గతంలోకి వెళ్లొస్తారా?

- A
- A+
- A++

టైమ్ ట్రావెల్... చిన్నా పెద్దా అందరినీ అలరించే సబ్జెక్టు. అందుకే దానిమీద ఏకంగా నవలల సిరీస్ రాసేశారు జపాన్ రచయిత తొషికజు కవగూచి. మొదట ‘బిఫోర్ ద కాఫీ గెట్స్ కోల్డ్’ పేరుతో ఓ నాటకం రాశారాయన. దానికి అవార్డులు వచ్చి బహుళ ప్రేక్షకాదరణ పొందడంతో పదేళ్ల క్రితం ఆ పేరుతోనే నవలగా మలిచారు. అదీ ఇన్‌స్టంట్ హిట్ అయ్యింది. దాంతో సిరీస్ కింద ఇప్పటికి అయిదు నవలలు వెలువరించారు. అన్నీ వేటికవే చదవవచ్చు, ఒక వరుసలో చదివితే మరింత థ్రిల్లింగ్‌గా ఉంటాయి. టైమ్ ట్రావెల్‌కి సంబంధించిన షరతులన్నీ మొదటి పుస్తకంలోనే ఉంటాయి. వాటి ఆధారంగానే కథలు నడుస్తాయి కాబట్టి అది తప్పక చదవాలి.
టోక్యోలోని ఒక సందులో ఉన్న చిన్న కాఫీ షాప్ అది. మూడు టేబుల్స్, కౌంటర్, వెనకాలో గది... మొత్తం కథ ఆ కాస్త చోటులోనే జరుగుతుంది. మూడు గోడ గడియారాలు వేర్వేరు టైమ్‌లను చూపిస్తుంటాయి. ఆ కెఫేలోని ఒక కుర్చీలో దయ్యం కూర్చుంటుంది. అది టాయ్‌లెట్‌కి వెళ్లి వచ్చేలోపు ఎవరైనా అందులో కూర్చుంటే టైమ్ ట్రావెల్ చేయొచ్చు. గతంలోకి వెళ్లి ఎవరినైనా కలిసిరావచ్చు. కాకపోతే ఆ వ్యక్తి కూడా గతంలో ఈ కెఫేకి వచ్చి ఉండాలి. కాఫీ పూర్తిగా చల్లగా అయిపోయేలోపు అంటే గంట లోపలే తిరిగి వర్తమానానికి వచ్చేయాలి. ఫ్యుమికో అనే యువతి వారం క్రితం ఆ కెఫేలోనే బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడుతుంది. అతడు మంచి ఉద్యోగం కోసం ఆమెను వదిలేసి అమెరికా వెళ్లిపోవాలనుకుంటాడు. ఒక్క అవకాశం దొరికితే మళ్లీ ఆరోజుకు వెళ్లి ఆనాటి గొడవను సరిదిద్దుకోవాలనుకుంటుంది ఫ్యుమికో. ఆమెకు ఆ కెఫే ప్రత్యేకత గురించి తెలుస్తుంది. ఆమె ప్రయత్నం సఫలమైందా అన్నది కథ. మరో నలుగురు కస్టమర్లు కూడా ఈ కథలో ఉంటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. అల్జీమర్స్‌తో బాధపడుతున్న భర్త రాసిన ఒక ఉత్తరం ఎక్కడుందో తెలుసుకోవాలని ఒకరు, కోపంతో విడిపోయిన చెల్లెల్ని కలవాలని మరొకరు అనుకుంటే, ఇంకొకామె ఏకంగా భవిష్యత్తులోకి వెళ్లి పుట్టబోయే తన కూతురితో మాట్లాడాలనుకుంటుంది.
ఇక సీక్వెల్స్ విషయానికి వస్తే ప్రతిదాంట్లోనూ కొత్త పాత్రలు ఉంటాయి. ‘టేల్స్ ఫ్రమ్ ద కెఫే’లో ఒక వ్యక్తి ఇరవయ్యేళ్ల క్రితం మరణించిన స్నేహితుణ్ని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. మరో వృద్ధుడు జీవితకాలంలో తన భార్యకు ఏ బహుమతీ ఇవ్వనందుకు పశ్చాత్తాపపడతాడు. ‘బిఫోర్ యువర్ మెమొరీ ఫేడ్స్’లో ఓ తల్లీకూతురూ ఒకరినొకరు రక్షించుకోవడానికి గతంలోకి వెళ్తారు. ‘బిఫోర్ వియ్ సే గుడ్‌బై’లో భార్య బ్రెయిన్ డ్యామేజ్ అయ్యాక బాధపడే వ్యక్తి, పెళ్లి ప్రతిపాదనకు సమాధానం చెప్పలేకపోయిన యువతి లాంటివారు తారసపడతారు. నిరుడు వచ్చిన ‘బిఫోర్ వియ్ ఫర్‌గెట్ కైండ్‌నెస్’లో నలుగురివీ వైవిధ్యభరితమైన కథలు. మరో నాలుగు కథలతో ఆరో పుస్తకం ‘బిఫోర్ ఐ న్యూ ఐ లవ్డ్ యు’ వచ్చే ఏడాది రానుంది. జ్ఞాపకాల పరామర్శ, మారిపోయే మనుషులు, మనసులను దహించివేసే పశ్చాత్తాపాలు, కాలపు సరిహద్దులు దాటి నిలిచే ప్రేమలు... గుప్పెడంత మనసుకు ఎన్నెన్నో కోణాలు. హృద్యమైన మానవీయ కథనాలు. పలు భాషల్లోకి అనువాదమై ఆసక్తిగా చదివిస్తున్న ఈ పుస్తకాల్లోని కథలన్నీ చెప్పేదొకటే... గతంలోకి వెళ్లగలమేమో కానీ దాన్ని మార్చలేం, మార్చుకోగలిగిన భవిష్యత్తు మాత్రం అచ్చంగా మన సొంతమేనని!

మానవ హక్కులను ప్రభుత్వం ఒక్కటే ఎప్పటికీ పూర్తిగా అమలు చేయలేదు. పౌరులు కూడా బాధ్యత తీసుకుని ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా న్యాయాన్ని నిస్సహాయుల ముంగిటికి తీసుకెళ్లాలి. అందరికీ సమన్యాయం అందేలా చూడాలి.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.