వైరభక్తులూ వీరభక్తులే!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

భక్తులు రెండు రకాలని... వారిలో కొందరు వీరభక్తులని, మరికొందరు వైరభక్తులని అంటుంటారు. కానీ అది సరికాదు. వైరభక్తులూ వీరభక్తులే. ఇంకా చెప్పాలంటే వీరాతివీర భక్తులు, పరమాత్ముణ్ని వెన్నంటి ఉన్నవాళ్లు. వైరభక్తి కేవలం నటన. మూడు యుగాలను అనితరసాధ్యంగా ప్రభావితం చేసిన నటన. అందుకు కారణం ఒక దైవఘటన. పరమాత్ముడు స్వయంగా ఇద్దరు వీర భక్తులకు ఇచ్చిన అపురూపమైన అవకాశం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
జయవిజయులు వైకుంఠంలోని విష్ణుమూర్తి నివాసంలో ద్వారపాలకులు. ద్వారపాలకులకన్నా యజమానికి వీర భక్తులెవరుంటారు? జయవిజయులు కూడా అక్షరాలా తమ విధిని నిర్వర్తించారు తప్ప విష్ణు భక్తులైన మహానుభావులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం వారికి ఏ కోశానా లేదు. అయితే విధివశాత్తు జరగరానిది జరిగింది. కథ అంతా కొత్త మలుపు తిరిగింది.
జయవిజయులు ఓరోజు విధినిర్వహణ చేస్తుండగా అయిదేళ్ల పిల్లల్లా కనిపిస్తున్న నలుగురు ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం దగ్గరికి వచ్చారు. నగ్నంగా ఉన్న ఆ పిల్లలు ఎవరో గుర్తించక జయవిజయులు సహజంగానే అడ్డుకున్నారు. దాంతో ఆ నలుగురూ ఆగ్రహించారు. ‘మీరు ఈ పుణ్యలోకంలో ఉండటానికి తగరు. భూలోకంలో మనుషులుగా పుట్టాల’ని ఆ ద్వారపాలకుల్ని శపించారు. పిల్లల్లా కనిపించిన ఆ పెద్దలు మహర్షులైన బ్రహ్మ మానసపుత్రులు. సనక సనందనాదులుగా ప్రసిద్ధి చెందినవారు. విషయం తెలిసిన విష్ణుమూర్తి ద్వారం దగ్గరికి వచ్చి జయవిజయులను మందలించాడు. అజ్ఞానం వల్ల పాపం చేశామని గ్రహించిన జయవిజయులు శాపవిముక్తి కోసం మహర్షులను వేడుకున్నా ఫలితం దక్కలేదు. దానికి అంతకుముందు లక్ష్మీదేవి ఇచ్చిన శాపం కూడా తోడైంది. దాంతో వారు తమ ఇష్టదైవం విష్ణుమూర్తికి దూరం కావాల్సివచ్చింది. ఈ ఎడబాటును భరించలేమని, పరమాత్ముడి సన్నిధిలోనే ఉండే మార్గం చెప్పాలని జయవిజయులు సవినయంగా విన్నవించుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి రెండు మార్గాలను సూచించి వాటిలో ఇష్టమైన దాన్ని ఎంచుకొమ్మని చెబుతాడు. వీరభక్తులుగా కొనసాగితే ఏడు జన్మల్లో మోక్షం ప్రసాదిస్తానని, అదే తనతో శతృత్వం పెట్టుకుని తన చేతిలోనే చనిపోతే మూడు జన్మలు చాలని వివరించాడు. దాంతో ఏడు జన్మల ఎడబాటుకన్నా మూడు జన్మల శతృత్వాన్నే జయవిజయులు కోరుకున్నారు. ఆ పరిస్థితుల్లో వీరభక్తులు ఎవరైనా అదే కదా కోరుకుంటారు? దానికి విష్ణుమూర్తి సమ్మతించాడు. ఫలితంగా జయవిజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగానూ, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగానూ, ద్వాపరయుగంలో శిశుపాల దంత వక్త్రులుగానూ జన్మించి విష్ణుమూర్తి చేతుల్లోనే హతమై మోక్షం సంపాదించుకున్నారు. అలా విష్ణుమూర్తి మాటను సార్థకం చేసిన వీరభక్తులయ్యారు. ఇక కలియుగంలో విష్ణు స్వరూపుడైన వేంకటేశ్వర స్వామి ప్రతి ఆలయంలోనూ జయవిజయులు ద్వారపాలకులుగా సాక్షాత్కరిస్తున్నారు. భక్తులు రెండు రకాలు కాదు, ఒకే రకమని నిరూపించి భక్తులందరి విజయాలకు వారు బాటలువేశారు. భక్తులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :