అసమాన సారథ్యం అమేయ దార్శనికత

Eenadu icon
By Editorial Team Published : 15 Oct 2026 02:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

‘‘వికసిత్‌ భారత్‌ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలోడాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిసందర్భంగా రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ఆయన అందించిన అమూల్య సేవలను స్మరించు కోవడం సముచితం. 1986లో హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో కొత్తగా శాస్త్రవేత్తగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నా వృత్తిపరమైన ప్రయాణమంతటా కలాం నాకు మార్గదర్శిగా నిలిచారు. సమగ్ర గైడెడ్‌ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో, దాని తదుపరి ప్రాజెక్టుల్లో కలాం సారథ్యంలో చిరకాలం పనిచేయడం వల్ల నావిగేషన్, క్షిపణుల రూపకల్పనలో అమూల్య అనుభవం గడించాను.’’

డీఆర్‌డీఎల్‌-డీఆర్‌డీవోలో చేరగానే, అప్పటి డైరెక్టర్‌ డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం దగ్గరికి వెళ్లి విధి నిర్వహణ ప్రారంభించాను. డీఆర్‌డీఎల్‌లో ప్రతిరోజూ ఉదయం జరిగే సమావేశాల్లో మా బృందం సాంకేతిక, నిర్వహణాపరమైన సవాళ్లను చర్చించేది. అప్పుడే ఆయన ఏవియానిక్స్‌ శాస్త్రంపై ఒక పుస్తకాన్ని నాచేతికిచ్చి, చదివి రమ్మన్నారు. ఆ తర్వాత ఆ పుస్తకంపై నా అభిప్రాయాన్ని తెలుసుకుని, నా అవగాహనను అంచనా వేశారు. క్షిపణులకు స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థలను రూపొందించుకోవడం ఎంత ముఖ్యమో వివరించి, నన్ను నావిగేషన్‌ బృందానికి కేటాయించారు. కలాం నిర్ణయం నా జీవన పథాన్ని మార్చేసింది. ఆ ఒక్క భేటీలోనే ఆయన నిరాడంబరతను, శ్రద్ధగా ఆలకించే లక్షణాన్ని, యువ శాస్త్రవేత్తల్లోని ప్రతిభను గుర్తించి మార్గనిర్దేశం చేసే గుణాన్ని ప్రత్యక్షంగా చూశాను.

నావిగేషన్‌ గ్రూప్‌లో కలాం లక్ష్యం ‘హద్దులను ఛేదించి అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం’. అందుకోసం ఆయన ముందుగా యువ శాస్త్రవేత్తలను కలిసి, జరుగుతున్న పనిపై వారి అభిప్రాయాలను తెలుసుకుని, ఆ తర్వాతే వారి విభాగాల అధిపతులతో చర్చించేవారు. చిన్నాపెద్దా హోదాతో సంబంధం లేకుండా అందరి అభిప్రాయాలనూ స్వీకరించేవారు. స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేసే రోజుల్లో, మేము వైబ్రేషన్‌ (ప్రకంపన) సంబంధిత సమస్యలను ఎదుర్కొని ఎన్విరాన్‌మెంటల్‌ టెస్ట్‌ ఫెసిలిటీలో చాలా రాత్రులు గడిపాము. ఆయన అర్ధరాత్రి వేళ సాధారణ దుస్తులలో వచ్చి, మాతోపాటు గంటల తరబడి గడుపుతూ నిరాడంబరతకు, నాయకత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచేవారు. 1988 చివరిలో అగ్ని క్షిపణి అభివృద్ధి సమయంలో తీవ్రమైన సాంకేతిక సమస్యలు ఎదురై, అసలు మొత్తం నావిగేషన్‌ వ్యవస్థనే మార్చాలా అని చర్చలు జరిగేవి. ఆ రోజుల్లో కలాం మాతోనే చాలాసేపు ఉండి, సమస్యలపై నేరుగా చర్చించేవారు. చివరికి నావిగేషన్‌ వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేకుండానే సమస్యను పరిష్కరించడానికి మా బృందానికి సాయపడ్డారు. పని పూర్తయ్యాక వచ్చిన ప్రశంసలు నాలాంటి యువ శాస్త్రవేత్తకు ఎంతో స్థైర్యాన్నీ, ఉత్సాహాన్నీ ఇచ్చాయి.

అనుక్షణం తోడుగా...

