SMC bill: ఎస్‌ఎంసీ బిల్లుతో సెబీ అధికారాలకు కళ్లెం

Eenadu icon
By Business News Desk Published : 22 Dec 2025 03:24 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: మార్కెట్‌ వర్గాలకు నియంత్రణపరమైన ఇబ్బందులు తగ్గించే ప్రతిపాదనలను సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌ కోడ్‌ (ఎస్‌ఎంసీ) బిల్లులో ప్రభుత్వం చేసింది. ఈ బిల్లు చట్టమైతే.. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తనిఖీలు, దర్యాప్తునకు 8 ఏళ్ల చట్టబద్ధమైన కాలపరిమితి ఉంటుంది. సెక్యూరిటీల మార్కెట్‌పై వ్యవస్థాగత ప్రభావాన్ని చూపే కేసులకు మాత్రం ఈ 8 ఏళ్ల పరిమితి వర్తించదు. ఈ కాలపరిమితితో పాటు నిర్దేశిత సమయంలోగా నియమావళి అమలును కూడా బిల్లులో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. 180 రోజుల్లోగా దర్యాప్తులను సెబీ పూర్తి చేయాలి. ఇదే సమయంలో అంబుడ్స్‌పర్సన్‌ నేతృత్వంలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, మదుపర్ల భద్రతను బలోపేతం చేయాల్సి ఉంటుంది. 8 ఏళ్ల కాలపరిమితి వల్ల పాత లావాదేవీలకు చట్టపరమైన కచ్చితత్వాన్ని తీసుకొస్తుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాత కేసుల్లో సంస్థలను నిరవధికంగా వెంటాడకుండా ఉండేలా చూస్తుందని తెలిపాయి. దర్యాప్తును కాలపరిమితిలో పూర్తిచేయడం, అంబుడ్స్‌మన్‌ విధానాన్ని ఏర్పాటు చేయడం వంటి మార్పుల కోసం సెబీకి అదనపు మానవ వనరులు అవసరమయ్యే అవకాశం ఉంది. సామర్థ్యాలను పుంచుకోవడం, తగినంత శిక్షణ పొందినవారిని నియమించుకోవాల్సి ఉంటుంది. 

3 చట్టాల స్థానంలో

గతవారం లోక్‌సభలో ఎస్‌ఎంసీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. సెబీ తన వార్షిక మిగులులో 25 శాతాన్ని రిజర్వ్‌ ఫండ్‌లో ఖర్చుల కోసం కేటాయించాలి. మిగిలిన మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియాకు బదిలీ చేయాలి. తదుపరి సంప్రదింపుల కోసం ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపారు. ప్రస్తుతం ఉన్న మూడు సెక్యూరిటీల చట్టాలు- 1956 సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌ (నియంత్రణ) చట్టం, 1992 సెబీ చట్టం, 1996 డిపాజిటరీల చట్టంను కొత్త చట్టం ఏకీకృతంతో పాటు భర్తీ చేయనుంది. 

కాలపరిమితులు ఇలా

ఈ బిల్లు ప్రకారం.. ఒక చర్యకు దిశానిర్దేశం, 8 సంవత్సరాల కంటే ముందు జరిగితే సెబీ దానిపై తనిఖీ లేదా దర్యాప్తు చేయడానికి వీలుండదు.  180 రోజుల్లోగా దర్యాప్తును సెబీ పూర్తిచేయాలి. ఒకవేళ జాప్యం జరిగితే, సెబీ లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. అనంతరం పూర్తికాల సభ్యుడి నుంచి పొడిగింపు కోరవచ్చు. మధ్యంతర ఉత్తర్వుల కాలవ్యవధి కూడా 180 రోజులకు పరిమితం చేశారు. తీర్పు, తనిఖీ లేదా దర్యాప్తు పెండింగ్‌లో ఉంటే అటువంటి ఉత్తర్వులను రెండు సంవత్సరాల వరకు పొడిగించొచ్చు. 

అంబుడ్స్‌పర్సన్‌ బాధ్యతలివీ

సెబీ తన అధికారుల్లో ఒకరిని లేదా అంతకంటే ఎక్కువ మందిని అంబుడ్స్‌పర్సన్‌లుగా నియమించొచ్చు. మదుపర్ల ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉండటంతో సెబీకి అదనపు సిబ్బంది అవసరమని భావిస్తున్నారు. మదుపర్ల ఫిర్యాదులను స్వీకరించడం, పరిశీలించడం, పరిష్కరించడం వంటివి అంబుడ్స్‌పర్సన్‌ ప్రాథమిక బాధ్యత. ప్రస్తుతం ఫిర్యాదులను సెబీ స్కోర్స్, ఓడీఆర్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే స్కోర్స్, ఓడీఆర్‌ స్థాయుల్లో భారీగా కేసులు పేరుకుని ఉన్నాయి. వీటికి అంబుడ్స్‌పర్సన్‌ ఆదేశాలు తోడైతే, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌)పై అధిక భారం పడే అవకాశం ఉంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :