
Artificial Intelligence: ఏఐ భవిష్యత్తుకు మేధస్సు, నైపుణ్యాలే కీలకం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
దిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)లో భారీ మార్పులు వస్తున్న నేపథ్యంలో అవధుల్లేని మేధస్సు, మానవ పర్యవేక్షణలోని ‘డిజిటల్ సహోద్యోగులు’, నైపుణ్యాల కొనసాగింపు వంటివి రక్షణగా నిలుస్తాయని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు (ఇండియా, దక్షిణాసియా) పునీత్ చందోక్ అభిప్రాయపడ్డారు. మన దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, సార్వభౌమ సామర్థ్యాల కోసం 17.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.58 లక్షల కోట్ల) పెట్టుబడులను ఈ నెల ప్రారంభంలో భారత పర్యటన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునీత్ తన అంచనాలు తెలిపారు. ప్రస్తుతం ఏఐ అంచనాలను మించిందని, అసలైన ప్రభావాన్ని చూపుతోందని చందోక్ అన్నారు. మనం ఎంత బాధ్యతాయుతంగా, సమగ్రంగా, ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్తామనే దాని బట్టి ఏఐ తదుపరి దశ ఉంటుందని స్పష్టం చేశారు.
మానవుల నియంత్రణలోనే ఏఐ ఏజెంట్లు
నైపుణ్యాల కొరత నుంచి సమృద్ధిగా లభించడం, సంస్థలకు నేరుగా సమాచారం లభించడం సహా ప్రపంచంలో పలు మార్పులను ఆయన అంచనా వేశారు. భవిష్యత్తులో ప్రజలతో పాటు ఏఐ ‘ఏజెంట్లు’ కలిసి పనిచేస్తాయి. టాస్క్‌లను కూడా పూర్తిచేస్తాయి. అయితే మానవుల నియంత్రణలోనే మొత్తం ఉంటుందని చందోక్ వెల్లడించారు.
భారత డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో భారీగా ఏఐ వినియోగం పెరుగుతుందని, ఇది అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్నారు. ఉద్యోగుల పదవులు టాస్క్‌లుగా మారుతాయి. ఉద్యోగ తీరులో మరిన్ని మార్పులు వస్తాయి. ఏఐ యుగంలో నైపుణ్యాలు అత్యంత కీలకమని వివరించారు.
కీలక రంగాల్లో వినియోగం
మన దేశంలో ప్రయోగాల దశ నుంచి పలు కీలక రంగాల్లో ఏఐ ని వినియోగించడం మొదలైంది. విమానయానం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, తయారీ రంగాల్లో ఏఐ మార్పులు తీసుకొస్తోంది. వినియోగదారుల సేవల్లో ఎయిరిండియా, వైద్యులకు తోడ్పాటు ఇచ్చేందుకు అపోలో హాస్పిటల్స్, వ్యవస్థలను మార్చడంలో ఐసీఐసీఐ లాంబార్డ్, వినూత్న ఆవిష్కరణలకు ఏషియన్ పెయింట్స్ ఏఐను వినియోగించాయని చందోక్ వివరించారు. రాబోయే రోజుల్లో ఈ జోరు కొనసాగుతుందని తెలిపారు.
నైపుణ్యాల అభివృద్ధి తప్పనిసరి
ఏఐ వినియోగ ప్రపంచంలో మనుగడకు, నైపుణ్యాలను పెంచుకోవడం ఉద్యోగులకు తప్పనిసరి. ఉద్యోగార్థులు కూడా అధునాతన సాంకేతికతలను నేర్చుకోవాలి. భారత్‌లో 2030 కల్లా 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ ప్రతిన బూనిందని పునీత్ గుర్తు చేశారు.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :