IND vs SA: ఇదీ మనదే

Eenadu icon
By Sports News Desk Updated : 20 Dec 2025 04:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

టెస్టుల్లో సఫారీ జట్టుకు తలవంచిన టీమ్‌ఇండియా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం తగ్గేదే లేదన్నట్లు రెచ్చిపోయింది. సీనియర్ల మెరుపులతో వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్‌.. కుర్రాళ్లు అదరగొట్టడంతో టీ20 సిరీస్‌లో పైచేయి సాధించింది. 2-1 ఆధిక్యంతో చివరి టీ20ని మొదలుపెట్టిన భారత్‌.. బ్యాటుతో రెచ్చిపోయి విజయానికి బలమైన పునాది వేసుకుంది. ఇన్నింగ్స్‌లో సగం వరకు దక్షిణాఫ్రికా కూడా దీటుగా బదులిచ్చినా, ఆ తర్వాత బౌలర్లు పుంజుకోవడంతో విజయం టీమ్‌ఇండియా సొంతమైంది. సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకున్న భారత్‌.. మొత్తంగా ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించింది.

సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరి టీ20లో భారత్‌ అదరగొట్టింది. శుక్రవారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాను 30 పరుగుల తేడాతో ఓడించింది. మొదట తిలక్‌ వర్మ (73; 42 బంతుల్లో 10×4, 1×6), హార్దిక్‌ పాండ్య (63; 25 బంతుల్లో 5×4, 5×6) చెలరేగిపోవడంతో భారత్‌ 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సంజు శాంసన్‌ (37; 22 బంతుల్లో 4×4, 2×6), అభిషేక్‌ శర్మ (34; 21 బంతుల్లో 6×4, 1×6) ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికాకు క్వింటన్‌ డికాక్‌ (65; 35 బంతుల్లో 9×4, 3×6) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. బ్రెవిస్‌ (31; 17 బంతుల్లో 3×4, 2×6) మినహా బ్యాటర్లు తేలిపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. వరుణ్‌ చక్రవర్తి (4/53) భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ కీలక వికెట్లు పడగొట్టాడు. పరుగుల వరద పారిన మ్యాచ్‌లో బుమ్రా 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీయడం విశేషం. సిరీస్‌లో రెండో టీ20ని దక్షిణాఫ్రికా చేజిక్కించుకోగా.. పొగ మంచు కారణంగా నాలుగో టీ20 రద్దయింది. మిగతా మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గింది. హార్దిక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, వరుణ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యారు. ఈ పర్యటన ఆరంభంలో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేయగా.. వన్డేల్లో భారత్‌ 2-1తో గెలిచింది.

ఆ ఇద్దరూ భయపెట్టినా..

ఇన్నింగ్స్‌ సగం వరకు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ సాగిన తీరు చూస్తే.. 232 పరుగుల లక్ష్యం కూడా సురక్షితం కాదనే అనిపించింది. మరో ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (13) పేలవ ఫామ్‌ను కొనసాగించినప్పటికీ.. డికాక్‌ చెలరేగిపోవడంతో ఛేదనలో దక్షిణాఫ్రికా దూసుకెళ్లింది. అర్ష్‌దీప్‌ వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన అతను.. మళ్లీ అతను బౌలింగ్‌కు తిరిగొచ్చాక ఒక సిక్సర్, మూడు ఫోర్లు బాదేశాడు. హెండ్రిక్స్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బ్రెవిస్‌.. షాట్లు కొట్టడంలో డికాక్‌తో పోటీ పడ్డాడు. వీరి ధాటికి 9, 10 ఓవర్లలో వరుణ్, హార్దిక్‌ వరుసగా 23, 19 పరుగులు సమర్పించుకున్నారు. 10 ఓవర్లకు 118/1తో దక్షిణాఫ్రికా విజయానికి బలమైన పునాది వేసుకుంది. అయితే తర్వాతి ఓవర్లో బుమ్రా.. డికాక్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తర్వాతి ఓవర్లోనే బ్రెవిస్‌ కూడా ఔటైపోయాడు. వరుణ్‌.. వరుస బంతుల్లో మార్‌క్రమ్, ఫెరీరాలను ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖరారైపోయింది. లిండే (16), యాన్సెన్‌ (14), బోష్‌ (17)ల పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది.