శ్రీహరికోటలో 1988లో జరిగిన పృథ్వి ప్రయోగం నాకు మొట్టమొదటి పెద్ద ప్రాజెక్ట్‌. సాంకేతిక సమస్యల వల్ల మా బృందం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఒక రోజు రాత్రి దాదాపు 11 గంటలకు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.జె.సుందరం, డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.కె.సరస్వత్, ఇతరులను కలాం తన గదికి పిలిచారు. సాధారణ అంశాలు, తాత్విక విషయాలు, రామేశ్వరం గురించి, ఆలయంలో పొడవైన ప్రాకారాలలో ఒంటరిగా ఉండే ఒక వ్యక్తి ఫొటో గురించి మాట్లాడారు. ఈ విశాల విశ్వంలో ఆ వ్యక్తి స్థానం, పాత్ర గురించి ఆలోచింపజేశారు. మా మనసుల నుంచి ఒత్తిడి నెమ్మదిగా దూరమైంది. ఆ ప్రశాంత స్థితిలో సమస్య తక్షణమే పరిష్కారమైంది. ఇదే ఆయన పద్ధతి: మానసిక ప్రశాంతతను పునరుద్ధరించడం ద్వారా క్లిష్ట పరిస్థితుల నుంచి సిబ్బందిని ముందుకు నడిపించడం, వైఫల్యానికి ఎప్పుడూ భయపడకపోవడం, నేర్చుకుంటారంటే వైఫల్యాలను కూడా ప్రోత్సహించడం- కలాం విలక్షణ శైలి.

మొదటి అగ్ని ప్రయోగం సమయంలో లాంచ్‌ప్యాడ్‌ దగ్గర బృందాలు 72 గంటలపాటు నిర్విరామంగా పనిచేశాయి; ఆయన అంతసేపూ అక్కడే మాతోపాటే ఉన్నారు. ఆయన నిష్ఠ తిరుగులేనిది. రెండు ప్రయత్నాల తర్వాత క్షిపణి ప్రయోగం విఫలమైనప్పుడు మాత్రమే కలాంలో ఒత్తిడి చూశాను. మూడో ప్రయత్నం విజయవంతమవడంతో ఆయనకు ఎంతో ఉపశమనం లభించింది. చాందీపూర్‌ లాంచ్‌ రేంజ్‌ పూర్తిగా సిద్ధం కాకముందే అక్కడి నుంచి క్షిపణి ప్రయోగాలు మొదలుపెట్టాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇస్రో నిపుణులు, డీఆర్‌డీవో బృందాలతో కలిసి దాన్ని సాకారం చేశారు.

అదే నిజమైన నివాళి...

రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు అయిన తర్వాత కూడా కలాం ప్రతి శుక్రవారం దిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చి రాత్రి 9:30 తర్వాత సమీక్షలు నిర్వహించేవారు. ఆయన స్థాపించిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ)ని అప్పటి భారత రాష్ట్రపతి ప్రారంభించారు. అది స్వదేశీ ఏవియానిక్స్, నావిగేషన్‌ వ్యవస్థల రూపకల్పన కేంద్రమైంది. నేను దానికి డైరెక్టర్‌ అయినప్పుడు, ‘నువ్వు చేసిన పనిని బట్టి ప్రజలు నిన్ను గుర్తుంచుకోవాలి’ అని కలాం సలహా ఇచ్చారు. నేను శాస్త్రీయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, 2015 జులై 6న ఆయనతో చివరిసారి సమావేశమయ్యాను. నాయకత్వం, విధులు, బాధ్యతలపై తన అనుభవాలను, పాఠాలను కలాం నాతో పంచుకున్నారు. ఆ రోజు ఆయన ఆలోచనలలో ప్రధానమైనవి: పునర్వినియోగ క్షిపణి అభివృద్ధి, స్వయంసమృద్ధి కోసం నిరంతర సాధన. ఆ వయసులో కూడా ఆయన చురుగ్గా, ఉత్సాహంగా భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడారు. ఆపైన కొన్ని వారాలకు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన కన్నుమూశారు. 

సాంకేతికతలో భారత్‌ను అగ్రగామిగా నిలపాలని కలాం నిరంతరం తపించారు. హైపర్‌ సోనిక్స్, అధునాతన మెటీరియల్స్‌ తయారీ, విస్తృత స్వయంసమృద్ధి సాధన దిశగా ఈరోజు మనం సాగిస్తున్న ప్రయాణంలో కలాం దారిదీపంగా నిలుస్తున్నారు. రామేశ్వరంలో ఆయనకు డీఆర్‌డీవో నిర్మించిన స్మారక చిహ్నానికి రూపకల్పన చేసే భాగ్యం నాకు లభించింది. అక్కడ కలాం జ్ఞాపకాలను పదిలపరిచారు. అయితే, కలాంకు అతిపెద్ద నివాళి- ఆయన స్వప్నించిన స్వయంసమృద్ధిని, సాంకేతికంగా ఉన్నతమైన భారతదేశాన్ని సాధించడమే. 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.