Jana Nayagan: రాజకీయాలొద్దు..! విజయ్ మూవీ ఆడియో లాంచ్.. పోలీసుల హెచ్చరిక

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: టీవీకే అధినేత, తమిళ కథానాయకుడు విజయ్ నటించిన చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేసియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 27న జరగనున్న ఈ ఈవెంట్‌పై (Audio Launch) అక్కడి పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఆడియో లాంచ్‌లో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడవద్దని ముందస్తుగా హెచ్చరించారు.
కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ స్టేడియంలో ఆడియో విడుదల వేడుకను నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 90వేల మంది విజయ్ అభిమానులు హాజరు కానున్నట్లు అంచనా. ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న విజయ్.. అభిమానులను ఉద్దేశించి ఏమైనా వ్యాఖ్యలు చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాయల్ మలేసియా పోలీసులు రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ఆయన నటిస్తున్న చివరి సినిమా ఇదేనట. హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. మమిత బైజు, ప్రియమణి, బాబీ దేవోల్, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న (jana nayagan release date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తెలుగులో బాలకృష్ణ నటించిన విజయవంతమైన సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా రూపొందుతున్నట్లు కోలీవుడ్ టాక్. విజయ్ అభిమానులను అలరించేలా కథలో మార్పులు చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. హిందీలోనూ ఈ మూవీని ‘జననేత’ పేరుతో విడుదల చేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. తాజాగా తెలుగులోనూ విడుదలై స్పష్టత వచ్చింది. ‘జన నాయకుడు’ పేరుతో ఏపీ, తెలంగాణల్లో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాను విడుదల చేస్తోంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 16:31 IST