‘చీర’ సొగసు.. మారుతోంది!

ఎన్ని ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా చీరను మాత్రం రీప్లేస్‌ చేయలేవు. దాని సొగసు, అది కట్టుకుంటే వచ్చే అందం అలాంటిది మరి.. అన్నింటికంటే ముఖ్యంగా ఇది మన సంప్రదాయ వస్త్రధారణ కూడా! అయితే చీర ఎవర్‌గ్రీనే అయినా ఇందులో సరికొత్త ట్రెండ్స్‌ పుట్టుకురావడం ఏటా జరిగేదే!

Eenadu icon
By Vasundhara Team Published : 20 Dec 2025 19:54 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

(Photos: Instagram)

ఎన్ని ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా చీరను మాత్రం రీప్లేస్‌ చేయలేవు. దాని సొగసు, అది కట్టుకుంటే వచ్చే అందం అలాంటిది మరి.. అన్నింటికంటే ముఖ్యంగా ఇది మన సంప్రదాయ వస్త్రధారణ కూడా! అయితే చీర ఎవర్‌గ్రీనే అయినా ఇందులో సరికొత్త ట్రెండ్స్‌ పుట్టుకురావడం ఏటా జరిగేదే! అలా ఈ ఏడాదీ కొన్ని శారీ ట్రెండ్స్‌ తమ హవా కొనసాగించాయి. సెలబ్రిటీలు మొదలు సామాన్య మహిళల దాకా.. ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో భాగమవుతూ వారి అందానికి వన్నెలద్దాయి. ‘ప్రపంచ చీర దినోత్సవం’ సందర్భంగా ఈ ఏడాది మగువల మనసు దోచిన కొన్ని శారీ ట్రెండ్స్‌ ఇవి!

‘లైట్‌ వెయిట్‌’ లవ్‌!

ఏ దుస్తులు ఎంచుకున్నా లైట్‌ వెయిట్‌గా, సౌకర్యంగా ఉండాలనుకుంటున్నారు ఈ తరం అమ్మాయిలు. చీరల విషయంలోనూ ఇదే ఫ్యాషన్‌ మంత్రా ఫాలో అవుతున్నారు. అందుకే ఈ ఏడాది లైట్‌ వెయిట్‌ శారీస్‌కి డిమాండ్‌ మరింతగా పెరిగిందంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. ఇక రోజూ ఆఫీస్‌కి చీరకట్టులోనే వెళ్లాలనుకొనే మహిళల నుంచి పార్టీ వేర్‌ ఎంపికల దాకా.. దాదాపు చాలామంది తేలికపాటి చీరలకే ఓటేసినట్లు చెబుతున్నారు. అయితే ఇలా చీర లైట్‌వెయిట్‌గా, సింపుల్‌గా ఉన్నప్పటికీ బ్లౌజ్‌తో తమ లుక్‌ని హైలైట్‌ చేసుకున్న వారూ చాలామందే! ఈ క్రమంలోనే వెల్వెట్‌, మ్యాచింగ్‌ కలర్‌ ఫ్లోరల్‌, కాంట్రాస్ట్‌ కలర్‌ బ్లౌజులు.. ఇలా ఎవరి అభిరుచులకు తగినట్లుగా వారు ఎంచుకొని మెరిసిపోయారు. అంతేకాదు.. ఆయా సందర్భాలకు అనుగుణంగా సింపుల్‌, కాస్త హెవీ జ్యుయలరీతో తమ లుక్‌కి ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తూ అదరగొట్టేశారు.

‘ఫ్లోరల్‌ టచ్‌’ అదుర్స్‌!

ప్రింట్‌ ఫ్యాషన్‌ ఈనాటిది కాదు. ప్రాచీన కాలం నుంచే ఇది మగువల మనసైన ఫ్యాషన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఇందులోనూ యానిమల్‌, ఫ్లోరల్‌, జామెట్రిక్‌, స్ట్రైప్‌డ్‌.. వంటి విభిన్న ప్రింట్లతో రూపొందించిన దుస్తులు చాలామంది ప్రయత్నించే ఉంటారు. కాలానికి అనుగుణంగా ఫ్యాషన్‌ పోకడలు మారినట్టే.. ప్రింట్‌ ఫ్యాషన్‌లోనూ లేటెస్ట్‌ ట్రెండ్స్‌ అందుబాటులోకొస్తున్నాయి. అలా ఈ ఏడాది వాస్తవికతకు దగ్గరగా ఉండే ఫొటోరియలిస్టిక్‌ ఫ్లోరల్స్‌, అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌, మినిమలిస్ట్‌ డిజైన్స్‌, జామెట్రిక్‌ ప్యాటర్న్స్‌.. వంటివి ట్రెండింగ్‌లో నిలిచాయట! ఈ తరహా ప్రింట్లతో కూడిన ఫ్యాషనబుల్‌ శారీస్‌ని ఎంచుకోవడానికి మగువలు తెగ ముచ్చటపడ్డారట! చూడ్డానికి సింపుల్‌గా ఉన్నా, డీసెంట్‌ లుక్‌ని అందిస్తూనే.. సౌకర్యాన్నిచ్చే ఈ తరహా చీరలు ఎలాంటి అకేషన్‌కైనా ఇట్టే నప్పేయడమే ఇందుకు కారణమట!

ప్రి-స్టిచ్‌డ్‌.. ఎవర్‌గ్రీన్‌!

ఈ బిజీ లైఫ్‌స్టైల్‌లో అటు ఆఫీస్‌కైనా, ఇటు పార్టీకైనా క్షణాల్లో రడీ అయిపోవాలనుకుంటున్నారు మహిళలు. అలాగని ఏదో ఒక డ్రస్‌ వేసుకొని వెళ్దామని రాజీ పడట్లేదు. అకేషన్‌ ఏదైనా చీరకట్టుకే ఓటేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రి-స్టిచ్‌డ్‌/ప్రి-డ్రేప్‌డ్‌ చీరలకు ఆదరణ పెరిగిపోయింది. గంటల తరబడి కట్టే అవసరం లేకుండా సులభంగా ధరించేలా ముస్తాబవుతోన్న ఈ చీరలు.. ఎవర్‌గ్రీన్‌ శారీస్‌గా ప్రస్తుతం ప్రతి మహిళ వార్డ్‌రోబ్‌లోనూ స్థానం సంపాదించాయి. ఈ ఏడాది కూడా చాలామంది ఈ తరహా చీరల్ని వివిధ అకేషన్స్‌ కోసం ఎంచుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్యాంట్‌ శారీస్‌, కేప్‌ డ్రేప్స్‌, రఫుల్డ్‌ స్టైల్‌.. వంటి విభిన్న ఫ్యాషనబుల్‌ ప్రి-స్టిచ్‌డ్‌ శారీస్‌ మహిళల అందాన్ని ద్విగుణీకృతం చేశాయని చెప్పచ్చు. ఇక వీటినీ తమ అభిరుచులకు తగినట్లుగా హెవీ ఎంబ్రాయిడరీ, కోర్సెట్‌ తరహా బ్లౌజులతో జతచేస్తూ తమ స్టైల్‌ కోషెంట్‌ని పెంచేశారు ఫ్యాషన్‌ బ్యూటీస్‌.

ఫూలోంకీ శారీ!

పెళ్లిలో ఆయా అకేషన్స్‌కి తగినట్లుగా విభిన్న అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకోవడం మనకు అలవాటే! అందులోనూ వధువులతో పోటీ పడుతూ మరీ కొన్ని రకాల దుస్తుల్ని కస్టమైజ్‌ చేయించుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు. హల్దీ, మెహెందీ, సంగీత్‌, బ్రైడల్‌ ఎంట్రీ కోసం కొందరు వధువులు పూలతో ప్రత్యేకంగా దుపట్టా, వెయిల్‌, అడ్డుతెర ఫూలోంకీ చాదర్‌.. వంటివి డిజైన్‌ చేయించుకోవడం మనం చూశాం. ఈ తరహాలోనే కొంతమంది పూలతో చీరల్ని కస్టమైజ్‌ చేయించుకొనీ ఆయా అకేషన్స్‌లో ధరించి మెరిసిపోతున్నారు. అలా ఈ ఏడాది ఫూలోంకీ శారీ వంటి ఫ్యాషన్లకు ఆదరణ పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక మరికొందరు చీర రంగుకు మ్యాచయ్యేలా పల్లూ మాత్రమే ఆయా పూలతో కస్టమైజ్‌ చేయించుకుంటూ తమ ఫ్యాషన్‌ అభిరుచుల్ని చాటుకుంటున్నారు.

‘స్కాలోప్‌ బోర్డర్‌’ సొగసులు!

చీర సాధారణంగానే ఉన్నా.. బోర్డర్‌తో కొన్ని హైలైట్‌ అవుతుంటాయి. శారీకి హెవీ లుక్‌, రిచ్‌నెస్‌ తీసుకొస్తాయి. అలాంటి సొగసైన స్కాలోప్‌ బోర్డర్‌ శారీస్‌ ఈ ఏడాది సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయంటున్నారు నిపుణులు. బోర్డర్‌ అంచు డిజైన్లకు అనుగుణంగా ఎడ్జెస్‌ను కట్‌ చేస్తూ అందంగా తీర్చిదిద్దడమే దీని ప్రత్యేకత. ఇందులోనూ జరీ, ఎంబ్రాయిడరీ, సీక్విన్డ్‌, లేస్‌, మిర్రర్‌ వర్క్‌.. ఇలా విభిన్న డిజైన్లతో కూడిన స్కాలోప్‌ బోర్డర్‌ చీరలు మగువల మనసు దోచుకున్నాయి. కొంతమంది ప్లెయిన్‌ శారీస్‌పైనా ఈ తరహా బోర్డర్‌ను జతచేయించుకొని, తమ అభిరుచులకు తగినట్లుగా కస్టమైజ్‌ చేయించుకొని ఫ్యాషన్‌ దివాలా మెరిసిపోయారు. మరికొందరు ఈ తరహా బ్లౌజుల్ని తమ చీరలకు మ్యాచ్‌ చేసి అదరగొట్టారు.

ఇవే కాదు.. ఆర్గంజా, టిష్యూ సిల్క్‌, మెటాలిక్‌, ఫ్యూజన్‌.. వంటి చీరలూ ఈ ఏడాది చాలామంది అతివల వార్డ్‌రోబ్‌లో భాగమయ్యాయి. ఇక కొందరు పర్యావరణ ప్రియులు సస్టెయినబుల్‌ ఫ్యాషన్‌ పేరుతో.. రీసైక్లింగ్‌ చేసిన చీరలు, న్యాచురల్‌ డైలు అద్దిన శారీస్‌, సెమీ-సింథటిక్‌ ఫైబర్‌తో తయారుచేసిన టెన్సెల్‌ చీరకట్టులోనూ ఔరా అనిపించారు. ఇలా మొత్తానికి ఈ ఏడాది సింపుల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌గా కనిపించే మినిమల్‌ శారీ ట్రెండే కొనసాగిందని చెప్పచ్చు.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :