Revanth Reddy: సభలో తగ్గేదే లే...!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్: భారాస చెప్పేవన్నీ అసత్యాలని.. శాసనసభ సమావేశాల్లో మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు బలమైన వాదనల ద్వారా ప్రజల ముందుంచాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం సభ వాయిదా పడిన అనంతరం ఆయన తన ఛాంబర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అజారుద్దీన్, సీతక్క, సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభలో చర్చకు రానున్న అంశాలు, వాటిపై ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించడానికి చేయాల్సిన కసరత్తు గురించి వారితో ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. ప్రతి అంశంపై బాగా సిద్ధమై పక్కా సమాచారంతో మాట్లాడాలని, అనవసర అంశాలను ప్రస్తావించినట్లు అనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఎజెండా అంశాలపై పక్కా ఆధారాలు, పూర్తి సమాచారంతో సభకు రావాలని మంత్రులకు ఆయన చెప్పారు. ఒక జిల్లాకు సంబంధించిన అంశంపై చర్చ జరిగే సమయంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పాల్గొని గట్టిగా వాదనలు వినిపించాలని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, ఉపాధి హామీ పథకంలో కేంద్రం తెచ్చిన సవరణల బిల్లు, హిల్ట్ పాలసీపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి.
80 శాతం పనులు జరిగిందెక్కడ?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తమ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడంలేదంటూ.. భారాస చెబుతున్నవన్నీ అబద్ధాలని ఆధారాలతో సభలో నిరూపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భారాస ఉనికిని కాపాడుకునేందుకు అసత్యాలు ప్రచారం చేస్తోందని సభకు వివరించాలని సూచించారు. ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిర్ణయించారు. మంత్రులంతా సభకు తప్పనిసరిగా హాజరుకావాలని, సభ్యులెవరూ గైర్హాజరు కావద్దని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్టుకు భారాస పాలనలో తొలుత రూ.35 వేల కోట్ల వ్యయమవుతుందని పరిపాలన అనుమతులిచ్చి.. అందులో 80 శాతం విలువైన పనులు పూర్తయినట్లు ఇప్పుడు చెబుతున్నారని చర్చకొచ్చింది. కానీ భారాస పాలనలోనే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు పెంచారని, అందులోనూ కాల్వల భూసేకరణకు నామమాత్రపు ధరలు నిర్ణయించిన విషయాన్ని సభలో పూర్తి ఆధారాలతో వివరించాలని సీఎం సూచించినట్లు సమాచారం. రైతులు నష్టపోకుండా ఈ భూములకు ధరలు ఇవ్వాలంటే ప్రాజెక్టు వ్యయం రూ.70 వేల కోట్లు దాటే అవకాశాలున్నాయని, ఇక కేసీఆర్ పాలనలో 80 శాతం విలువైన పనులు ఎక్కడ జరిగాయంటూ భారాసను నిలదీయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలనలో కృష్ణానదిపై నిర్మాణం ప్రారంభమై పెండింగులో ఉన్న పలు ప్రాజెక్టులను భారాస పాలనలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే కృష్ణా జలాలను అధికంగా వినియోగించుకునే అవకాశాలు కోల్పోయామని.. ఈ విషయాలను సభలో వివరించాలని సీఎం చెప్పినట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం వల్ల పేదలకు కలిగిన లబ్ధిని వివరించాలని, దీనిలో 40 శాతం నిధులు రాష్ట్రాలే ఇవ్వాలంటూ తెచ్చిన సవరణలతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థికభారం పడనుందని సీఎం చెప్పారు. ఇలా రాష్ట్రాలపై ఆర్థికభారం మోపి పథకాన్ని అమలు కాకుండా అడ్డుకోవాలని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిర్ణయించినా భారాస ఒక్కమాట కూడా మాట్లాడకుండా మద్దతిచ్చినట్లు వ్యవహరించిందని ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీన్ని కూడా సభలో వివరించాలని, భారాస, భాజపాల మధ్య మైత్రీబంధంపై ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :