Gold price in Hyderabad: సరికొత్త గరిష్ఠాలకు పసిడి.. ఏడాదిలో రూ.60 వేలు పైకి..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Gold price in Hyderabad | హైదరాబాద్: పసిడి ధరల పరుగు కొనసాగుతోంది. దేశీయంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఒక్కరోజులోనే రూ.2,650 మేర పెరిగి రూ.1,40,850కు (పన్నులు కలుపుకొని) చేరిందని ఆలిండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. సోమవారం 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి రూ.1,38,200గా ఉంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం సాయంత్రానికి 10 గ్రాముల ధర రూ.1,40,820 పలుకుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం రూ.61,900 పెరిగింది. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల పసిడి రూ.78,950గా ఉండగా.. నేడు 78 శాతం పెరిగి రూ.1.50 లక్షల దిశగా దూసుకెళ్తోంది.
మరోవైపు వెండి కూడా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. దిల్లీలో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.2,750 పెరిగి రూ.2,17,250కి చేరింది. ఈ ఒక్క క్యాలెండర్ సంవత్సరంలో వెండి దాదాపు రూ.1,27,550 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి కిలో వెండి ధర రూ.89,700గా ఉంది. అంటే దాదాపు 142.2 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సు 4,500 డాలర్లకు సమీపించడంతో దేశీయంగా అదే స్థాయిలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు వెండి సైతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు తొలిసారి 70 డాలర్ల మార్కు దాటింది.
- విద్యుత్ కార్లలో టాటా దూకుడు.. లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్.ఈవీ
వచ్చే ఏడాది మరోసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత పెడుతుందన్న అంచనాలతో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మదుపర్లు భావిస్తుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. దీనికి భౌగోళిక అనిశ్చితులు కూడా తోడయ్యాయని పేర్కొన్నారు. అమెరికా మూడో త్రైమాసికానికి సంబంధించి వెలువడే రెండో అంచనాలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితిపై అంచనాలతో పాటు, ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :