సిద్ధమవుతున్న డ్రోన్ల దండు!

- A
- A+
- A++

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ సమరాన్ని చూస్తే ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు, క్షిపణుల పాత్ర అవగతమవుతుంది. ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ తనపై పాకిస్థాన్ ప్రయోగించిన చైనా, తుర్కియే డ్రోన్లను చిత్తుచేసి, తన దాడులను అడ్డుకోజూసిన పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ఆ ఉత్సాహంతోనే పోరాట డ్రోన్ల తయారీ, సాంకేతికతల అభివృద్ధి, వినియోగంపై ఇండియా దృష్టి సారిస్తోంది.
సరిహద్దులకు ఆవలి లోతట్టు ప్రాంతాలపై దాడులు చేయగల డ్రోన్ల తయారీకి భారత్ మూడు ప్రాజెక్టులు చేపట్టింది. మొదట రూ.39వేల కోట్లతో నాలుగు స్క్వాడ్రన్ల (సుమారు 60) ఘాతక్ స్టెల్త్ మానవ రహిత డ్రోన్ల తయారీకి రక్షణ సామగ్రి సేకరణ మండలి ఆమోదం తెలిపింది. రెండో ప్రాజెక్టు కింద రూ.30వేల కోట్లతో 87 మీడియం-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్ల కోసం బిడ్లను ఆహ్వానించింది. తాజాగా రూ.20వేల కోట్లతో నిఘా, దాడి డ్రోన్లు, నింగిలో తచ్చాడుతూ శత్రువుపై విరుచుకుపడే లోయిటరింగ్ మ్యూనిషన్స్ సేకరణ ప్రక్రియ చేపట్టింది. దేశీయ డ్రోన్ల తయారీలో సుమారు 600 కంపెనీలు నిమగ్నం కాగా, వాటిలో వంద సంస్థలు పోరాట డ్రోన్ల తయారీపైనే దృష్టిపెట్టాయి. వీటిలో ముఖ్యమైనవి హైదరాబాద్లోనూ ఉన్నాయి.
పాక్కు తోడుగా చైనా, తుర్కియే...
డ్రోన్ దళాల నిర్వహణకు భారత్ అయిదేళ్లలో 5లక్షల మంది సిబ్బందిని సమకూర్చుకోనుంది. సైన్యం ఇప్పటివరకు సుమారు 50వేల మందికి శిక్షణ ఇచ్చింది. వీరిని ‘అష్ని’ పేరిట ప్రత్యేక డ్రోన్ ప్లాటూన్లుగా సమీకరించి, 380 పదాతిదళ బెటాలియన్లలో మోహరించారు. సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ దళాలూ డ్రోన్ ఆపరేటర్లను తయారు చేస్తున్నాయి. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) మధ్యప్రదేశ్లో మొట్టమొదటి డ్రోన్ యుద్ధ పాఠశాలను ప్రారంభించింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) ఒక్కటే హైదరాబాద్, భిలాయ్, బెహ్రోర్ వంటి చోట్ల ప్రత్యేక శిక్షణ పాఠశాలలను స్థాపించి, ఏడు వేలమందికి పైగా సిబ్బందికి డ్రోన్ పైలటింగ్, వైమానిక ప్రతిచర్యల్లో తర్ఫీదు ఇచ్చింది. శత్రు భూభాగంలోకి లోతుగా చొచ్చుకెళ్లి, డ్రోన్లతో లక్ష్యాలను ఛేదించేందుకు సైన్యంలో భైరవ్ ఫోర్స్ వంటి అధునాతన హైబ్రిడ్ యుద్ధ విభాగాలను ఏర్పాటు చేశారు. 2030 నాటికి సైనిక విభాలన్నింటిలోనూ పూర్తిస్థాయిలో డ్రోన్లను వినియోగించాలని భారత్ లక్షిస్తోంది.
ప్రపంచంలో డ్రోన్ల తయారీలో చైనా అగ్రగామిగా ఉంది. నిఘా, ఆత్మాహుతి డ్రోన్లతో పాటు ఏఐ ఆధారిత డ్రోన్ల గుంపు తయారీలో డ్రాగన్ ముందుంది. తక్కువ ఖర్చుతో కచ్చితంగా దాడులు చేయగల డ్రోన్లతో తుర్కియే ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. పాకిస్థాన్ ఏమో ఆ రెండు దేశాల నుంచి భారీగా డ్రోన్లను దిగుమతి చేసుకుంటోంది. ఈ ముప్పును తిప్పికొట్టడానికి ఇండియా వడివడిగా అడుగులు వేస్తోంది. మేక్-ఇన్-ఇండియా, ఐడెక్స్ వంటి పథకాల ద్వారా వందలాది స్టార్టప్లతోపాటు అదానీ, టాటా, ఐడియాఫోర్జ్ వంటి పెద్ద కంపెనీలూ డ్రోన్లను తయారు చేస్తున్నాయి. మరోవైపు, డ్రోన్ల కొనుగోలుకు భారత్ భారీగా నిధులను కేటాయించింది.
శత్రు డ్రోన్ల కమ్యూనికేషన్ వ్యవస్థను జామ్ చేయడానికి (సాఫ్ట్కిల్) లేజర్ ఆయుధాలు; మైక్రోవేవ్ సాంకేతికతతో డ్రోన్లను గాల్లోనే కూల్చేయడానికి(హార్డ్కిల్) అత్యాధునిక రాడార్లు, జామర్లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. 2035 నాటికి దేశవ్యాప్తంగా భూతల, అంతరిక్ష ఆధారిత సమగ్ర యాంటీ-డ్రోన్ రక్షణ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ‘సుదర్శన్ చక్ర’ ప్రాజెక్టు పనిచేస్తోంది. ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ వంటి లేజర్ ఆధారిత డ్రోన్ రక్షణ సాంకేతికతను భారత్తో పంచుకోవడానికి సిద్ధమైంది. అమెరికా సైతం ఇండియాకు డ్రోన్లు, సంబంధిత సాంకేతికతలను అందిస్తోంది. భారత సాయుధ దళాలు ఇజ్రాయెల్కు చెందిన ‘స్మాష్ 2000 ప్లస్’ వంటి అత్యాధునిక రైఫిల్ స్కోప్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. ఇవి వేగంగా వచ్చే చిన్నపాటి శత్రుడ్రోన్లను సైతం కచ్చితంగా గుర్తించి, కూల్చేస్తాయి. ‘అదానీ-ఎల్బిట్’ వంటి సంస్థలు ఇజ్రాయెల్ సాంకేతికతను ఉపయోగించుకుని డ్రోన్లు, యాంటీ-డ్రోన్ పరికరాలను తయారు చేస్తున్నాయి.
సొంత తయారీ...
అమెరికా తన నిఘా, డిజిటల్ రక్షణ సాంకేతికతలను భారత్కు అందిస్తూ సరిహద్దు భద్రతను పటిష్ఠం చేస్తోంది. హిమాలయ సరిహద్దుల్లో చైనా కదలికలను, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లను నిరంతరం గమనించడానికి అమెరికా నుంచి ఎంక్యూ 9బీ ప్రిడేటర్ డ్రోన్లను భారత్ సేకరిస్తోంది. అమెరికా వాయుసేన, భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీవో) కలిసి నింగి నుంచి ప్రయోగించే సరికొత్త డ్రోన్ నమూనాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఉపగ్రహ నిఘా సమాచారాన్ని అమెరికా భారత్తో పంచుకుంటోంది. దీనివల్ల సరిహద్దు దాటి వచ్చే చైనా, పాకిస్థాన్ డ్రోన్లను ముందే గుర్తించి అడ్డుకోవడం సాధ్యమవుతుంది. భారత్ సైతం సొంతంగా డ్రోన్ల తయారీ, మోహరింపు సామర్థ్యాలను పెంచుకుంటోంది.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.