సంప్రదాయ సాహితీ జ్ఞానపీఠం

- A
- A+
- A++

నవయుగ కవి చక్రవర్తి జాషువా, భావ కవితా పట్టాభిషిక్తుడు కృష్ణశాస్త్రి, సాంప్రదాయిక కవిశేఖరుడు, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, అభ్యుదయ యుగ మహాకవి శ్రీశ్రీ వంటివారి విశిష్ఠ గ్రంథాలతో, సాహిత్య వాదవివాద చర్చలతో తెలుగు సాహిత్యం చారిత్రక వైభవాన్ని సంతరించుకుంది. ఆ వైభవ కాలంలో విశ్వనాథ సత్యనారాయణ బహుముఖీన రచనలతో విశ్వరూపం చూపించారు. రేపు విశ్వనాథ 50వ వర్ధంతిసందర్భంగా...
విశ్వనాథ అన్నిరకాల తెలుగు సాహితీ ప్రక్రియల్లోనూ అడుగు పెట్టారు. కాలంతో సాగుతూ, కాలం వ్యతిరేకించిన పాత ఆలోచనల, సిద్ధాంతాల ఆయుధాలతో యుద్ధం చేశారు. విశ్వనాథ సంప్రదాయవాద కవి. కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావాల నుంచి బయట పడేందుకు దశాబ్దకాలం పట్టిందని శ్రీశ్రీయే రాసుకున్నారు. అంతటి కవి విశ్వనాథ. మన భాష, శిల్పం, నృత్యం, కళారూపాలు ఎంత ప్రాచీనమైనవో, ఎంతటి ఔన్నత్యాన్ని సంతరించుకుని ఉండేవో అనుభూతి చెందింపజేస్తూ ఆయన రాసిన పద్యరస గుళికలు ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషం ఖండకావ్యాల ద్వారా మనల్ని భావోద్రేకుల్ని చేస్తాయి. కళ్లని తడిచేస్తాయి, గుండెను పిండేస్తాయి.
మాటల్లో చమత్కారం
ఎంతో విస్తృతి, ఎన్నో వైవిధ్య పాత్రలు, ప్రాచీన కాల సామాజిక జీవన చిత్రణ వంటివి నిగూఢంగా ఇమిడిన పెద్ద నవల ‘వేయిపడగలు’. ఈ రచనను విశ్వనాథ కేవలం 29-30 రోజుల్లోనే 999 అరటావుల పరిధిలో మౌఖికంగా చెబుతూ రాయించడం ఒక రికార్డు. నవలగా అది గొప్ప రాణింపు పొందింది. ఆయన నారికేళపాక రచనలూ ద్రాక్షాపాక రచనలూ చేశారు. ఓసారి ఆయనను చూడటానికి వచ్చిన వ్యక్తితో ‘నేనిప్పుడు మాట్లాడలేను, బద్ధకంగా ఉన్నాను. కాదు ఛందోబద్ధకంగా ఉన్నా’నన్నారట! తన భార్య వరలక్ష్మి మరణిస్తే బాధాతప్త హృదయంతో ‘వరలక్ష్మి త్రిశతి’ పేరిట 300 పద్యాల కావ్యం రాశారు విశ్వనాథ. రామాయణ కల్పవృక్షం కంటే ఈ త్రిశతే నాకెక్కువ ఇష్టం అన్నారు ఆరుద్ర. వాల్మీకి రామాయణంలో దూరిపోయి, రామాయణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మూడు దశాబ్దాలపాటు తపస్సు చేసినట్లు శ్రమించి ‘శ్రీమద్రామాయణ కల్పవృక్ష’ మహాకావ్యాన్ని తెలుగు పాఠకులకు అందించారు విశ్వనాథ. తీక్షణ కవిత్వ దృష్టితో రసధ్వని ప్రాధాన్యాలతో సంప్రదాయక కావ్యాల్లో ఒక కోహినూర్ వజ్రంగా దాన్ని మలచారు. కొన్ని సభావేదికలపై ఆయన కల్పవృక్ష పఠన చేయబోగా రసజ్ఞులు కొందరు ‘కిన్నెరసాని పాటలు’ పాడమని కోరి, వినిపించుకునేవారట. పద్యపఠనంలో, పాటలు పాడటంలో, ఉపన్యసించడంలో విశ్వనాథ భావోద్రేకాలు, హావభావాలు చూసిన వారికి ఓ ముచ్చట! ఆయన కళాత్మక కవితాత్మక సృజనలు మరెంతో అబ్బుర పరుస్తాయి.
విశ్వనాథ సత్యనారాయణ కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో 1895 సెప్టెంబరు 10వ తేదీన పార్వతీదేవి, శోభనాద్రి దంపతులకు జన్మించారు. కవిత్వరంగ గురువు చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రి. బందరు ఆంధ్ర జాతీయ కళాశాల, హిందూ కళాశాల, విజయవాడ ఎస్.ఆర్.ఆర్. సి.వి.ఆర్ కళాశాలల్లో ఉద్యోగం చేశారు. కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ వంటి సుప్రసిద్ధులు ఆయన శిష్యులు.
అపురూప రచనా శిల్పాలు
విశ్వనాథ మరణానంతరం కూడా కొందరు పండిత రసజ్ఞుల మధ్య కల్పవృక్ష పఠనాలు, ప్రశంసలూ, విమర్శలూ కొనసాగడం విశేషం. భారతి, ఆంధ్రపత్రికలలో విశ్వనాథ కల్పవృక్షంపై వచ్చిన విమర్శలు సంచలనాలయ్యాయి. విశ్వనాథ నవలలు అనగానే చెలియలికట్ట, ఏకవీర, స్వర్గానికి నిచ్చెనలు వంటివీ, పాటలు అనగానే కిన్నెరసాని పాటలు, గిరికుమారుని ప్రేమగీతాలు, నాటకాలు అనగానే నర్తనశాల వంటివి స్మరణకు వస్తాయి. శతకాలు అనగానే మాస్వామి వంటివి, వీరరస కావ్యాలంటే ‘ఝాన్సీరాణి’ వంటివి, లోతైన విమర్శలంటే ‘నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి’, ‘అల్లసానివారి అల్లిక జిగిబిగి’ వంటివి మదిలో మెదులుతాయి. తెలుగు వారికి తొలుత జ్ఞానపీఠ పురస్కారాన్ని తెచ్చిన కవిసామ్రాట్ విశ్వనాథ. రాష్ట్ర శాసనమండలి సభ్యులుగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన రచించిన ఏకవీరను అంబటిపూడి హనుమయ్య హిందీలోకి, పుట్టపర్తి మలయాళంలోకి అనువదించారు. వేయిపడగలను ‘సహస్రఫణ్’ పేరుతో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు హిందీలోకి తర్జుమా చేశారు. ఇంకా మరికొన్ని అనువాదాలు కూడా వచ్చాయి. విశ్వనాథ సాహిత్య అకాడమీ సన్మానాలు పొందారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఆయనకు గుడివాడలో గజారోహణం, కలకత్తాలో పుష్పకిరీట సన్మానాలు జరిగాయి. ఆ దిగ్గజ కవి 1976 అక్టోబరు 18న కీర్తిశేషులయ్యారు. తెలుగువారికి భాషా సాంస్కృతిక ప్రబోధాలు చేసి, రససిద్ధితో కవిత్వం రాసి, ఒక కాలంపై తనదైన రీతిలో ముద్ర వేసిన మహోన్నత సాహిత్య శిఖరం విశ్వనాథ. ఆయన సృజనలు అపురూప రచనా శిల్పాలు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.