సరదాగా మొదలుపెడితే.. ‘కోట్ల’ వ్యాపారమైంది!

చాలామంది టైంపాస్‌ కోసం తమ అభిరుచులపై దృష్టి పెడుతుంటారు. కానీ వీటినే ఆదాయ మార్గాలుగా మలచుకొని వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు కొందరు జెన్‌జీ అమ్మాయిలు. బెంగళూరుకు చెందిన మేఘనా జైన్‌ ఇదే కోవకు చెందుతుంది.

Eenadu icon
By Vasundhara Team Published : 17 Oct 2026 20:54 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

(Photos: LinkedIn)

చాలామంది టైంపాస్‌ కోసం తమ అభిరుచులపై దృష్టి పెడుతుంటారు. కానీ వీటినే ఆదాయ మార్గాలుగా మలచుకొని వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు కొందరు జెన్‌జీ అమ్మాయిలు. బెంగళూరుకు చెందిన మేఘనా జైన్‌ ఇదే కోవకు చెందుతుంది. చిన్న వయసు నుంచే బేకింగ్‌పై మక్కువ చూపిన ఆమె.. సరదాగా కప్‌కేక్స్‌ తయారుచేసి తన తోటి విద్యార్థులకు రుచి చూపించేది. వాటికి మంచి ఆదరణ లభించడంతో ఒకానొక సమయంలో తన అభిరుచినే ఆదాయ మార్గంగా మలచుకోవాలనుకుంది. ఈ పట్టుదలే ఇప్పుడు ఆమెను వ్యాపారవేత్తను చేసింది. ఏడాది తిరిగేసరికి కోట్లు గడిస్తోన్న మేఘన బిజినెస్ జర్నీ.. మనమూ తెలుసుకుందాం రండి..

ఆ ఆర్డర్‌ మలుపు తిప్పింది!

పదకొండేళ్ల వయసులో ఓ సమ్మర్‌ క్యాంప్‌కి హాజరైంది మేఘన. అప్పటికే బేకింగ్‌ పట్ల మక్కువ చూపిన ఆమెకు దీని ద్వారా బేకింగ్‌లో మరిన్ని నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ క్రమంలోనే ఎగ్‌లెస్‌ కప్‌కేక్స్‌ తయారుచేయడం ప్రారంభించింది.

‘నా 15 ఏళ్ల వయసులో మొదటిసారి కేక్‌ తయారుచేశా. బేకింగ్‌లో ప్రయోగాలు చేయడం, వాటిని ఇంట్లో కుటుంబ సభ్యులకు, కాలేజీలో ఫ్రెండ్స్‌కి రుచి చూపించడం భలే సరదాగా అనిపించేది. బీకాం చదువుతున్నప్పుడు ఇంట్లో తయారుచేసిన కప్‌కేక్స్‌ని కాలేజీకి తీసుకెళ్లేదాన్ని. బ్రేక్‌ సమయాల్లో వాటిని క్రీమ్‌తో అలంకరించి స్నేహితురాళ్లకు అందించేదాన్ని. ఇలా నా అభిరుచిని చూసి కొందరు ‘కాలేజీలో ఇదేం పని?’ అంటూ విమర్శిస్తే.. కొంతమంది టీచర్లు, విద్యార్థులు మాత్రం నన్ను ప్రోత్సహించేవారు. ఈ క్రమంలో కాలేజీ క్యాంటీన్లో నేను తయారుచేసిన కప్‌కేక్స్‌తో ఓ చిన్న సేల్స్‌ కార్నర్‌ ఏర్పాటుచేయించారు. ఇలా నా అభిరుచికి వస్తున్న ఆదరణ చూశాక నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఓసారి 90 కప్‌కేక్స్‌ కావాలంటూ వాట్సప్‌లో ఆర్డర్‌ అందుకున్నా. వాటిని ఒక రోజులోనే తయారుచేసి ఇచ్చా. కేక్‌ బేకింగ్‌ వ్యాపారం ప్రారంభించాలని ఆ క్షణమే అనుకున్నా.. ఈ క్రమంలోనే డిగ్రీ పూర్తయ్యాక రెండేళ్ల పాటు పలు బేకింగ్‌ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ వ్యాపార నైపుణ్యాలు పెంచుకున్నా. ఆపై 2018లో ‘డ్రీమ్‌ ఎ డజన్‌’ పేరుతో వ్యాపారం ప్రారంభించా..’ అంటోందీ యువ ఆంత్రప్రెన్యూర్.

వాళ్ల అభిమానం మరవలేను!

తొలుత వాట్సప్ వేదికగా ప్రారంభించిన తన వ్యాపారాన్ని తక్కువ సమయంలోనే వెబ్‌సైట్‌కూ విస్తరించింది మేఘన. అలాగే కస్టమర్ల అవసరాల్ని బట్టి తాను పెట్టుకున్న నియమ నిబంధనల్లో పలు మార్పులు చేర్పులు చేసినట్లు చెబుతోంది.

‘వ్యాపారం ప్రారంభించిన మొదట్లో ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ చేసే పద్ధతి నేను పెట్టుకోలేదు. అయితే ఓరోజు వాట్సప్‌లో ఒక మెసేజ్‌ చూశా. ‘ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ చేసే సదుపాయం మీ వద్ద లేదని నాకు తెలుసు. కానీ అర్జెంట్‌గా నాకో కేక్‌ కావాలి.. దానిపై బూడిద రంగు రిబ్బన్‌ ఉండాలి..’ అంటూ కేక్‌కు సంబంధించిన రిఫరెన్స్‌ ఫొటోను పంపించారు. అది చూడగానే క్యాన్సర్‌ నుంచి కోలుకున్న వారి కోసమే ఇలా ఆర్డర్‌ చేశారనిపించింది. వెంటనే చేసి పంపించా. దాంతో ఆయన సంతోషించారు. తన సోదరి క్యాన్సర్‌ నుంచి కోలుకున్న సందర్భంగా చేసుకొనే వేడుక కోసం దీన్ని తయారుచేయించినట్లు ఆయన చెప్పడం, ధన్యవాదాలు తెలపడంతో నా మనసు సంతోషంతో నిండిపోయింది.

ఇదే కాదు.. కొవిడ్‌ సమయంలో మరో ఆర్డర్‌ వచ్చింది. 85 ఏళ్ల ఓ అంకుల్‌ తమ పెళ్లి రోజు సందర్భంగా తన భార్య కోసం హృదయాకృతిలో ఉన్న ప్రత్యేక కేక్‌ కావాలని అడిగారు. రెండు గంటల్లో దాన్ని తయారుచేసి పంపించాం. అంకుల్‌, ఆంటీ హ్యాపీగా పెళ్లి రోజు జరుపుకొని ఆ ఫొటోలు నాకు వాట్సప్‌ చేసి నన్ను ఆశీర్వదించారు. ఇలా కేక్స్‌ తయారీ నన్నో వ్యాపారవేత్తగా నిలబెట్టడమే కాదు.. ఎంతోమంది అభిమానాన్నీ తెచ్చిపెట్టింది..’ అంటోంది మేఘన.

అదే మా ప్రత్యేకత!

ప్రస్తుతం తన బ్రాండ్ పేరుతో కప్‌కేక్స్‌, కేక్స్‌, బ్రౌనీస్‌, కుకీస్‌, మిల్లెట్‌ కుకీస్‌.. వంటివెన్నో తయారుచేస్తోంది మేఘన.

‘మా వద్ద తయారయ్యే బేకింగ్‌ ఉత్పత్తుల్లో కోడిగుడ్లు, ప్రిజర్వేటివ్స్‌ అసలే వాడం. ఇదే మా ప్రత్యేకత. అలాగే నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత విషయాల్లో అస్సలు రాజీపడం. ప్రస్తుతం మా వద్ద వివిధ రకాల కేక్స్ విభిన్న ఫ్లేవర్లలో లభిస్తున్నాయి. మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన కుకీస్‌నీ తయారుచేసి అందిస్తున్నాం. మేం తయారుచేసే బేసన్‌ లడ్డూ కుకీకి ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో వినియోగదారుల అభిరుచిని బట్టి ఆయా ఉత్పత్తుల్ని కస్టమైజ్‌ చేసి అందిస్తున్నాం. పండగలు, కార్పొరేట్‌ ఈవెంట్ల కోసం గిఫ్ట్‌ హ్యాంపర్స్‌ కూడా మా వద్ద లభిస్తాయి..’ అంటోన్న ఈ యువ వ్యాపారవేత్త.. తన బ్రాండ్‌ ద్వారా ప్రస్తుతం ఏడాది తిరిగే సరికి రూ. కోటికి పైగా ఆర్జిస్తోంది. అలాగే తన సంస్థలో పూర్తిగా మహిళల్నే నియమించుకుంటూ, వారికి బేకింగ్‌ నైపుణ్యాలు నేర్పిస్తూ.. మహిళా సాధికారతకు కృషి చేస్తోంది. అన్నట్లు మేఘన మంచి వక్త కూడా. ఆయా వేదికలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :