అందంగా మెరిసేలా..!

పండగైనా, ప్రత్యేక సందర్భమైనా అమ్మాయిల మనసు అందం మీదకే మళ్లుతుంది. రోజూ కనిపించే కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటారు. అందుకే పార్లర్లు, స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో వందలు, వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే అందంగా మెరిసిపోవచ్చు అంటున్నారు నిపుణులు.

Eenadu icon
By Vasundhara Team Published : 17 Oct 2026 18:12 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

పండగైనా, ప్రత్యేక సందర్భమైనా అమ్మాయిల మనసు అందం మీదకే మళ్లుతుంది. రోజూ కనిపించే కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటారు. అందుకే పార్లర్లు, స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో వందలు, వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే అందంగా మెరిసిపోవచ్చు అంటున్నారు నిపుణులు.

అరటిపండు-పాలతో..

చాలామంది ఇంట్లో బాగా పండిన అరటిపండ్లు తినడం ఇష్టం లేక పడేస్తుంటారు. కానీ అలా బాగా మగ్గిన అరటిపండు అందాన్ని ఇనుమడింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తుందట. ఈ క్రమంలో ఒక బౌల్‌లో కొద్దిగా అరటిపండును గుజ్జులా చేసి అందులో కొన్ని పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించి ఒక పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆపై ఈ ప్యాక్‌ ఆరిపోయేంత వరకు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. తద్వారా చర్మం పొడిబారే సమస్య నుంచి బయటపడచ్చు అంటున్నారు నిపుణులు.

కీరాతో కళగా!

ఏ కాలమైనా మనల్ని వేధించే సమస్య మొటిమలు, మచ్చలు. వీటివల్ల ఎంత ప్రకాశవంతంగా ఉన్న ముఖమైనా అందవిహీనంగా కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు కీరాదోసను ప్రయత్నించి చూడండి అంటున్నారు నిపుణులు. ఇందుకోసం కీరాను చిన్న చిన్న సన్నటి స్లైసుల్లా కట్‌ చేసి ఓ గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టేయండి. ఆ తర్వాత వాటిని ముఖంపై పరచుకొని, కళ్లపై పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు సేదదీరండి. ఇప్పుడు స్లైసులు తొలగించి చల్లటి నీటితో ముఖం కడిగేసుకుంటే అలసట మాయమై చర్మం తిరిగి ప్రకాశవంతంగా మారుతుందని చెబుతున్నారు.

జుట్టు పైనా శ్రద్ధ పెట్టాల్సిందే!

కొంతమందికి జుట్టు పొడిబారిపోయి గడ్డిలా కనిపిస్తుంటుంది. దాంతో అందం దెబ్బతింటుంది. అయితే ఇందుకోసం తేనెతో తయారుచేసిన ఈ హెయిర్‌ మాస్క్‌ చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అరకప్పు చిక్కటి పాలు తీసుకొని అందులో రెండు టీస్పూన్ల తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల దాకా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. పాలు, తేనె జుట్టు తేమను కోల్పోకుండా కాపాడతాయి అంటున్నారు నిపుణులు.

అయితే ఈ చిట్కాలు సహజసిద్ధమైనవే అయినప్పటికీ.. చర్మతత్వానికి సరిపడతాయో లేదో తెలుసుకోవడానికి ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :