Mobile phone manufacturing: ఒక్క యాపిల్‌తో సరిపెట్టుకుందామా?

Eenadu icon
By Editorial Team Published : 20 Dec 2025 03:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

కేంద్రం 2014లో ‘భారత్‌లో తయారీ’ పథకం ప్రారంభించినప్పుడు దేశంలో రెండంటే రెండే మొబైల్‌ ఫోన్‌ ఉత్పత్తి సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య మూడొందలు దాటింది. అప్పట్లో భారత్‌లో తయారైన మొబైల్‌ ఫోన్ల విలువ రూ.18వేల కోట్లు కాగా, నిరుడు వాటి విలువ రూ.5.45 లక్షల కోట్లకు చేరింది. యాపిల్‌ వంటి బహుళజాతి కంపెనీలకు స్వాగతం పలికితే, మరిన్ని రంగాల్లో భారత్‌ దేదీప్యమానంగా వెలుగొందగలదు.

నేడు ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న రెండో దేశం ఇండియా. 2014-15లో దేశంలోని మొబైల్‌ ఫోన్ల గిరాకీలో మూడొంతులను దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సి వచ్చింది. నిరుడు ఆ అవసరం 0.02శాతానికి తగ్గిపోయింది. అదేకాలంలో భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు రూ.1,500 కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకాయి. ఇవాళ మన దగ్గర నుంచి ఏటా 33కోట్ల మొబైల్‌ ఫోన్లు విదేశాలకు సరఫరా అవుతున్నాయి. 2020-21 నుంచి భారతీయ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలోకి 400కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవహించాయి. భారత్‌లో తయారీ పథకంలో ఈ రంగానిదే సింహభాగం. దేశంలో స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తికి అవసరమైన వసతులను సమకూర్చడం, ప్రభుత్వం తగిన ప్రోత్సాహక విధానాలను అనుసరించడం వల్లే ఇది సాధ్యపడింది.

ఎగుమతుల వెల్లువ

ప్రపంచబ్యాంకు వ్యాపార సౌలభ్య సూచీలో 2014లో 142 ర్యాంకుతో సరిపెట్టుకున్న భారత్‌ 2019లో 63వ ర్యాంకుకు చేరింది. భారత్‌లో తయారీ, డిజిటల్‌ ఇండియా, నైపుణ్య భారత్, దశలవారీ పారిశ్రామికోత్పత్తి పథకం, జాతీయ ఎలక్ట్రానిక్స్‌ విధానం, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం వంటివి దేశాన్ని ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాయి. అసంఖ్యాక వినియోగదారులు, ప్రీమియం ఫోన్లకు గిరాకీ, వ్యాపార సౌలభ్యానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సైతం ఇండియాను స్మార్ట్‌ఫోన్ల దిగుమతిదారు స్థితి నుంచి అతిపెద్ద ఎగుమతిదారు హోదాకు తీసుకెళ్లాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కార్మిక వ్యయం తక్కువ. నిపుణులైన ఇంజినీర్లకూ కొదవుండదు. ఇవే యాపిల్, సామ్‌సంగ్‌లతో పాటు అనేక చైనా కంపెనీలు ఇండియాలో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లను తయారుచేసేలా పురిగొల్పాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అయిదు నెలల్లోనే భారతీయ స్మార్ట్‌ఫోన్ల ఎగుమతి లక్ష కోట్ల రూపాయలను మించిపోయింది. మూడో త్రైమాసికంలో మన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ అయిదు శాతం వృద్ధిని కళ్లజూసింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో యాపిల్‌ హవా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తయిన స్మార్ట్‌ఫోన్ల విలువ 6400 కోట్ల డాలర్లు. అందులో 2410కోట్ల డాలర్ల విలువైన ఫోన్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2015లో భారతదేశ ఎగుమతుల జాబితాలో 167వ ర్యాంకులో ఉన్న స్మార్ట్‌ఫోన్లు నిరుడు మూడో స్థానంలోకి రావడం విశేషం.

కూర్పు సరే... తయారీ ఏదీ?

అమెరికా-చైనా వాణిజ్యపోరు వల్ల తన ఉత్పత్తి కార్యకలాపాలను చైనా వెలుపలకు తరలించాల్సిన అగత్యం యాపిల్‌కు వచ్చింది. టాటా గ్రూప్‌ యాపిల్‌ ఫోన్ల విడిభాగాల కూర్పులో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించసాగింది. టాటా, ఫాక్స్‌కాన్‌లతోపాటు దాదాపు 50 యాపిల్‌ విడిభాగాల సరఫరాదారులు భారత్‌లో యూనిట్లు తెరిచారు. మరో 45 భారతీయ సంస్థలతో యాపిల్‌ ఒప్పందాలు కుదుర్చుకోగా, వాటిలో సగం ఎంఎస్‌ఎంఈలే కావడం విశేషం. ఇదంతా ఒక ఎత్తు అయితే- భారత్‌ ఇప్పటికీ యాపిల్‌ విడిభాగాల కూర్పుదారుగానే ఉండిపోయింది తప్పితే, పూర్తిస్థాయి తయారీదారుగా మారలేదు. సెమీకండక్టర్లు వంటి సాధనాల ఉత్పత్తిలో భారత్‌ తన సత్తా చాటుకోవడానికి పరిశోధన-అభివృద్ధిపై దృష్టి సారించడం అత్యావశ్యకం.

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమెరికాలో దిగుమతి అయిన స్మార్ట్‌ఫోన్లలో 44శాతం ఇండియావే. ప్రథమార్ధంలో యాపిల్‌ సంస్థ భారత్‌ నుంచి వెయ్యి కోట్ల డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఇదే ఊపు కొనసాగితే- ఈ సంవత్సరాంతానికి ప్రపంచ ఐఫోన్‌ ఉత్పత్తిలో నాలుగో వంతు వాటా ఇండియాదే అవుతుంది. 2028 కల్లా యాపిల్‌ తన విడిభాగాల్లో 30శాతాన్ని భారత్‌ నుంచే సేకరించాలన్న షరతును అంతకన్నా ముందే చేరుకోవచ్చు. నేడు ఐఫోన్‌-17 సహా అధునాతన యాపిల్‌ మోడళ్లన్నీ ఇండియాలోనే తయారవుతున్నాయి. యాపిల్‌ భారత్‌లో ఐఫోన్ల తయారీ చేపట్టేనాటికి ప్రపంచ విక్రయాల్లో 0.5శాతం మాత్రమే ఇక్కడ అమ్ముడుపోయేవి. నేడు ప్రపంచ ఐఫోన్‌ మార్కెట్‌లో 10.4శాతం వాటా మనదే. ఐఫోన్లకు మన దేశం మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యాపిల్‌ ఇండియా లాభాలు 16శాతం పెరిగి రూ.3,196 కోట్లకు చేరాయి. భారత్‌లో విస్తరిస్తున్న మధ్యతరగతి నుంచి గిరాకీ పెరుగుతుండటంతో యాపిల్‌ మరిన్ని స్టోర్లను తెరుస్తోంది.

విశ్వవిపణిలో గట్టి పోటీదారు కావాలంటే...

ఇండియాలో యాపిల్‌ కార్యకలాపాల వల్ల మూడున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. ఈ సంవత్సరాంతానికి మరెన్నో లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది. యాపిల్‌కు విడిభాగాలు సరఫరా చేసే టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్‌ వంటి సంస్థలు అత్యధిక ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించాయి. యాపిల్‌ తీసుకొచ్చిన ఉద్యోగాల్లో 72శాతం మహిళలకే దక్కాయి. భారత్‌ ప్రపంచస్థాయి ఉత్పత్తి నెట్‌వర్క్‌లతో అనుసంధానమైతే అధిక వేతన ఉద్యోగాలను సృష్టించవచ్చనేందుకు యాపిల్‌ ఉదంతమే నిదర్శనం. దేశంలోని కార్మిక ఆధారిత సంప్రదాయ పరిశ్రమలతో పోలిస్తే ఎలక్ట్రానిక్స్, యంత్రాలతో నడిచే పరిశ్రమలే వేగవంతమైన వృద్ధిని అందుకుని, పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టించాయి. ఎగుమతులనూ సాధించాయి. యాపిల్‌ వంటి మరిన్ని బహుళజాతి సంస్థలను రప్పిస్తే కొరియా, తైవాన్‌ల మాదిరిగా ఇండియా కూడా విశ్వవిపణిలో గట్టి పోటీదారుగా అవతరిస్తుంది. ఆ దిశగా దేశానికి నవకల్పనల భారతంగా పేరు తేవడానికి వచ్చే దశాబ్దకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టెక్స్‌టైల్స్, అపెరాల్‌ రంగంలో మంచి పేరున్న ఇండియా- నైకి, గూచి, ఎల్‌వీఎంహెచ్, జారా వంటి అంతర్జాతీయ బ్రాండ్లను సులభంగా ఆకర్షించగలదు. గట్టిగా ప్రయత్నిస్తే- వస్త్రతయారీ రంగానికి ప్రపంచ కేంద్రంగానూ అవతరించగలదు.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.