Cm chandrababu: భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

‘భూవివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు. చిక్కులు పెంచుతున్నారు. వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి, జైల్లో వేస్తాం’ అని ముఖ్యమంతి చంద్రబాబు హెచ్చరించారు. సచివాలయంలో గురువారం కలెక్టర్ల సదస్సులో.. రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘22ఏలో పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా తేల్చాలి. కొన్ని ఇళ్లు కూడా 22ఏలో ఉన్నాయి. వాటిపై ఇళ్లల్లో ఉన్నవారికి హక్కులు కల్పించాలి. పట్టాదారు పాసుపుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే, ఆలస్యాన్ని నివారించొచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు కూడా కొరియర్‌లో పంపే అంశం పరిశీలించాలి. మళ్లీ వాళ్లు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా చేయొచ్చు’ అని సూచించారు. ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘విశాఖ, అనకాపల్లి, విజయనగరం తదితర ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూకబ్జాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు వచ్చాయి. వారితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేలా చూడాలి’ అని పేర్కొన్నారు. సీఎం స్పందిస్తూ ‘కలెక్టర్లు, ఎస్పీలు ఏ రాజకీయ నాయకుడి ప్రమేయాన్నీ అంగీకరించొద్దు. రికార్డుల ప్రకారమే వెళ్లాలి. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేద’ని స్పష్టంచేశారు. రికార్డుల డిజిటలీకరణ అవసరాన్ని మంత్రి మనోహర్ ప్రస్తావించారు.
జాయింట్ ఎల్పీఎంలపై జేసీలతో పరిశీలన
- భూరికార్డులు, రిజిస్ట్రేషన్లు, ఆస్తి పత్రాలన్నీ డిజిటలైజ్ చేస్తున్నాం. కీలక డాక్యుమెంట్లన్నీ క్లౌడ్‌లో పెడతాం. లింక్ డాక్యుమెంట్లు డేటా వేర్‌హౌసింగ్‌లో పెడుతున్నాం.
- రాష్ట్రంలో 2019-24 మధ్య అప్పటి పాలకులు తమకు దక్కని భూములను 22ఏ కింద నిషిద్ధ జాబితాలో చేర్చారు. అమ్ముకుందామని వెళ్లేసరికి హక్కుదారులు లబోదిబోమనే పరిస్థితి వచ్చింది. భూ సమస్యలను వంద శాతం పరిష్కరించి ప్రజలకు సవ్యంగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే. జాయింట్ ఎల్‌పీఎం భూములపై ప్రతి జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్‌తో పరిశీలన చేయించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి.
- పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేద్దాం. రికార్డుల నవీకరణ నమోదైన చోటు నుంచే నేరుగా హక్కుదారుకు కొరియర్‌లో పంపాలి. తద్వారా రెండు మూడు దశలు తగ్గి ఆలస్యాన్ని నివారించవచ్చు. ఇళ్లకు సంబంధించి పొసెసన్ సర్టిఫికెట్లు త్వరగా అందించాలి.
- రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ‘సమస్య ఏదైనప్పటికీ, అధికారులు ముందు ఫిర్యాదుదారుతో మాట్లాడాలి. మా కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు పంపుతున్నా, కొందరు సరిగ్గా స్పందించడం లేదు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకుంటున్నారే తప్ప, వాటిని పరిష్కరించకపోవడమే సమస్య’ అని వ్యాఖ్యానించారు. రెవెన్యూలో గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ వివరించగా, సీఎం అభినందించారు. తక్కువ సమయంలో ప్రజంటేషన్ పూర్తి చేశారని ప్రశంసించారు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.