Salt: ఉప్పు కయ్యల్లో సిరుల సాగు

Eenadu icon
By Editorial Team Published : 03 Jan 2026 04:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఉప్పు అనగానే సాధారణంగా వంటలే గుర్తొస్తాయి. అయితే, పారిశ్రామికంగానూ ఉప్పు వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇండియా పెద్దమొత్తంలో విదేశాలకు ఉప్పును ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో సంబంధిత పరిశ్రమలో పనిచేస్తున్నవారి సంరక్షణకూ పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చైనా, అమెరికాల తరవాత ఉప్పు ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలుస్తోంది. 1947లో దేశంలో ఉప్పు ఉత్పత్తి 19 లక్షల టన్నులుంటే, 2022-23 నాటికి అది 3.91 కోట్ల టన్నులకు పెరిగింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశీయ అవసరాలకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి ఉప్పును దిగుమతి చేసుకునేవాళ్లం. నేడు ఉప్పు ఉత్పత్తిలో ఇండియా స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా మిగులు ఉప్పును విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 2023-24లో దాదాపు 44 కోట్ల డాలర్ల విలువైన 1.44 కోట్ల టన్నుల ఉప్పును విదేశాలకు పంపించింది. ప్రపంచ ఉప్పు ఎగుమతుల్లో మన వాటా సుమారు పది శాతం. 2030 నాటికి విశ్వవ్యాప్తంగా ఉప్పు మార్కెట్‌ విలువ 4,860 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో అందివచ్చే ఎగుమతి అవకాశాలను ఇండియా అందిపుచ్చుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన గిరాకీ

భారత్‌లో సముద్రపు నీరు, ఉప్పునీటి సరస్సులు, భూగర్భ, రాతి నిక్షేపాలు ఉప్పు ఉత్పత్తికి ప్రధాన వనరులు. దేశవ్యాప్తంగా దాదాపు 7.47 లక్షల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. వేల సంఖ్యలో ఉత్పత్తిదారులున్నారు. దేశీయ ఉప్పు ఉత్పత్తిలో గుజరాత్‌ 87.4శాతం వాటాతో అగ్రభాగాన నిలుస్తోంది. తమిళనాడు (4.7శాతం), రాజస్థాన్‌ (6.7శాతం)లు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ్‌ బెంగాల్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, డామన్‌ డయ్యూలలోనూ ఉప్పు ఉత్పత్తి అవుతోంది. దేశంలో ఏటా మానవ వినియోగానికి సగటున 74 లక్షల టన్నులు, పారిశ్రామిక వినియోగానికి సుమారు 125 లక్షల టన్నుల ఉప్పు అవసరమవుతోంది. పారిశ్రామికంగా పెరిగిన డిమాండు దృష్ట్యా చైనా, జపాన్, ఆగ్నేయ ఆసియా దేశాలకు మన ఉప్పు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. మొత్తం వంద దేశాలకు మన ఉప్పు వెళ్తోంది. అయోడైజ్డ్‌ ఉప్పు, రాతి ఉప్పు, హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌లను సహజంగా వంటల్లో వాడతారు. అంతే కాకుండా రసాయన, తోలు, గాజు, ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో, క్లోరిన్, సోడాయాష్, కాస్టిక్‌ సోడా తయారీలోనూ ఉప్పును వినియోగిస్తారు. రహదారులపై మంచును కరిగించడానికీ ఉప్పు తోడ్పడుతుంది. ఈ క్రమంలో శీతల దేశాలకూ ఉప్పు ఎగుమతి అవుతోంది. ఆక్వా పరిశ్రమలోనూ దాని వినియోగం అధికమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో దాదాపు 20 వేల ఉప్పు కొఠారులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా నౌపడ, చినగంజాం, ఇస్కపల్లి, కాకినాడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో ఉప్పు ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. జనవరి నుంచి జూన్‌ వరకు పంటకాలం ఉంటుంది. ‘ఆంధ్రప్రదేశ్‌ ఉప్పుగిన్నె’గా శ్రీకాకుళం జిల్లాలోని నౌపడ ప్రసిద్ధి చెందింది. 

సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉప్పు పరిశ్రమలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అయితే, ఉప్పు కొఠారులకు వెళ్లడానికి సక్రమమైన రహదారులే చాలా చోట్ల కనిపించవు. గుజరాత్‌తో పోలిస్తే ఏపీలో ఉప్పు సాగు, ఎగుమతుల్లో యంత్రాల వినియోగం తక్కువ. కూలీలే మండే ఎండలో శ్రమిస్తుంటారు. వారికి నల్లకళ్లద్దాలు సమకూర్చాల్సి ఉన్నా ఎక్కడా అవి అందడం లేదు. మరోవైపు ఎక్కువ సమయం ఉప్పులో ఉండటం వల్ల కార్మికులకు చర్మ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వారి ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సురక్షిత ఉప్పు సాగుపై తగిన శిక్షణ అందించాలి. వేసవిలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఉప్పు మడులు పూర్తిగా కరిగిపోయి రైతులు నష్టపోతున్నారు. వరి, మిరప వంటి పంటల మాదిరిగా ఉప్పు సాగుదారులకూ నష్టపరిహారాలు అందించాలి. రాబోయే రోజుల్లో పెరిగే అవసరాలకు అనుగుణంగా ఉప్పు ఉత్పత్తిని, ఎగుమతులను ఇతోధికం చేయడంతో పాటు, సంబంధిత రైతులూ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడు మన ఉప్పు మరింతగా సిరుల పంట పండిస్తుంది. 

ఎడతెగని హింస కారణంగా ప్రపంచ ఆర్థికానికి 2024లో 19.97 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. విశ్వ జీడీపీలో అది 11.6శాతానికి సమానం. 2023తో పోలిస్తే హింస 3.8శాతం మేర పెరిగింది. దానివల్ల 2024లో వాటిల్లిన నష్టంలో ఆయా  పరిస్థితుల వాటా (శాతాల్లో)

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.