మాట్లాడుకోవాలి!

Eenadu icon
By Editorial Team Published : 30 Dec 2025 03:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కప్పుడు ఒంటరిగా నడచిన మనిషి చక్రం వచ్చాక గుంపులో ప్రయాణం మొదలుపెట్టాడు. కథలు చెప్పుకొన్నాడు. కబుర్లు పంచుకున్నాడు. బస్సులూ రైళ్లూ వచ్చాయి. ప్రయాణం నేటి జీవన విధానమైంది.

కొన్నాళ్ల క్రితం దాకా ప్రయాణాల్లో మనుషులు ఒకరినొకరు పలకరించుకునే వాళ్లు. పక్క ప్రయాణికుడితో మంచీ చెడూ మాట్లాడేవాళ్లు. ఇప్పుడు కూడా ప్రయాణికులతో బస్సులు, రైళ్లు నిండిపోతున్నాయి. కానీ, ఎటుచూసినా నిశ్శబ్దం. తలెత్తి చూసేది లేదు, నోరు తెరిచి మాట్లాడేది లేదు. గతంలో ఒకరి చేతిలో పేపరుంటే అది కంపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్లందరి చేతులు మారేది. ఇప్పుడు చేతుల్లోకి ఫోన్‌ వచ్చింది. చెవుల్లోకి ఇయర్‌ ఫోన్స్‌ వచ్చాయి. తమలో తామే నవ్వుకుంటున్న మనుషులు కనిపిస్తారు. వారికి చుట్టుపక్కల జరిగేదేదీ కనిపించదు, వినిపించదు. 

ఒకప్పుడు పరిచయాల ప్రవాహంలా సాగిన ప్రయాణాలు ఇప్పుడు మంచులా గడ్డకడుతున్నాయి.

ఆమధ్య రైల్లో నా ఎదురుగా డెబ్భయ్యేళ్ల పెద్దాయన కూర్చున్నాడు. ఏ ఊరని అడిగాడు. నేను చెప్పాక ఫలానా వ్యక్తి తెలుసా అన్నాడు. ‘ఆయన మా నాన్న’ అన్నాను. నన్ను హత్తుకున్నాడు. మా నాన్నతో ఉన్న చాలా జ్ఞాపకాలను పంచుకున్నాడు. నాన్న లోకాన్ని వదిలి వెళ్లిపోయారని చెబితే చాలా బాధపడ్డాడు. నాన్న గురించి నాకు తెలియని ఎన్నో విషయాలను ఆ పెద్దాయన చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు ఆయన చాలా ఉత్సాహంగా కనిపించాడు. కళ్లలో కాంతి కనిపించింది. ఆయనను చూసి నాకూ ఆనందం కలిగింది. మరోసారి, మా ఫ్రెండ్‌ వాళ్ల నాన్నకి తీవ్రమైన చర్మ సమస్య వచ్చింది. చాలామంది డాక్టర్లను కలిశారు. ఒకసారి రైలులో పరిచయమైన వ్యక్తి, చిత్తూరు జిల్లాలో ఒక ఆయుర్వేద వైద్యుణ్ని కలవమని సూచించాడు. నా స్నేహితుడు తండ్రిని అక్కడికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. కొద్దిరోజుల్లోనే ఆయన కోలుకున్నారు. ఇలాంటివే కాదు, ప్రయాణాల్లోనే పెళ్లి సంబంధాలు కుదిరిన సందర్భాలున్నాయి. ఇక జీవితంలో ఎప్పుడూ చూడమేమో, కలవలేమేమో అనుకున్న వ్యక్తులు కలిసిన సందర్భాలున్నాయి.

ప్రయాణమైనా, మరో చోటైనా... మన ముందో, వెనకో, పక్కనో... మనుషులంటూ ఉంటే వాళ్లతో హాయిగా మాట్లాడాలి. మాట్లాడటం మనిషికి మాత్రమే లభించిన వరం. వ్యక్తుల్ని గమనించండి. సంతోషంగా కనిపిస్తే ఆ సంతోషాన్ని మీరూ పంచుకోండి. విచారంగా ఉంటే మనసు మళ్లించే నాలుగు మంచి మాటలు చెప్పండి. మన మాటల్లో వారికి సాంత్వన దొరకవచ్చు. వారి మాటలు వినడం ద్వారా మనలోనూ ఉత్సాహం కలగొచ్చు. మంచి మిత్రులు దొరకవచ్చు. వర్చువల్‌ స్నేహాలు ఎన్ని ఉన్నా, ఆ స్నేహితులను ప్రత్యక్షంగా కలిస్తే లభించే ఆనందం వేరు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అనుబంధాలు లతల్లాంటివి. వాటికి చిరునవ్వు, మాటలనే ఆధారాలు దొరికితే చాలు అల్లుకుపోతాయి. అందుకే ఒక చిరునవ్వు, ఒక పలకరింపు... పెదాలపై సిద్ధంగా ఉంచుకోండి. దానివల్ల పోయేదేమీ లేదు. మిగిలేది మాత్రం అందమైన జ్ఞాపకాలు!

పేదరిక నిర్మూలన ద్వారానే ప్రజారోగ్యాన్ని కాపాడుకోగలం. దానికోసం జీడీపీలో కనీసం మూడుశాతం నిధులను వైద్యారోగ్య రంగంపై ఖర్చు చేయాలి. అందులోనూ ఎక్కువ భాగం ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం వెచ్చించాలి.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :