Alia Bhatt : అందుకే నా పెళ్లికి సింపుల్‌ చీర ఎంచుకున్నా!

పెళ్లి నాటి జ్ఞాపకాలు ఎప్పటికైనా చెరిగిపోని తీపి గుర్తులే. వివాహ మండపం, పెళ్లి తంతు, ఆ రోజు ధరించిన అవుట్‌ఫిట్స్‌.. వీటి సంగతులు, ప్రత్యేకతలు అప్పుడప్పుడూ మన మనసులో మెదులుతుంటాయి.

Eenadu icon
By Vasundhara Team Published : 19 Dec 2025 18:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

(Photos: Instagram)

పెళ్లి నాటి జ్ఞాపకాలు ఎప్పటికైనా చెరిగిపోని తీపి గుర్తులే. వివాహ మండపం, పెళ్లి తంతు, ఆ రోజు ధరించిన అవుట్‌ఫిట్స్‌.. వీటి సంగతులు, ప్రత్యేకతలు అప్పుడప్పుడూ మన మనసులో మెదులుతుంటాయి. వాటిని ఇతరులతో పంచుకుంటూ మురిసిపోతుంటాం కూడా! తాజాగా ఓ సందర్భంలో అందాల తార ఆలియా భట్‌ కూడా తన పెళ్లి విశేషాల్ని నెమరువేసుకొని ఇలాగే మురిసిపోయింది. ముఖ్యంగా తన వెడ్డింగ్‌ శారీ ఎంపిక వెనకున్న కథేంటో బయటపెట్టింది. ఎరుపు, పసుపు.. వంటి సంప్రదాయ రంగుల్ని కాదని, పేస్టల్‌ షేడెడ్‌ శారీ ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. ‘ఫ్యాషన్‌ అంటే ఇతరులతో పోల్చుకోవడం కాదు.. మన కంఫర్ట్‌ మనం చూసుకోవడం..’ అంటూ తన వెడ్డింగ్‌ లుక్‌తో నిరూపించిన ఆలియా మాటలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

సాధారణంగా తమ పెళ్లిలో ఎవర్‌గ్రీన్‌ లుక్‌లో మెరిసిపోవాలనుకుంటారు వధువులు. ఈ క్రమంలోనే భారీగా డిజైన్‌ చేసిన దుస్తులు, నగల్ని ఎంచుకుంటారు. అందులోనూ ఎరుపు, పసుపు.. వంటి సంప్రదాయ రంగుల్లోనే తమ పెళ్లి దుస్తుల్ని డిజైన్‌ చేయించుకుంటారు. అయితే ఆలియా వెడ్డింగ్‌ లుక్‌ మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం మనం చూశాం. 2022, ఏప్రిల్‌ 14న బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో ఏడడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. తన పెళ్లి కోసం పేస్టల్‌ షేడెడ్‌ శారీని ఎంచుకొని, సింపుల్‌ బ్రైడ్‌లా ముస్తాబై అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తన వెడ్డింగ్‌ శారీ ఎంపిక వెనకున్న కథేంటో తాజాగా ఓ సందర్భంలో పంచుకుంది.

కలర్‌ కాదు.. కంఫర్ట్‌ కావాలన్నా!

సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్‌ సబ్యసాచి రూపొందించిన అందమైన చీరను తన పెళ్లి కోసం ఎంచుకుంది ఆలియా.

‘బేసిగ్గా నాకు చీరలంటే చాలా ఇష్టం. అందుకే నా పెళ్లికీ లెహెంగా కాకుండా శారీనే ఎంచుకున్నా. తొలుత సబ్యసాచికి జూమ్‌ కాల్‌ చేసి నాకో అందమైన బ్రైడల్‌ వేర్‌ కావాలని అడిగా. అప్పుడు ఆయన ‘చీర? లెహెంగా? ఏది ధరించాలనుకుంటున్నావ్‌?’ అని అడిగారు. మరో ఆలోచన లేకుండా నాకు చీరే కావాలని చెప్పా.. అది కూడా కంఫర్టబుల్‌గా ఉండాలని అడిగా. అప్పుడు ఏ రంగు శారీ కావాలని అడిగారు. తెలుపు-గోల్డ్‌ కాంబినేషనల్‌లో అయితే బాగుంటుందన్నా. అందుకు తను ‘ఛాయ్‌ డిప్‌డ్‌ వైట్‌/ఐవరీ’ కలర్‌ ఆర్గంజా శారీ రూపొందిస్తానన్నారు. ఆర్గంజానే ఎందుకు అంటే.. ‘ఇది చూడ్డానికి సింపుల్‌గానే ఉన్నా గ్రాండ్‌ లుక్‌ని అందిస్తుంది.. దీంతో అంత ఆర్భాటాలేవీ లేకుండానే అద్భుతంగా మెరిసిపోవచ్చు..’ అని సలహా ఇచ్చారు.

అన్నీ బ్యాలన్స్‌డ్‌గా!

ఇలా చీరే కాదు.. చీరకు అనుసంధానించిన పొడవాటి వెయిల్‌ కూడా ప్రత్యేకంగా కస్టమైజ్‌ చేయించుకున్నాం. రణ్‌బీర్‌తో నాకున్న ప్రేమకు గుర్తుగా దీనిపై ‘మిసెస్‌ హిప్‌స్టర్‌’ అనే పదాలు ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేశారు సబ్యసాచి. అయితే మన సంప్రదాయం ప్రకారం ఎరుపు, పసుపు.. వంటి రంగుల్లో రూపొందించిన దుస్తులకు పెళ్లిళ్లలో ప్రత్యేక స్థానం ఉంది. కానీ నా బ్రైడల్‌ శారీ విషయంలో నేను కలర్‌ చూసుకోలేదు.. కంఫర్ట్‌కి ప్రాధాన్యమిచ్చా. ఇక ఈ చీరకు మ్యాచింగ్‌గా అన్‌కట్‌ డైమండ్‌ జ్యుయలరీని సైతం సబ్యసాచి కలెక్షన్స్‌ నుంచే ఎంచుకున్నా. చీర సింపుల్‌గా ఉన్నా.. నెక్‌పీస్‌, ఇయర్‌రింగ్స్‌, మాంగ్‌ టీకా.. వంటి బ్రైడల్‌ జ్యుయలరీ మాత్రం భారీగా ఉండాలని కోరుకున్నా. అలాగే బ్రైడల్‌ మేకప్‌ చాలా సింపుల్‌గా ఉండేలా చూసుకున్నా. ఇలా అటు దుస్తులు, జ్యుయలరీ, ఇటు మేకప్‌.. అన్నీ బ్యాలన్స్‌డ్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డా కాబట్టే నా పెళ్లి రోజు నాకు నచ్చినట్లుగా మెరిసిపోయా..’ అంటూ తన బ్రైడల్‌ శారీ, లుక్‌ వెనకున్న సీక్రెట్స్‌ని పంచుకుంది ఆలియా. తద్వారా అకేషన్‌ ఏదైనా సరే.. మనం ఎంచుకునే దుస్తులు మనకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమంటూ చెప్పకనే చెప్పిందీ బ్యూటీ.

పెళ్లి చీర.. మళ్లీ!

సాధారణంగా తమ పెళ్లి కోసం ఎంచుకున్న దుస్తుల్ని మరోసారి ధరించడానికి ఇష్టపడరు చాలామంది. కానీ ఆలియా తన పెళ్లి చీరను మరో సందర్భంలో ధరించి కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. 2023లో ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ భామ.. తన పెళ్లి చీరలోనే ముస్తాబై వెళ్లి ఈ అవార్డు అందుకుంది. దీంతో అప్పట్లో ఆమె లుక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

‘ఎంతో ఇష్టపడి దుస్తుల్ని కొంటాం.. మనకు నచ్చినట్లుగా కస్టమైజ్‌ చేయించుకుంటాం. ఇలా ఒకసారి మనకు ప్రత్యేకంగా అనిపించిందేదైనా సరే.. పదే పదే మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే అలాంటి దుస్తుల్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రిపీట్‌ చేయాలి.. ఏదైనా పెద్ద ఈవెంట్‌ ఉన్నప్పుడు నాకు నా పెళ్లి చీరే గుర్తొస్తుంది. అది నాకు ఎంతో స్పెషల్‌. అది కట్టుకోగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అందుకే పెళ్లి చీరలో వెళ్లి జాతీయ పురస్కారం తీసుకున్నా.. అది ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నా మదిలో నిలిచిపోయింది..’ అంటూ తన శారీ లవ్‌, సస్టెయినబుల్‌ లైఫ్‌స్టైల్‌ గురించి పంచుకుంటూ ఫ్యాన్స్‌లో పర్యావరణ స్పృహ పెంచిందీ అందాల తార.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :