‘పెద్దయ్యాక ఏమవుతావ్‌?’

Eenadu icon
By Editorial Team Published : 17 Oct 2026 01:11 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

పెద్దయ్యాక ఏమవుతావని చిన్నప్పుడు మాస్టారు అడిగితే ఠక్కున వచ్చే సమాధానాలు- ‘కలెక్టర్‌.. పోలీస్‌.. టీచర్‌.. డాక్టర్‌..’ అప్పట్లో ఒక్కొక్కరూ అలా సగర్వంగా చెప్పేవారు.  ఆ వయసులో ఎవరి కల వారిది. ఎవరి లక్ష్యం వారిది. ఆ కలల్లో సమాజానికి ఏదో చేయాలనే తపన కనిపించేది. 

ఆ మధ్య అమెరికా, బ్రిటన్, చైనాలో 8-12 ఏళ్ల వయసు పిల్లలను లెగో, హ్యారీస్‌ పోల్‌ సంస్థలు ఈ విషయంపై ప్రశ్నించాయి. అందులో 29 శాతం మంది యూట్యూబర్, వ్లాగర్, ఇన్‌ఫ్లుయెన్సర్‌లం అవుతామని పేర్కొనడం గమనార్హం.

కాలం మారింది. పిల్లల చేతిలో పుస్తకంతో పాటు సెల్‌ఫోన్‌ వచ్చింది. ఆటల స్థానాన్ని చాలావరకు సోషల్‌ మీడియా ఆక్రమించింది. దీంతో ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌’ పేరూ డబ్బూ సంపాదించి పెట్టే కెరీర్‌ ఆప్షన్‌గా మారింది. ఇందులో తప్పేమీ లేదు. కొత్త ప్రపంచంలో కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. సద్వినియోగం చేసుకుంటే ప్రతిభను చాటడానికి సామాజిక మాధ్యమాలూ గొప్ప వేదికలే. విద్య, విజ్ఞానం, కళలు, సాంకేతికత, వ్యవసాయం.. ఇలా ఎన్నో రంగాల్లో మంచి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఇన్‌ఫ్లుయెన్సర్లు అవసరమే. ఒక మంచి ఆలోచనను కోట్లాది మందికి చేరవేయగల శక్తి వారి చేతుల్లో ఉంది.

అయితే సమస్య ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌’ కావాలనుకోవడంలో లేదు. ఎందుకు ఇన్‌ఫ్లుయెన్సర్‌ కావాలనుకుంటున్నాం? అన్నదే అసలు ప్రశ్న. ఫాలోవర్లు ఎంతమంది? వీడియోకు ఎన్ని వ్యూస్‌ వచ్చాయి? ఎన్ని లైకులు వచ్చాయి? అనే లెక్కలే విజయానికి కొలమానాలుగా మారితే.. లక్ష్యం ఎక్కడో ఒకచోట దారి తప్పిపోతుంది. గుర్తింపు కోసం చేసే ప్రయత్నం క్రమంగా గుర్తింపు కోసమే జీవించే పరిస్థితికి దారితీయకూడదు.

ఒకప్పుడు పిల్లలు ‘డాక్టరవుతా’ అనగానే ‘ఎందుకు?’ అని అడిగేవాళ్లం. ‘ప్రజలకు సేవ చేస్తా’ అని చెప్పేవారు. ‘కలెక్టర్‌ అయ్యి జిల్లాను అభివృద్ధి చేస్తా’ అనేవారు. ‘టీచరై పల్లెటూరి పిల్లలకు పాఠాలు చెబుతా’ మనేవారు. ఇప్పుడు ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవుతా’ అన్నప్పుడు కూడా అదే ప్రశ్న అడగాలి. ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఏం చెబుతావు, ఎవరికి ఉపయోగపడతావు? దానివల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది?’ లాంటి ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే ప్రభావం అనేది కేవలం ఫాలోవర్ల సంఖ్య కాదు. మన మాటల వల్ల ఒకరి ఆలోచన మారవచ్చు, వీడియో వల్ల ఒకరు మంచి పని చేయవచ్చు, మన సమాచారం వల్ల ఒకరికి ఉపయోగం కలగవచ్చు... అదే అసలైన ప్రభావం. పిల్లలకు పెద్ద కలలు కనమని చెప్పాలి, ఆ కలల వెనుక ఉన్న బాధ్యతను కూడా నేర్పాలి.

ఇన్‌ఫ్లుయెన్సర్‌గా లక్షల మందిని నవ్వించవచ్చు. ఒక మంచి ఉద్యమానికి ఊపిరి పోయవచ్చు. ఒక గ్రామాన్ని మార్చవచ్చు. ఎందరో విద్యార్థులకు దారి చూపవచ్చు. ఒకప్పుడు ‘కలెక్టర్‌ అవుతా’ అన్న పిల్లాడు సమాజాన్ని మార్చాలని కలగన్నాడు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవుతానంటున్న పిల్లాడు కూడా.. తన ప్రభావంతో సమాజాన్ని మంచివైపు నడిపించాలని కలగనాలి. అప్పుడు ఫాలోవర్ల సంఖ్య కాదు.. సానుకూల రీతిలో ఇన్‌ఫ్లుయెన్స్‌ అయిన మెదళ్ల సంఖ్యే విజయానికి అసలైన కొలమానం అవుతుంది.

స్త్రీలు కూడా ఆర్థిక కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకున్నప్పుడే దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది. కానీ, భారతీయ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) చాలా తక్కువగా ఉంది.  2022లో ఇండియాలో మహిళా ఎల్‌ఎఫ్‌పీఆర్‌ 33.9 శాతం ఉంటే, 2023లో 41.4శాతానికి పెరిగింది. 2025లో 40శాతానికి తగ్గిపోయింది. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో పదిహేనేళ్లు, అంతకు పైబడిన మహిళల ఎల్‌ఎఫ్‌పీఆర్‌ మరింత  తక్కువగా ఉంది. ఆయా  సంవత్సరాల్లో అది ఎంతంటే... (శాతాల్లో) 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.