ఇటు తిలక్‌.. అటు హార్దిక్‌ 

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఆరంభం నుంచి చివరి వరకు చాలా దూకుడుగా ఆడింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (5) మినహా బ్యాటర్లందరూ చెలరేగిపోయారు. వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడడంతో సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్‌.. తనను పక్కన పెట్టడం ఎంత తప్పో రుజువు చేశాడు. ఓవైపు అతను, ఇంకోవైపు అభిషేక్‌ శర్మ పోటీ పడి భారీ షాట్లు ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరి ధాటికి యాన్సెన్‌ 2 ఓవర్లలోనే 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఆరో ఓవర్లోనే స్కోరు 60 దాటిపోయింది. అయితే ప్రమాదకర అభిషేక్‌ను బోష్‌ వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. అయినా స్కోరు వేగం ఏమీ తగ్గలేదు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న తిలక్‌.. వచ్చీ రాగానే బౌండరీల మోత మోగించాడు. శాంసన్‌ కూడా దూకుడు కొనసాగించడంతో భారత్‌ 9 ఓవర్లకు 97/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే స్పిన్నర్‌ లిండే బౌలింగ్‌లో సంజు బౌల్డవడం, సూర్య ఎక్కువసేపు క్రీజులో నిలవకపోవడంతో భారత్‌ 12.1 ఓవర్లకు 115/3తో ఇబ్బందుల్లో పడింది. భారత్‌ను మరింత ఒత్తిడిలో నెడుదామని చూసిన దక్షిణాఫ్రికాకు.. హార్దిక్‌ షాకిచ్చాడు. సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అతను.. పిడుగల్లాంటి షాట్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు తిలక్‌ కూడా తగ్గలేదు. లిండే వేసిన 14వ ఓవర్లో తిలక్‌ ఓ సిక్స్‌ కొట్టగా.. హార్దిక్‌ వరుసగా 4, 6, 6, 4 బాదేశాడు. ఈ ఓవర్లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లలో వీరి విధ్వంసం కొనసాగడంతో స్కోరు 19 బంతులుండగానే భారత్‌ 200కు చేరుకుంది. ఆఖరి 3 ఓవర్లలో పరుగులు తగ్గాయి. లేదంటే స్కోరు 250కి చేరువయ్యేదే.

అతను ఆడలేదు.. ఇతను ఆడినా!

ఫామ్‌లో లేని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్, వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నుంచి చివరి టీ20లోనూ మెరుపులు చూడలేకపోయారు అభిమానులు. గత మ్యాచ్‌ ముంగిట ప్రాక్టీస్‌లో బొటనవేలికి గాయం కావడంతో శుభ్‌మన్‌ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. జట్టుతో పాటు అహ్మదాబాద్‌కు వచ్చినప్పటికీ అతను బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో ఆడిన సంజు శాంసన్‌ (22 బంతుల్లో 37) రాణించాడు. ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ జట్టు పటిష్ఠ స్థితిలో ఉండగా క్రీజులోకి వచ్చినప్పటికీ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. 5 పరుగులే చేసిన అతను.. ఒక పేలవ షాట్‌తో లాంగాన్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఒకటి అంపైర్‌కు.. ఇంకోటి కెమెరామన్‌కు

చివరి టీ20లో భారత ఆటగాళ్ల దూకుడు అంపైర్, కెమెరామన్‌లకు ముప్పు తెచ్చిపెట్టింది. 9వ ఓవర్లో సంజు శాంసన్‌ బలంగా కొట్టిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌ను బౌలర్‌ డొనోవన్‌ ఫెరీరా ఆపే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడికి చేతిని తాకి, ఆ తర్వాత ఫీల్డ్‌ అంపైర్‌ రోహన్‌ పండిట్‌ మోకాలికి బలంగా తగిలింది. నొప్పితో విలవిలలాడిన అంపైర్‌ కాసేపు కింద పడుకుండిపోయాడు. చికిత్స అనంతరం కుదురుకుని విధులు కొనసాగించాడు. ఆ తర్వాత బోష్‌ వేసిన 13వ ఓవర్లో హార్దిక్‌ కొట్టిన సిక్సర్‌కు బంతి బౌండరీ అవతల విధుల్లో ఉన్న కెమెరామన్‌కు తాకింది. నొప్పి తగ్గడానికి అతను ఐస్‌ గడ్డలు వాడాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌:సంజు (బి) లిండే 37; అభిషేక్‌ (సి) డికాక్‌ (బి) బోష్‌ 34; తిలక్‌ రనౌట్‌ 73; సూర్యకుమార్‌ (సి) మిల్లర్‌ (బి) బోష్‌ 5; హార్దిక్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) బార్ట్‌మన్‌ 63; దూబె నాటౌట్‌ 10; జితేశ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం:(20 ఓవర్లలో 5 వికెట్లకు) 231; వికెట్ల పతనం: 1-63, 2-97, 3-115, 4-220, 5-227; బౌలింగ్‌: ఎంగిడి 4-0-29-0; యాన్సెన్‌ 4-0-50-0; బార్ట్‌మన్‌ 3-0-39-1; కార్బిన్‌ బోష్‌ 3-0-44-2; డొనోవన్‌ ఫెరీరా 2-0-20-0; జార్జ్‌ లిండే 4-0-46-1;

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌:డికాక్‌ (సి) అండ్‌ (బి) బుమ్రా 65; రీజా హెండ్రిక్స్‌ (సి) దూబె (బి) వరుణ్‌ 13; బ్రెవిస్‌ (సి) సుందర్‌ (బి) హార్దిక్‌ 31; మిల్లర్‌ (సి) శాంసన్‌ (బి) అర్ష్‌దీప్‌ 18; మార్‌క్రమ్‌ ఎల్బీ (బి) వరుణ్‌ 6; ఫెరీరా (బి) వరుణ్‌ 0; లిండే (బి) వరుణ్‌ 16; యాన్సెన్‌ (సి) శాంసన్‌ (బి) బుమ్రా 14; బోష్‌ నాటౌట్‌ 17; ఎంగిడి నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201; వికెట్ల పతనం: 1-69, 2-120, 3-122, 4-135, 5-135, 6-154, 7-163, 8-177;

బౌలింగ్‌:అర్ష్‌దీప్‌ 4-0-47-1; సుందర్‌ 4-0-30-0; బుమ్రా 4-0-17-2; వరుణ్‌ చక్రవర్తి 4-0-53-4; హార్దిక్‌ 3-0-41-1; అభిషేక్‌ 1-0-13-0

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 04:08 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.