నేనెందుకు ప్రయత్నించకూడదని..!
అమాయకపు అమ్మ, మరిదిని వెనకేసుకొచ్చే వదిన, భర్త మాట జవదాటని భార్య, అత్తమామలకు సేవ చేసే కోడలు... ఇలా చెప్పుకొంటూ పోవాలే కానీ తెలుగు తెరపై ప్రగతి మహావాది పోషించిన పాత్రలెన్నో.

- A
- A+
- A++

అమాయకపు అమ్మ, మరిదిని వెనకేసుకొచ్చే వదిన, భర్త మాట జవదాటని భార్య, అత్తమామలకు సేవ చేసే కోడలు... ఇలా చెప్పుకొంటూ పోవాలే కానీ తెలుగు తెరపైప్రగతి మహావాదిపోషించిన పాత్రలెన్నో. ఏ పాత్ర చేసినా... ప్రగతి తప్ప ఇంకెవరూ దానికి న్యాయం చేయలేరు అన్నంతగా ఒదిగిపోవడం ఆమె నైజం. అయితే, దీనికి భిన్నంగా పవర్‌లిఫ్టింగ్‌లో రాణించాలని కోరుకున్నారీమె. ఒడుదొడుకులు, ట్రోల్స్, హేళనలు... అన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్నారు. ఆమెను ‘వసుంధర’ పలకరించగా...
దినచర్య ఎలా ఉంటుంది...
షూటింగ్ ఉంటే హడావుడిగా లేచి, పనులు పూర్తిచేసుకుని సమయానికి అక్కడికి చేరుకుంటా. లేదంటే నా రోజు ఆలస్యంగానే మొదలవుతుంది. ఏదేమైనా రోజుకు రెండున్నర గంటలు తప్పకుండా జిమ్ చేస్తా. ఒక్కోసారి పరిధి దాటేస్తుంటా.
ప్రస్తుత విజయం గురించి...
ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించా. ఓవర్ ఆల్ గేమ్‌లో రజతం, డెడ్‌లిఫ్ట్‌లో స్వర్ణం... బెంచ్, స్క్వాట్ లిఫ్టింగ్‌ల్లో రెండు రజత పతకాలు గెలుచుకున్నా. నేను ఊహించని గెలుపు ఇది. మరిన్ని పతకాలు గెలుచుకోవాలన్న ప్రేరణనిచ్చిందీ విజయం.
పవర్ లిఫ్టింగ్‌ని ఎంపిక చేసుకోవడానికి కారణం?
నేను ఫుడీని. తినడం, నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. కానీ సినీ రంగంలో ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఎక్కువ. బొద్దుగా ఉన్నా... ఆరోగ్యంగా ఉండాలనేదే నా లక్ష్యం. అందుకే పదిహేనేళ్ల క్రితమే నా రొటీన్‌లో ఫిట్‌నెస్ వచ్చి చేరింది. జిమ్‌కు వెళ్లేదాన్ని, వ్యాయామాలు చేసేదాన్ని. దీన్ని ఓ క్రీడగా చూసింది మాత్రం యాదృచ్ఛికంగానే. మా కమ్యూనిటీలో ఒక మహిళ పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్నారని తెలిసి... నేనెందుకు ప్రయత్నించకూడదు అనుకున్నా. వెంటనే శిక్షణలో చేరిపోయా. అలా అనుకోకుండానే ఇది నా జీవితంలో భాగమైంది.
దీనివల్ల సినీ రంగంలో వెనకపడ్డారా..?
లేదు! పవర్ లిఫ్టింగ్‌ని లాక్‌డౌన్ సమయంలో ఏం తోచక మొదలుపెట్టా. కొవిడ్ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా... మంచి పాత్రల కోసం వేచి చూశా. ఈ ఓపికకు కారణం పవర్ లిఫ్టింగ్ అనే చెబుతా. ఎందుకంటే అంతకుముందు ఏదో అసంతృప్తి ఉండేది. మంచి పాత్రలు రావడం లేదే, చేయలేకపోతున్నానే అని. పైగా, చిన్న చిన్న విషయాలకే కోప్పడేదాన్ని. ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించా. ఫలితాలను ఆశించకుండా నా బెస్ట్ ఇవ్వడం నేర్పిందీ క్రీడ.
ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యలు?
కుటుంబపరంగా నా నిర్ణయాలకు విలువనిచ్చే వాళ్లే ఎక్కువ. మా అమ్మాయి అయితే... ‘అమ్మా నువ్వు చేయగలవు’ అంటూ ప్రోత్సహిస్తుంది. కానీ ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. మొదట్లో చాలా బాధపడేదాన్ని. కానీ నా ఓపికని పరీక్షించడం చూశాక మాత్రం... వాళ్లకు సమాధానం చెప్పాల్సిందే అని నిశ్చయించుకుని కొంచెం గట్టిగానే ప్రతిఘటించా.

ప్రేరణ ఎవరు..?
సాధారణ గృహిణులే నా ప్రేరణ. ఇంటాబయటా అన్నీ చక్కబెట్టుకుంటూ సమన్వయంతో అడుగులు వేస్తున్న వారిని నిజజీవితంలో చాలామందిని చూశాను. వాళ్ల గురించి తెలిసినప్పుడు, చదివినప్పుడు చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది. అంతెందుకు నేను పవర్ లిఫ్టింగ్ ప్రారంభించడానికి కారణమైన మహిళ కూడా గృహిణే. ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతూ... నేను సాధించిన విజయం వాళ్ల ముందు చాలా చిన్నది.
భవిష్యత్తు లక్ష్యాలు...
లక్ష్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. గో విత్ ద ఫ్లో అంతే. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని అనుకుంటున్నా.
నేటి తరానికి సందేశం...
ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. పదేళ్ల క్రితం నేను ఉన్నదానికన్నా ఇప్పుడు భిన్నంగా ఉన్నానా? లేనా? అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. చిన్న చిన్న వాటిలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. జీవితం ఏ ఒక్కదానికో పరిమితం కాకూడదు. భిన్న రంగాల్లో మన ప్రతిభను కనబరచడానికి ప్రయత్నించాలి.
గొంతు మారిపోతుంది. ప్రొటీన్ ఎక్కువగా తింటే శరీరాకృతి అబ్బాయిల్లా మారిపోతుంది... ఇవన్నీ అపోహలు. హద్దుల్లో ఉంటూ ఆరోగ్యానికి హాని కలగనంత వరకూ ఎన్ని వ్యాయామాలైనా చేయొచ్చు. నేను ఇది నేర్చుకుంటున్నా అని తెలిశాక... చాలామంది ఇవే సందేహాలతో వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. సినిమా అవకాశాలు కోల్పోతావని హెచ్చరించిన వారూ లేకపోలేదు. అవేవీ పట్టించుకోకుండా ముందడుగు వేశా.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :