Kaamya Karthikeyan: ఇక ఉత్తర ధ్రువమే మిగిలింది!
ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్‌స్లామ్.. ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన శిఖరాలు అధిరోహించడంతో పాటు ఉత్తర, దక్షిణ ధ్రువాలకు చేరుకోవడంతో పూర్తయ్యే సాహస యాత్ర ఇది. ఈ ఘనతకు అడుగు దూరంలో నిలిచింది 18 ఏళ్ల కామ్యా కార్తికేయన్.

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

(Photos: Instagram)
ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్‌స్లామ్.. ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన శిఖరాలు అధిరోహించడంతో పాటు ఉత్తర, దక్షిణ ధ్రువాలకు చేరుకోవడంతో పూర్తయ్యే సాహస యాత్ర ఇది. ఈ ఘనతకు అడుగు దూరంలో నిలిచింది 18 ఏళ్ల కామ్యా కార్తికేయన్. ఇటీవలే దక్షిణ ధ్రువానికి చేరుకొన్న ఆమె.. ఈ ఘనత సాధించిన అతి పిన్న భారతీయురాలిగా, ప్రపంచంలోనే రెండో అతి పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత, గడ్డ కట్టుకుపోయే చలినీ లెక్కచేయకుండా ముందుకు సాగి సాహసాలంటే తనకెంత మక్కువో మరోసారి చాటిచెప్పింది. దీంతో కామ్య పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.

మూడేళ్ల వయసులోనే..!
కామ్యది వైజాగ్. ఆమె తండ్రి ఎస్. కార్తికేయన్ భారతీయ నావికా దళంలో కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వృత్తిరీత్యా గత కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని లోనావాలాలో నివాసముంటోందీ కుటుంబం. ముంబయి, పుణేల మధ్య ఉన్న హిల్ స్టేషన్ ఇది. పచ్చటి ప్రకృతికి, ట్రెక్కింగ్‌కి స్వర్గధామమైన ఈ ప్రదేశమే తాను సాహసాలతో ప్రేమలో పడేలా చేసిందంటోంది కామ్య.
‘మా నాన్నకు సాహసాలంటే ప్రాణం. ఈ ఇష్టంతోనే నాకు మూడేళ్ల వయసున్నప్పుడు తన నేవీ బృందంతో కలిసి తరచూ పర్వతారోహణకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవారు. ‘అమ్మా.. నాన్న ఎందుకు మనల్ని వదిలి పర్వతారోహణకు వెళ్తున్నారు? అంతగా ఆ పర్వతాల్లో ఏం ఉంది?’ అని ఓ రోజు అమ్మనడిగా. ‘అదేంటో నీ ప్రయత్నంతో నువ్వే తెలుసుకో..’ అంది అమ్మ. దాంతో నాకూ పర్వతాలెక్కాలన్న మక్కువ కలిగింది. ఏడేళ్లొచ్చాక అమ్మానాన్నలతో కలిసి ఉత్తరాఖండ్‌లోని చంద్రశిల పర్వతం పైకి ట్రెక్కింగ్‌కు వెళ్లా. ఈ సాహసం, అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం నాకెంతో నచ్చాయి. ఇక అప్పట్నుంచి ఏటా పర్వతారోహణే నా వెకేషన్‌గా మారిపోయింది. అలా క్రమక్రమంగా నా ట్రెక్కింగ్ నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు సాగా..’ అంటోన్న కామ్య ఆపై స్కీయింగ్ నైపుణ్యాల్నీ ఒంటబట్టించుకుంది.

నాలుగేళ్లలో.. ఏడు పర్వతాలు!
ఇలా చిన్న వయసులోనే పర్వతారోహణను తన ప్రవృత్తిగా చేసుకున్న కామ్య.. తొలుత తన తండ్రితో కలిసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పైకి చేరుకుంది. ఆపై ఉత్తరాఖండ్‌లోని కేదార్‌కాంతా, రూప్‌కుండ్ సరస్సు.. తదితర ఎత్తైన శిఖరాలను అధిరోహించి తన నైపుణ్యాల్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలోనే ‘7 సమిట్ ఛాలెంజ్’పై కన్నేసింది కామ్య. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు ఎత్తైన శిఖరాల్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆమె.. తన 13 ఏళ్ల వయసులో ఆఫ్రికాలోని ‘మౌంట్ కిలిమంజారో’ పర్వతారోహణతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసే దిశగా తొలి అడుగు వేసింది. ‘సాహస్’గా తన యాత్రకు పేరు పెట్టుకున్న కామ్య.. ఆపై వరుసగా యూరప్‌లోని ‘మౌంట్ ఎల్బ్రస్’, ఆస్ట్రేలియాలోని ‘Mount Kosciuszko’, దక్షిణ అమెరికాలోని ‘మౌంట్ ఆకొన్‌కాగ్వా’, ఉత్తర అమెరికాలోని ‘మౌంట్ డెనాలీ’, ఆసియాలోని ‘మౌంట్ ఎవరెస్ట్’, అంటార్కిటికాలోని ‘మౌంట్ విన్సన్’ శిఖరాల్ని అధిరోహించింది. ఇలా నాలుగేళ్లలోనే ‘7 సమిట్ ఛాలెంజ్’ పూర్తి చేసింది కామ్య. తద్వారా ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ఈ ఛాలెంజ్ పూర్తి చేసిన మహిళగా చరిత్రకెక్కింది.
‘ప్రతి పర్వతారోహణ నాకెన్నో పాఠాలు నేర్పింది. ధైర్యం, ఓర్పు, సహనం.. వంటి జీవితానికి ఉపయోగపడే విషయాలెన్నో నేర్చుకున్నా. ఈ భూమిపై ఉన్న అందమంతా పర్వతాల పైనే దాగుందేమో అనిపించింది..’ అంటూ తన అనుభవాల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది కామ్య.

