జపాన్‌... ఆయుధం పడుతోంది!

Eenadu icon
By Editorial Team Published : 17 Oct 2026 01:04 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాలు, ట్రంప్‌ తెంపరితనం, గందరగోళ నిర్ణయాలతో ఎవరినీ నమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ‘అస్త్రసన్యాసం’ చేసిన జపాన్‌ పూర్తిస్థాయిలో ఆయుధాలు పట్టేందుకు సన్నద్ధమవుతోంది. స్వీయరక్షణ బాధ్యతను సొంత భుజాలపైనే వేసుకుంది. దీంతో జపాన్‌ కూడా సైనిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటే భారత్‌కు ఎంతో మేలు! 

రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జపాన్‌ శాంతికాముక దేశంగా మారింది. యుద్ధవిరమణ ఒప్పందంలో భాగంగా ప్రత్యర్థులు నిర్దేశించిన కట్టుబాట్లకు అనుగుణంగా ఈ పద్ధతిని ఎంచుకుంది. పోరును సార్వభౌమ హక్కుగా పరిగణించే ఆలోచనకు శాశ్వతంగా స్వస్తి పలికింది. అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం బలప్రయోగానికి దిగరాదని నిర్ణయించింది. జపాన్‌ ఎన్నటికీ ప్రబల సైనికశక్తిగా మారబోదంటూ 1977లో ఎలుగెత్తి చాటిన సిద్ధాంతానికి అలాగే కట్టుబడి ఉంది. స్వీయరక్షణ కోసం పరిమిత స్థాయిలోనే సైనికశక్తిని కొనసాగించింది. దాంతో జపాన్‌ రక్షణ బాధ్యతను ప్రధానంగా అమెరికాయే చూసుకునేది. ఆ శాంతి సిద్ధాంతాన్ని పూర్తిగా వదిలేసినట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించకున్నా టోక్యో ఆలోచనలు మాత్రం గణనీయంగా మారుతున్నాయి. 

మారిన టోక్యో వ్యూహాలు...

జపాన్‌ గత కొన్నేళ్లుగా గణనీయ స్థాయిలో సైనిక మార్పులను చేపడుతోంది. ఈ ఏడాది తన రక్షణ బడ్జెట్‌ను జీడీపీలో 2 శాతానికి పెంచింది. ఈ వ్యయాన్ని ఒకే ఒక్క శాతంగా నిర్దేశిస్తూ 1976లో విధించిన నిబంధనను తొలగించింది. ప్రతిదాడి సామర్థ్యాలనూ పెంచుకుంటోంది. వెయ్యి కిలోమీటర్ల పరిధి కలిగిన హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ ఆయుధాలు, టైప్‌12 క్రూజ్‌ క్షిపణులను మోహరించింది. అమెరికా నుంచి 400 తోమహాక్‌ క్షిపణులనూ కొనుగోలు చేస్తోంది. సమీకృత తీర రక్షణ వ్యవస్థలను నిర్మిస్తోంది. గగనతల, ఉపరితల, జలాంతర డ్రోన్లను ఇందుకు ఉపయోగిస్తోంది. బ్రిటన్, ఇటలీలతో కలిసి ఆరోతరం స్టెల్త్‌ యుద్ధవిమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఫిలిప్పీన్స్, ఇండోనేసియాతో భద్రతా బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. వాటికి యుద్ధనౌకలను అందిస్తోంది. ఏఐ నియంత్రిత డ్రోన్లపై పెట్టుబడులు పెడుతోంది. తన నౌకాదళంలోని హెలికాప్టర్‌ వాహక నౌకలను పూర్తిస్థాయి విమాన వాహక నౌకలుగా ఆధునికీ కరిస్తోంది. రక్షణ ఎగుమతులపై ఉన్న ఆంక్షల నుంచి సహాయ చర్యలు, రవాణా, నిఘా, హెచ్చరిక, మందుపాతరలను గుర్తించే సాధనాలను జపాన్‌ మినహాయించింది. భారత్‌ సహా 17 దేశాలకు వీటిని విక్రయించడానికి నిర్ణయించింది. ఆయుధ ఎగుమతులకు సంబంధించి జపాన్‌ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే. 

శాంతికాముక ముద్ర నుంచి దూరం జరిగే ప్రక్రియకు మునుపటి షింజౌ అబే ప్రభుత్వంలోనే బీజం పడింది. చైనా సైనికశక్తి నానాటికీ పెరుగుతుండటం, తైవాన్‌ విషయంలో ఆ దేశం తరచూ దౌర్జన్యానికి దిగడం; ఉత్తరకొరియా, రష్యాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాల వంటివి జపాన్‌ మనసు మారడానికి కారణమయ్యాయి. దశాబ్దాలుగా జపాన్‌కు ప్రధాన రక్షకుడిగా అమెరికా ఉన్నా, అగ్రరాజ్యం మద్దతు ఏకపక్షం కాదని ఉక్రెయిన్‌ యుద్ధం చాటుతోంది. ఆయుధ సరఫరా కోసం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అమెరికా స్పందన అరకొరగానే ఉంటోంది. దీనికితోడు అగ్రరాజ్యం మద్దతు ఉన్నంతమాత్రాన పూర్తిస్థాయి రక్షణ ఉన్నట్లు కాదని కూడా స్పష్టమవుతోంది. అమెరికా ఆయుధ ఉత్పత్తికీ పరిమితులున్నాయి. అందుకని ఆ దేశం నుంచి అందే సాయంలోనూ పరిమితులు ఉంటాయని జపాన్‌కు బోధపడింది. ఇరాన్‌ యుద్ధంలో అమెరికా బలహీనతలూ బయటపడ్డాయి. ట్రంప్‌ విధానాల్లో నిలకడ లోపించడం, అస్తవ్యస్త నిర్ణయాలు వంటివి టోక్యో మనసు మారడానికి కారణమయ్యాయి. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ యుద్ధాలతో ఆయుధాలకు డిమాండ్‌ పెరిగింది. అదే సమయంలో అమెరికా ఆయుధ ఉత్పత్తి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐరోపా సహా అనేక మిత్ర దేశాలు ప్రధానంగా అగ్రరాజ్యం నుంచే అస్త్రశస్త్రాలను కొనుగోలు చేసేవి. ఇప్పుడు భిన్న దేశాలపైకి వాటి దృష్టి మరలింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యవహారాల్లో వస్తున్న పెనుమార్పుల కారణంగా అనేక దేశాలు తమ సైనికశక్తిని ఆధునికీకరిస్తున్నాయి. ఇలాంటి దేశాలు జపాన్‌ను నమ్మకమైన ఆయుధ సరఫరాదారుగా పరిగణించే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో టోక్యో హైటెక్‌ అస్త్రశస్త్రాల ఉత్పత్తిపై దృష్టి పెడుతోంది. ఆయుధ సంస్థల్లో పునరుజ్జీవనం నింపాలన్న జపాన్‌ నిర్ణయం వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. ఆయుధ ఎగుమతులపై ఆంక్షలు తొలగించడం వల్ల జపాన్‌కు చెందిన మిత్సుబిషి, కవాసాకి వంటి దిగ్గజ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. 

భారత్‌కు మంచి అవకాశం 

భారత్‌తో రక్షణ బంధాన్ని ఏర్పర్చుకోవడానికి జపాన్‌ ఇటీవల కాలంలో ఆసక్తి చూపుతోంది. క్వాడ్‌ కూటమిలో చిగురించిన మైత్రి బలోపేతమవుతోంది. తాజా జపాన్‌ సైనిక పునరుత్థానం భారత్‌కు మంచి అవకాశం. రెండు దేశాల సైన్యాలు ఉమ్మడి విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల ‘వీర్‌ గార్డియన్‌-2026’ కార్యక్రమంలో తేజస్‌ యుద్ధవిమానంలో జపాన్‌ ఎయిర్‌ సెల్ఫ్‌-డిఫెన్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ తహెహిరో మోరిటా గగనవిహారం చేయడం ద్వైపాక్షిక రక్షణ మైత్రి కొత్త పుంతలు తొక్కుతోందన్న సంకేతాలను ఇచ్చినట్లయింది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన తేజస్‌కు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఆ విన్యాసాల కోసం జపాన్‌ తన ప్రధాన యుద్ధవిమానమైన ఎఫ్‌-2ఏను తొలిసారిగా ఇక్కడికి పంపడం ఇండియాకు టోక్యో కల్పిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. సముద్ర భద్రతపైనా భారత్, జపాన్‌లు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత యుద్ధనౌకల కోసం యూనిఫైడ్‌ కాంప్లెక్స్‌ రేడియో యాంటెన్నాలను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకూ ఒప్పందం కుదిరింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సైన్యాలు సరకులు, సేవలను ఇచ్చిపుచ్చుకోవడానికి ఇరుదేశాలు సమ్మతించాయి. ఈ మైత్రిని మరింత బలోపేతం చేసుకుంటూ జపాన్‌తో కలిసి కొత్తతరం ఆయుధాల రూపకల్పనకు కృషిచేయాలి. ఆ దేశం నుంచి అధునాతన పరిజ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ఆయుధ ఉత్పత్తి హబ్‌గా ఎదగాలన్న భారత లక్ష్యానికి ఇది బాటలు పరుస్తుంది. 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.