దేశ ప్రతిష్ఠకు డోపింగ్‌ మచ్చ

Eenadu icon
By Editorial News Team Published : 19 Dec 2025 01:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

సామర్థ్యం మేరకు ఆడి కష్టపడి సాధించే విజయం క్రీడాకారులకు సంతృప్తినిస్తుంది. సర్వశక్తులూ ఒడ్డి పోరాడినా పరాజయం తప్పనప్పుడు దాన్నీ  అంతే హుందాగా స్వీకరించగలగాలి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరింతగా రాటుదేలాలి. నిజమైన క్రీడాస్ఫూర్తికి అర్థమదే! కానీ, ఎలాగైనా గెలవాలన్న దురాశతో కొందరు క్రీడాకారులు యథేచ్ఛగా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్నారు. ఆపై పట్టుబడి ఉజ్జ్వల భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇండియా ఎక్కువగా నెలవు అవుతుండటం కలవరపరుస్తోంది. ప్రపంచ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) తాజా నివేదిక ప్రకారం- డోపీలు అధికంగా ఉన్న దేశంగా ఇండియా వరసగా మూడో ఏడాది కూడా పరువుమాసింది. జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా) నిరుడు ఏడు వేలకు పైగా మూత్ర, రక్త నమూనాలను పరిశీలిస్తే- 260 మందికి సంబంధించి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. చైనా 24 వేలకు పైగా శాంపిళ్లు పరీక్షిస్తే 43 మాత్రమే పాజిటివ్‌గా తేలాయి. ఫ్రాన్స్, రష్యా, జర్మనీ వంటివి పదివేలకు పైగా నమూనాలను తరచిచూస్తే నిషేధిత ఆనవాళ్లున్నవి ఎక్కడా వంద దాటలేదు. ఇండియాలో తక్కువ శాంపిళ్లలోనే పలువురు డోపీలు బయటపడటం- మన క్రీడావ్యవస్థ దారితప్పుతున్న తీరును కళ్లకుకడుతోంది! 

దేశీయంగా గడిచిన నాలుగేళ్లలో 640 మంది డోపింగ్‌ టెస్టుల్లో విఫలమయ్యారు.  వారిలో రెండొందల మంది అథ్లెటిక్స్‌ విభాగంవారే. తరవాతి స్థానాల్లో వెయిట్‌ లిఫ్టింగ్, రెజ్లింగ్, పవర్‌ లిఫ్టింగ్, బాక్సింగ్‌ క్రీడాకారులున్నారు. కొందరు తెలిసీ తెలియక వాడుతున్న ఔషధాల మూలంగా డోపింగ్‌ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మరికొందరేమో కావాలని తప్పుడుమార్గాన్ని ఎంచుకుని చివరికి అందరి ఎదుటా తలదించుకుంటున్నారు. బుద్ధిచెప్పి సరైన బాటలో నడిపించాల్సిన కోచ్‌ల్లో కొంతమంది అలాంటివారికి సహకరిస్తుండటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 2030 కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న ఇండియా, ఆ తరవాత ఒలింపిక్స్‌ నిర్వహణ ద్వారా తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల పట్టికలో ముందు నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ, నానాటికీ జడలు విప్పుతున్న డోపింగ్‌కు అడ్డుకట్ట వేయకపోతే- రష్యా మాదిరిగా భారత్‌ సైతం అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో ఏకాకి అయ్యే దురవస్థ దాపురిస్తుంది. గతంలో శిక్షకులు, అధికారులు, వైద్యులు, అథ్లెట్లు.. ఇలా అందరి తోడ్పాటుతో రష్యాలో వ్యవస్థాగత డోపింగ్‌ విశృంఖలమై, చివరికి ఆ దేశ ప్రతిష్ఠను మంటగలిపింది! 

డోపింగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌పై కొన్నాళ్ల క్రితం తాత్కాలిక నిషేధం పడింది. అమిత్‌ పంఘాల్‌ (బాక్సింగ్‌), దీపా కర్మాకర్‌(జిమ్నాస్టిక్స్‌), నర్సింగ్‌ యాదవ్‌(రెజ్లింగ్‌), సీమా పునియా(డిస్కస్‌ త్రో) వంటి ప్రముఖ క్రీడాకారులెందరో డోపీలుగా తేలడం విస్మయపరచింది. క్రీడల్లో అనైతిక ధోరణుల నివారణకు కేంద్రం 2022లోనే ప్రత్యేక చట్టం తెచ్చింది. అయినప్పటికీ డోపింగ్‌ భూతం జడలు విప్పుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో- దొంగదారుల్లో పతకాల వేటకు బయల్దేరే ప్రబుద్ధులకు పగ్గాలు వేయడానికి కేంద్రం తెచ్చిన యాంటీ డోపింగ్‌ సవరణ బిల్లు మొన్న ఆగస్టులో పార్లమెంటు ఆమోదం పొందింది. అది సమర్థంగా అమలుకు నోచుకుంటేనే క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సిద్ధిస్తాయి. దాంతోపాటు డోపింగ్‌ పర్యవసానాలపై క్రీడాలోకంలో విస్తృతావగాహన కల్పించాలి. ఆరోగ్య చికిత్సలో భాగంగానైనా తీసుకోకూడని మందులేంటో తెలియజేయాలి. కావాలని ఉత్ప్రేరకాల ఊబిలోకి అడుగుపెట్టే క్రీడాకారులు, అందుకు వారిని ఉసిగొలిపే కోచ్‌లపై మాత్రం నిర్దాక్షిణ్యంగా వేటేయాలి! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.