
Pawan Kalyan: ఎమ్మెల్యేల పనితీరు చిరస్థాయిగా నిలవాలి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, అమరావతి: ‘నియోజకవర్గంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలను గుర్తించి వాటిని నెరవేర్చేలా ప్రణాళికలు రూపొందించాలి. శాసనసభ్యుడిగా మనం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఆ తపనతోనే పనిచేయాలి. ప్రజలు మెచ్చేలా మన పనితీరు ఉండాలి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏం కావాలో తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన తొమ్మిది మంది పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా ముఖాముఖి భేటీ అయ్యారు. ఏడాదిన్నరగా తాము ఏం చేశామో వారు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. నామినేటెడ్ పదవులపై చర్చించారు. ‘వర్తమాన, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి. యువతకు ఉపాధిపై దృష్టి సారించాలి. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. కూటమి స్ఫూర్తిని బలంగా నిలపాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి’ అని పవన్‌కల్యాణ్ వారికి తెలియజేశారు. పార్టీ నిర్మాణంలో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పిఠాపురం ఫార్ములా అనుసరించాలని చెప్పారు.
ఎమ్మెల్యేలు విన్నవించిన అంశాలు
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ:తోటపల్లి ఆధునికీకరణ పనులు చేపట్టాలి. పాలకొండ ప్రధానరహదారి విస్తరించాలి. గెడ్డ, వడ్డండి ఎత్తిపోతల పథకాలకు నిధులు కావాలి. పాలకొండ డంపింగ్ యార్డుకు స్థలం అవసరం.
నెల్లిమర్ల ఎమ్మెలే లోకం నాగమాధవి:తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు పూర్తి. నానో పార్కు అభివృద్ధి చేయాలి. ఏఐ సిటీ, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించారు.
పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్:సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలి. కాలుష్యం బారిన పడ్డ తాడి గ్రామాన్ని తరలించాలి. నరేగా నిధులు పెంచాలి.
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్:నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. పరిష్కారానికి జలజీవన్ మిషన్ నిధులు కావాలి. ఎలమంచిలి-గాజువాక ప్రధాన రహదారి పనులు పూర్తిచేయాలి.
కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ:ఆరు గ్రామాలు, 8 వార్డుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ఆర్థికసంఘం నిధులు రావట్లేదు. వాటిని కార్పొరేషన్‌లో విలీనం చేయాలి. క్రికెట్ స్టేడియం, బీచ్ సుందరీకరణ, రోడ్లు, డ్రెయిన్ల ప్రతిపాదనలు సమర్పించారు.
పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ:వరద గట్లు బలోపేతం చేయాలి. గ్రోయిన్ల నిర్మాణం చేపట్టాలి. వైనతేయ నదిపై వంతెన నిర్మాణం పూర్తిచేయాలి. అయినవిల్లి, అప్పనపల్లి ఆదుర్రు గ్రామాల్లోని పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్:శంకరగుప్తం డ్రెయిన్‌ను డ్రెడ్జింగ్ చేయాలి. అంతర్వేది ఆలయ అభివృద్ధికి సహకరించాలి. హార్బర్ నిర్మాణం పూర్తిచేయాలి.
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్:నియోజకవర్గంలో 22ఏ కింద ఉన్న భూముల్ని ఆ పరిధి నుంచి తొలగించాలి. పూర్ణబజార్, నెహ్రూమార్కెట్ కొత్తగా నిర్మించాలి. బీచ్‌రోడ్డును సుందరీకరించాలి.
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్:నియోజకవర్గంలో రైతుసమస్యల పరిష్కారం, నీటిపారుదల పనుల విషయంపై చర్చించారు. తెలుగుభాష వాడుక పెంచేలా చూడాలని కోరారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 06:29 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.