిద్ధం చేస్తున్నాం. విమానాశ్రయం టెర్మినల్ లోపల విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం, ఏటికొప్పాక బొమ్మలు ఏర్పాటు చేస్తాం. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణలు ఆకట్టుకుంటాయి’’ అని ప్రభాకరరావు వివరించారు. కార్యక్రమంలో జీఎంఆర్ ఎయిర్ పోర్టు సీఈవో కేబీఎస్ కల్రా, ప్రాజెక్ట్ హెడ్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్ ఎయిర్‌పోర్టులో ఆధునిక సేవలు
దేశంలో స్మార్ట్ ఎయిర్‌పోర్టుగా అంతర్జాతీయ వసతులతో దీని నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ప్రభాకరరావు తెలిపారు. ‘‘కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పర్యవేక్షణలో పనులు శరవేగంగా చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పించి సహకరించింది. 21 ఆధునిక ఏరో బ్రిడ్జిలు నిర్మించాం. గంటకు 10-12 విమానాలు దిగుతాయి. తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సెల్ఫ్ బ్యాగేజీ, బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, స్మార్ట్ ట్రాలీలు తదితర ఆధునిక వసతులు ఉంటాయి.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 04:57 IST