ధ్రువాలే లక్ష్యంగా..!
ఎవరూ చేయని అరుదైన సాహసాలు చేయడం కామ్యకు అలవాటు. ఈ మక్కువతోనే కేవలం నాలుగేళ్లలోనే 7 సమిట్ ఛాలెంజ్ పూర్తిచేసిన ఆమె.. ఆపై ధ్రువాలనే తన తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇటీవలే దక్షిణ ధ్రువానికి చేరుకుంది. ‘89 డిగ్రీల సౌత్’ అనే ప్రాంతం నుంచి నడక సాగించిన ఆమె.. 115 కిలోమీటర్ల దూరం నడిచి తన లక్ష్యాన్ని పూర్తిచేసింది. -30 డిగ్రీల ఉష్ణోగ్రతలతో కూడిన క్లిష్టమైన వాతావరణంలో, ఈదురు గాలుల్ని తట్టుకుంటూ.. కిలోల కొద్దీ బరువును లాగుతూ అక్కడికి చేరుకుంది. ఇలా దక్షిణ ధ్రువానికి చేరుకున్న అతి పిన్న భారతీయురాలిగా, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది కామ్య.
‘ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్‌స్లామ్ (ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన శిఖరాలు అధిగమించడం, ఉత్తర-దక్షిణ ధ్రువాలకు చేరుకోవడం) పూర్తిచేసే దాకా నా ప్రయాణం ఆగదు. త్వరలోనే ఉత్తర ధ్రువానికీ పయనమవుతా..’ అంటోన్న ఈ యువ సాహసి.. ఈ గ్రాండ్‌స్లామ్‌కు అడుగు దూరంలో నిలిచింది.

రోజూ 21 అంతస్తులు ఎక్కుతా!
ట్రెక్కింగ్, స్కీయింగ్.. వంటి సాహసాలు చేయాలంటే సంకల్పం ఉంటే సరిపోదు.. అందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. అందుకే తాను రోజూ కఠినమైన వ్యాయామాలు సాధన చేస్తానంటోంది కామ్య.
‘సాహసాలు చేయాలంటే పట్టుదలను పెంచుకుంటూనే.. మానసికంగా సంసిద్ధం కావాల్సి ఉంటుంది. అలాగే శారీరకంగా కఠినమైన వ్యాయామాలు చేయాలి. నేనైతే రోజూ ఎక్కువ దూరం పరిగెడతా.. సైక్లింగ్ చేస్తా. ప్రస్తుతం మేము ముంబయిలో 21వ ఫ్లోర్‌లో ఉంటున్నాం. అలాగని రోజూ ఎక్కి దిగడానికి లిఫ్ట్ వాడను. మెట్లే ఉపయోగిస్తా. ఒక్కసారి కాదు.. కనీసం 10-15 సార్లు ఎక్కి దిగుతా. అది కూడా బ్యాక్‌ప్యాక్‌తో!’ అంటోన్న ఈ యంగ్ మౌంటెనీర్.. తన సాహస యాత్రలకు కావాల్సిన ప్యాకింగ్, ప్లానింగ్ అంతా తన తండ్రిని చూసి నేర్చుకున్నట్లు చెబుతోంది.

భరతనాట్యం నేర్చుకుంటున్నా!
ప్రస్తుతం ముంబయిలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 12వ తరగతి చదువుతోన్న కామ్య.. ఓవైపు చదువును, మరోవైపు తన మౌంటెనీరింగ్ కెరీర్‌ను.. రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. అంతేకాదు.. తనకిష్టమైన భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నట్లు చెబుతోందీ ట్యాలెంటెడ్ టీన్.
‘చదువు, మౌంటెనీరింగ్.. ఇవే కాదు.. ఇతర వ్యాపకాల పైనా దృష్టి పెట్టా. ఎప్పుడూ ఏదో ఒక కొత్త అంశం నేర్చుకోవడమంటే నాకిష్టం. ప్రస్తుతం భరతనాట్యం నేర్చుకుంటున్నా. పియానో, గిటార్ వాయించడమన్నా ఎంతో మక్కువ. ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నానంటే అందుకు నేను చేసే సాహసాలే కారణం. ఎందుకంటే ఇవి నా ఏకాగ్రతను పెంచుతాయి. పనులన్నీ బ్యాలన్స్ చేసుకునే సామర్థ్యాన్ని నాకు అందిస్తాయి..’ అంటోన్న కామ్య తన జర్నీతో ఒక్కరు స్ఫూర్తి పొందినా తనకు ఆనందమే అని చెబుతోంది.
