CM Chandrababu: క్రైస్తవుల భద్రత, గౌరవానికి భంగం కలగనివ్వం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

క్రైస్తవుల భద్రత, గౌరవానికీ ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రతి మతాన్నీ గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. పేదరికం లేని సమాజం చూడాలని నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకుసాగుతున్నామని, అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. క్యాండిల్ వెలిగించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
జీసస్ సందేశం అందరికీ మార్గనిర్దేశనం
‘ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ క్రిస్మస్. ఏసుక్రీస్తు జన్మించిన రోజు మనందరికీ పండుగ రోజు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువల్ని అందించిన ఏసుప్రభు సందేశం ఎప్పటికీ మార్గనిర్దేశం. క్రీస్తు బోధనలు, ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుంది. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు ఏసు. నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి కూడా సిద్ధపడిన జీసస్ గొప్పతనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాలి. శాంతి మార్గాన్ని అనుసరించి, ప్రేమతత్వాన్ని పెంచాలని బైబిల్ చెప్తోంది’ అని చంద్రబాబు అన్నారు.

క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ అందించిన మిషనరీ విద్యాసంస్థలు
‘సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు కీలకంగా ఉంటాయి. క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులను ప్రభుత్వాలు పెట్టలేని రోజుల్లోనే క్రిస్టియన్ సంస్థలు వాటిని ఏర్పాటు చేశాయి. ఏపీలో దశాబ్దాలుగా విద్యా రంగంలో క్రైస్తవ సంస్థలు ఎంతో సేవ చేస్తున్నాయి. లక్షల మంది జీవితాల్లో మార్పులు తెచ్చాయి. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ అందించే కేంద్రాలు మిషనరీ పాఠశాలలు. గుంటూరు ఏసీ కాలేజీ, ఆంధ్రా లయోలా కాలేజీలు ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేశాయి. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలోనే విద్యనభ్యసించారు. అవి పెద్ద నాయకులను జాతికి అందించాయి’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

వైకాపా చేసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదు...
- ‘2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నేను 4వ సారి సీఎం అయ్యాను. లోతులకు వెళ్లిన కొద్దీ లోపాలు కనబడుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదు. అయినా మనో సంకల్పంతో ముందుకెళ్తున్నా.. దానికి మీరు సహకరిస్తున్నారు. గత 18 నెలల్లో ఇటుకా ఇటుకా పేర్చుకుంటూ నిలదొక్కున్నాం. గణనీయమైన అభివృద్ధి సాధించాం. వైకాపా ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించాం’ అని ఆయన అన్నారు.
- ‘రాష్ట్రంలో 2014-19 మధ్య 977 చర్చిల నిర్మాణానికి రూ.77 కోట్లు అందించాం. వైకాపా ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. 2014-19 మధ్య 377 పూర్తయ్యాయి. మిగతా వాటికి నిధులు విడుదల చేసి పూర్తి చేస్తాం. గుంటూరు క్రిస్టియన్ భవన్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా పనులు నిలిపేసింది. ఈ భవనాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం’ అని అన్నారు.
- ‘జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. క్రైస్తవుల ఉపాధి, ఆర్థిక సాధికారత విషయంలోనూ ముందుకెళ్తున్నాం. 2025-26 లో రూ.20 కోట్లు కేటాయించి 2 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. సీఈడీఎం కింద ఆధునీకరణకు రూ.5 కోట్లు కేటాయించాం.
- గ్రూప్స్, డీఎస్సీ, నీట్, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు.
- క్రిస్మస్ హైటీ కార్యక్రమ నిర్వహణకు వైకాపా ప్రభుత్వం జిల్లాకు రూ.30 వేలు మాత్రమే ఇస్తే....ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాకు రూ.2 లక్షల చొప్పున విడుదల చేసిందని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. అది కూటమి ప్రభుత్వానికి క్రైస్తవుల పట్ల ఉండే చిత్తశుద్ధి అని అన్నారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, రాము, యార్లగడ్డ వెంకట్రావు, తంగిరాల సౌమ్య తదితరులు మాట్లాడారు. బిషప్ గోరంట్ల జాన్వేష్, పాస్టర్లు జాన్ వెస్లీ, శామ్యూల్, డేనియల్, జేసు రత్నంకుమార్, తదితరులు పాల్గొని ఏసుక్రీస్తు బోధనలను వినిపించారు.

గౌరవ వేతనం ప్రారంభించింది మేమే..
‘ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున క్రిస్మస్ పండుగను మొదటి సారి నిర్వహించింది తెదేపా ప్రభుత్వమే. మత సామరస్యాన్ని కాపాడాం. క్రైస్తవుల్లో కూడా ఎక్కువ పేదరికం ఉంది. సూపర్ సిక్స్ పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలనూ అందించి అన్ని వర్గాలను ఆదుకుంటున్నాం. పాస్టర్లకు గౌరవ వేతనం ప్రారంభించింది మేమే. 44,812 మంది క్రైస్తవులకు రూ.22 కోట్ల సాయం అందించాం. 8,427 మంది పాస్టర్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాం. పెండింగ్ బకాయిలు రూ.51 కోట్లను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు పాస్టర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :