Geetali Gupta : ‘క్లాట్’ టాపర్.. సక్సెస్ మంత్రా!
పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచినా మొదటి ర్యాంక్ వస్తుందని ఎవరూ ఊహించరు.. కానీ ఒకవేళ నిజంగానే వస్తే..? ఆనందం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి ముంచెత్తుతాయి.

- A
- A+
- A++

పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచినా మొదటి ర్యాంక్ వస్తుందని ఎవరూ ఊహించరు.. కానీ ఒకవేళ నిజంగానే వస్తే..? ఆనందం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి ముంచెత్తుతాయి. తాజాగా ‘క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) - 2026’ టాపర్‌గా నిలిచిన గీతాలీ గుప్తా మోము కూడా ఇలాంటి ఫీలింగ్స్‌తోనే వెలిగిపోయింది. తన ఇంట్లో పూజ గది ముందు కూర్చొని పరీక్షా ఫలితాలు చూసుకుంటున్న ఆమె.. తనకే ఆలిండియా మొదటి ర్యాంక్ వచ్చిందని తెలుసుకొని ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. తన తల్లిని గట్టిగా హత్తుకొని సంతోషంతో ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలో గీతాలీ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..!
ఊహించని ర్యాంకు ఇది!
న్యాయ విద్యలోకి ప్రవేశం కల్పిస్తూ ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)’. వచ్చే ఏడాది ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఇందులో ఆలిండియా టాపర్‌గా నిలిచింది రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన 17 ఏళ్ల గీతాలీ గుప్తా. 119 మార్కులకు గాను 112.75 స్కోర్ చేసి మొదటి ర్యాంకు సాధించింది.
‘క్లాట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయని తెలియగానే.. మా ఇంట్లో పూజ గది ముందు కూర్చొని నాకు ఏ ర్యాంకు వచ్చిందోనని ఆతృతగా వెతకడం ప్రారంభించా. అంతలోనే నా మార్కులు, ర్యాంకు చూసుకొని ఆశ్చర్యపోయా. ఆలిండియా టాపర్‌గా నిలిచానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అమ్మను గట్టిగా హత్తుకొని ఏడ్చేశా. ఎందుకంటే నాకు మొదటి ర్యాంకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇదో అద్భుతమైన ఫీలింగ్..’ అంటోంది గీతాలీ. ఇలా తాను ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చాలామంది గీతాలీ ప్రతిభను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.
గెలుపు సూత్రాలు!
ప్రస్తుతం శ్రీ గంగానగర్‌లోని ఓ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది గీతాలీ. ఏడాది క్రితమే తనకు న్యాయ విద్యపై స్పష్టత ఏర్పడిందని.. ఈ మక్కువతోనే క్లాట్ రాయాలనుకున్నట్లు చెబుతోంది.
‘ఏదైనా అంశం గురించి లోతుగా విశ్లేషించడం, చర్చించడమంటే నాకు ముందు నుంచే ఆసక్తి. దీనికి తోడు పొలిటికల్ సైన్స్, పౌరశాస్త్రం నాకు ఇష్టమైన సబ్జెక్టులు. ఇవే పరిపాలన, చట్టపరమైన అంశాల పట్ల నేను ఆకర్షితురాలినయ్యేలా ప్రేరేపించాయి. ఈ ఇష్టంతోనే లా చదవాలనుకున్నా. 11వ తరగతిలో ఉన్నప్పుడే క్లాట్ పరీక్ష గురించి తెలుసుకొని ఈ దిశగా అడుగులేశా. కోచింగ్ తీసుకోవడంతో పాటు సొంతంగా ఓ ప్రణాళిక పెట్టుకొని చదివా. ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవడం, మెంటర్ల సలహాలు-సూచనలు పాటించడం, నెర్వస్‌గా ఫీలవకుండా పాజిటివిటీతో ముందుకు సాగడం.. ఇవే నన్ను ఈ పోటీ పరీక్షలో అగ్ర స్థానంలో నిలబెట్టాయి. అలాగే సోషల్ మీడియాను టైంపాస్ కోసం కాకుండా సబ్జెక్టు నేర్చుకోవడానికి ఉపయోగించా..’ అంటూ తన సక్సెస్ సీక్రెట్స్ గురించి పంచుకుంది గీతాలీ. న్యాయ విద్య కోసం బెంగళూరులోని ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’లో చేరాలని ఉందంటూ తన మనసులోని మాటనూ బయటపెట్టిందీ టాపర్.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 20:08 IST