అదే ఆమెకు నివాళి!

Eenadu icon
By Editorial Team Published : 19 Dec 2025 01:43 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఇదే డిసెంబరు నెలలో 42 ఏళ్ల మహిళ మాల్వా రాజ్యానికి రాణి అయ్యారు. అంతకు ముందు యుద్ధాల్లో వరసగా భర్తను, మామగారిని, కొడుకునూ కోల్పోయిన ఒంటరి ఆమె. తప్పనిసరి పరిస్థితుల్లోనే పాలనా పగ్గాలు చేపట్టినప్పటికీ ఆమె ‘పేరుకే మహారాణి’ అన్నట్లుగా మిగలలేదు. యుద్ధవిద్యలు నేర్చారు. స్వయంగా యుద్ధాలు చేశారు. మూడు దశాబ్దాల పాటు రాజ్యాన్ని సుభిక్షంగా పాలించి తన సత్తా చాటారు. శతాబ్దాల నాటి పాలనా సంస్కరణలను నేటికీ గుర్తుచేసుకునేలా చేసిన ‘ఫిలాసఫర్‌ క్వీన్‌’ ఆమె. పేరు అహల్యాబాయి హోల్కర్‌. పరదా పద్ధతిని, ఆడంబరాలను కాదని, ప్రజల మధ్య ఉంటూ కష్టసుఖాల్లో వాళ్లకు అండగా నిలిచిన రాణెమ్మ.

విద్య, వైద్యం, నీటినిర్వహణ, రహదారులు లాంటి మౌలిక వసతుల కల్పన... ఈ ఆధునిక యుగంలోనూ పాలకులకు సవాళ్లుగా నిలుస్తున్న అంశాలు. వాటిని ఆనాడే అద్భుతంగా నిర్వహించడమే కాక, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు నెలకొల్పి నగరాలను అభివృద్ధి చేసిన ఘనత రాణి అహల్యాబాయిది. మహేశ్వర్‌ని కొత్త రాజధానిగా మార్చి, కళల కేంద్రంగా తీర్చిదిద్ది, అక్కడి నేతకార్మికులను ప్రోత్సహిస్తూ వస్త్రపరిశ్రమను విస్తరింపజేశారు. ముఖ్యంగా కాశీ విశ్వనాథ్, సోమనాథ్‌ ఆలయాలతో సహా హరిద్వార్‌ నుంచి రామేశ్వరం వరకూ మరెన్నో జీర్ణ ఆలయాలను పునరుద్ధరించారు. భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు, ధర్మశాలలు, ఇతర ఏర్పాట్లు చేశారు. నదుల దగ్గర ఘాట్లను నిర్మించారు. లింగసమానత్వం గురించి తెలియని రోజుల్లోనే బాలబాలికల కోసం విద్యాలయాలు, ఒంటరి మహిళలకు ఆశ్రయాలు నిర్మించారు. వ్యవసాయానికి చెరువులు, కాలువలు తవ్వించారు. అహల్యాబాయి సుదీర్ఘ పాలన... ప్రజల పట్ల 
పాలకులకు ఉండాల్సిన సహానుభూతికి, బాధ్యతకు ప్రతీక. ఈ ఏడాది ఆమె 300వ జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

ప్రముఖుల జయంతులు, వర్ధంతులు వచ్చినప్పుడు ఆరోజుకు నివాళులు అర్పించేసి మన పనులు మనం చేసుకోవడం ఆనవాయితీగా మారిన కాలమిది. కానీ నిజానికి చేయాల్సింది అది కాదు. వాళ్ల స్ఫూర్తి మన ఆచరణలో ప్రతిఫలించాలి. 

భక్తులుగా, తీర్థయాత్రికులుగా, దాతలుగా, స్వచ్ఛంద కార్యకర్తలుగా... స్త్రీలు అధిక శాతం కనిపిస్తారు. కానీ ఎంతమంది మహిళలు దేవాలయాల పాలన బాధ్యతల్లో, నిర్ణయాధికారం గల స్థానాల్లో ఉన్నారు? ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సహానుభూతితో కూడిన వ్యవహారదక్షత మహిళల సొంతమని పలు సందర్భాల్లో రుజువైంది. వారి ఆ సామర్థ్యాలను ఆలయాల పాలకమండళ్లలోనూ వినియోగించుకుంటే భక్తులు, యాత్రికులకు మరింత మెరుగైన వసతుల కల్పనకు మార్గం సుగమమవుతుంది. ఆలయాల దగ్గర రద్దీ నిర్వహణ తేలికవుతుంది. నిధుల కేటాయింపు దగ్గరే ప్రాధాన్యాల ఎంపిక మారుతుంది. భక్తి దైవదర్శనంతో ముగియదని, దానికి ముందూ తరవాతా యాత్రికుల సంక్షేమానికి, సౌకర్యానికి ఇచ్చే ప్రాధాన్యం కూడా అందులో భాగమని నమ్మారు అహల్యాబాయి. ఆమె ఆదర్శాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. ఆ దిశగా అడుగేసినప్పుడే అహల్యాబాయికి నిజమైన నివాళి అర్పించినవాళ్లమవుతాం! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :