న్యాయ నిరాకరణే కాదు...

Eenadu icon
By Editorial News Team Published : 17 Oct 2026 01:09 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

నొప్పితో విలవిల్లాడేవారి మాదిరిగానే న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకున్న వారూ వీలైనంత త్వరగా, తక్కువ ఖర్చుతో ఉపశమనం పొందాలని కోరుకుంటారు. న్యాయ వితరణలో జాప్యం జరగడమంటే న్యాయాన్ని నిరాకరించినట్టే కాదు, చట్టబద్ధమైన పాలనను నాశనం చేయడం కూడా అని ఉపరాష్ట్రపతిగా భైరాన్‌సింగ్‌ షెకావత్‌ దాదాపు రెండు దశాబ్దాల కిందటే ఉద్ఘాటించారు. న్యాయం పొందే ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నదిగా, నిదానమైనదిగా, నిరాశాజనకమైనదిగా ఉంటే న్యాయార్థులు అసలు వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోతారు. పౌరులకు త్వరితగతిన న్యాయమందకపోతే, ‘అందరికీ అందుబాటులో న్యాయం’ అన్నది ఒక శుష్క నినాదంగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు హెచ్చరించి పదేళ్లు దాటింది. వేగవంతమైన విచారణ అనేది జీవించే హక్కులో అంతర్భాగమని ‘సుప్రీం’ ఏనాడో స్పష్టీకరించింది. కానీ, ఏళ్ల తరబడిగా మోక్షంకోసం ఎదురుచూస్తున్న కేసులతో, ఆ క్రమంలో సామాన్యులపై పెరుగుతున్న వ్యయభారాలతో ఆ రాజ్యాంగ ప్రమాణం నీరుగారిపోతోంది. ఓపట్టాన తెమలని వ్యాజ్యాలతో- లోగడ న్యాయపాలిక వ్యాఖ్యానించినట్లుగానే, మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్షగా మారిపోతోంది! 

కిందిస్థాయి న్యాయస్థానాల్లోని పెండింగ్‌ కేసుల సంఖ్య 5.15కోట్లకు పైబడింది. హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లోని అపరిష్కృత వ్యాజ్యాలనూ కలిపి లెక్కేస్తే, అది 5.8కోట్లకు మించిపోతుంది. గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న కేసులతో న్యాయస్థానాలపై పనిభారం విపరీతమవుతోంది. ఆ కొండలను కరిగించడానికి, అంతరాలకు అతీతంగా అందరికీ వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా న్యాయసేవలను అందుబాటులోకి తీసుకురావడానికి పాటించాల్సిన పద్ధతులను క్రోడీకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా పందొమ్మిది న్యాయ విశ్వవిద్యాలయాలకు సూచించింది. ఇది ఆహ్వానించదగిన చొరవే అయినప్పటికీ వ్యాజ్యాలు అంతగా పెండింగ్‌లో ఉండిపోవడానికి ప్రధాన కారణమేంటో కేంద్రమే నిరుడు లోక్‌సభలో పేర్కొంది. జనాభాకు సరిపడినంతగా న్యాయమూర్తులు లేకపోవడంతోనే సమస్య జఠిలమవుతోందని స్పష్టంచేసింది. ప్రతి పదిలక్షల మందికి కనీసం 50 మంది జడ్జీలు ఉండాల్సిందేనని 1987లోనే చెప్పిన లా కమిషన్‌- 2000 సంవత్సరానికి ఆ నిష్పత్తిని 107కి పెంచాలని సిఫార్సు చేసింది. కానీ, ఇప్పటికీ దేశీయంగా పదిలక్షల ప్రజానీకానికి 15మంది చొప్పునే న్యాయమూర్తులు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జనవిస్ఫోటానికి తగినంతగా జడ్జీల సంఖ్యను పెంచడంపై, ముఖ్యంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో ఖాళీలను భర్తీచేయడంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తేనే- సత్వర న్యాయంపై ప్రజలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తదు!   

పెండింగ్‌ కేసులు మేటలువేయడానికి కారణమవుతున్న మరొక దురవస్థను పార్లమెంటరీ స్థాయీసంఘం గతంలో నివేదించింది. మన దేశంలో అతిపెద్ద లిటిగెంట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని... అపరిష్కృత వ్యాజ్యాల్లో దాదాపు సగం సర్కార్లకు సంబంధించినవేనని కమిటీ కుండ బద్దలుకొట్టింది. దానివల్ల సామాన్యులకు న్యాయం జరగడంలో మితిమీరిన ఆలస్యం కావడంతోపాటు ఖజానాపైనా అపార భారం పడుతోందని విశ్లేషించింది. ప్రత్యామ్నాయ  పరిష్కార విధానాల్లో ఆ దావాలను కొలిక్కితేవడంపై యంత్రాంగానికి ప్రభుత్వాలు దిశానిర్దేశం చేయాలి. కోర్టులకు వచ్చే కేసులు బాగా తగ్గాలంటే,  సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించినట్లు- స్థానిక సంస్థలు, రెవిన్యూ, పోలీసు విభాగాలు చట్టాలకు కట్టుబడి సమర్థంగా నిష్పాక్షికంగా పనిచేయాలి. ప్రజాప్రయోజనాలకు పట్టంకట్టే స్పష్టమైన శాసనాలనే చట్టసభలు రూపొందించాలి. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ వసతుల పెంపునకు ప్రాధాన్యమివ్వాలి! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.