Tamil Nadu: తండ్రికి రూ.3 కోట్ల బీమా చేయించి.. పాముకాటుతో చంపించి..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: బీమా సొమ్ము కోసం ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రినే పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన (Sons Use Snake to Murder Father) తమిళనాడులో చోటుచేసుకుంది. దర్యాప్తు సమయంలో బీమా సంస్థ అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన గణేశన్ (56) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగశాల సహాయకుడిగా విధులు నిర్వర్తించేవాడు. అతడు పాముకాటుతో మరణించినట్లు అక్టోబర్‌లో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద చేయించిన రూ.3 కోట్ల బీమా డబ్బుల కోసం అతడి ఇద్దరు కుమారులు బీమా సంస్థను ఆశ్రయించారు.
గణేశన్ బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తున్న సమయంలో అతడిపై అధిక విలువ గల అనేక పాలసీలు ఉండడం, అతడి కుమారుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో బీమా సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గణేశన్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు కుమారులే బీమా డబ్బు కోసం తండ్రిని పాము కాటుతో చంపించినట్లు గుర్తించారు. పథకం ప్రకారమే వారు తండ్రి పేరు మీద రూ. 3 కోట్ల బీమా చేయించారని.. అనంతరం ప్రమాదవశాత్తూ తమ తండ్రి చనిపోయినట్లు నమ్మించడానికి పాము కాటుతో చంపాలని కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు.
- రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
గణేశన్ మృతి చెందిన వారానికి ముందు కూడా అతడి కుమారులు ఆయనను చంపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తమ స్నేహితుల సహకారంతో ఒక పామును తమ తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన పక్కన వదిలారు. అయితే ఆ పాము కాటు ప్రాణాంతకం కాకపోవడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో వారం రోజుల తర్వాత మరో అత్యంత విషపూరితమైన పామును తీసుకువచ్చి.. గణేశన్ నిద్రపోతున్న సమయంలో అతడి మెడపై కాటు వేయించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు పామును అక్కడే చంపేశారు. అతడిని ఆస్పత్రికి తరలించే విషయంలో నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించడంతో మృతుడి ఇద్దరు కుమారులతో సహా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 10:41 IST