ఎన్టీఏ పనితీరు మారదా?

- A
- A+
- A++
యువభారతం భవిష్యత్తును నిర్ణయించే ముఖ్యమైన పోటీపరీక్షల నిర్వహణలో అవే ఘోరాపరాధాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయంటే ఏంటి అర్థం? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లోని ఎవరో కొందరు వ్యక్తుల అలసత్వ దుష్ఫలితాలు కావు అవి... వంకపెట్టలేని అంకితభావంతో నిర్వర్తించాల్సిన బాధ్యతల పట్ల పట్టింపులేనితనంతో వ్యవస్థ మొత్తంగా దారితప్పిన తీరుకు నిదర్శనాలు! ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశాలకు పోటీపడేవారి సామర్థ్యాలను అంచనా వేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరీక్షలను సమర్థంగా పారదర్శకంగా నిర్వహించడం ఎన్టీఏ కర్తవ్యం. అందులో అది పదేపదే విఫలమవుతూ విద్యార్థుల ఆశలను, వారి తల్లిదండ్రుల కలలను కాలరాస్తుండటమే గర్హనీయం! ‘నీట్’-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్ష రద్దు నేపథ్యంలో రేగిన ఆందోళనలు ఇంకా పచ్చిగా ఉండగానే, యూజీసీ-నెట్కు సంబంధించి ఎన్టీఏ పనితనమూ బయటపడింది. మొన్న జూన్లో జరిగిన యూజీసీ-నెట్ పరీక్షల్లో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లు తప్పులతడకలుగా ఉన్నాయని ఒప్పుకొన్న ఎన్టీఏ- ఆ మూడు ఎగ్జాములను వచ్చే నెలలో తిరిగి పెడతామని తాజాగా ప్రకటించింది. ఇలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం బదులు ముందే సరైన పరిశీలనా యంత్రాంగాన్ని, భద్రతా ఏర్పాట్లను కొలువుతీర్చి ఉంటే- లక్షన్నర మందికిపైగా విద్యార్థులు అవస్థలపాలు కావాల్సి వచ్చేదే కాదు కదా? ఉద్యోగాల బాటలో, పరిశోధనా విద్యలో ముందడుగు వేసే కీలక సందర్భంలో విలువైన సమయాన్ని కోల్పోయే దురవస్థ సైతం ఆయా అభ్యర్థులకు తప్పేది!
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకాలకు, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హత సాధించడానికి ఏటా లక్షల సంఖ్యలో యువత యూజీసీ-నెట్ రాస్తుంటారు. అందులో భాగంగా ఇటీవల ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అప్పుడే ప్రశ్నపత్రాల్లో లోపాలను గమనించి గగ్గోలుపెట్టారు. పేర్లు, పదాలు, అనువాదాల్లో తప్పులు మొదలు పాత పేపర్లనుంచి పలు ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్లుగా పునరావృతం కావడం వరకు ఎన్టీఏ అసమర్థ నిర్వాకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తంజేశారు. ఇంగ్లిష్, కామర్స్ పేపర్లలోని 60శాతానికిపైగా ప్రశ్నలు 2024 డిసెంబరు ఎగ్జాములో వచ్చినవేనన్న విమర్శలు గట్టిగా వినిపించాయి. సోషియాలజీ విషయంలోనైతే చేతిరాత ప్రశ్నలతో కూడిన వంద పేజీల పీడీఎఫ్ ఒకటి ముందే చలామణీలోకి వచ్చిందని, అందులోని 90 ప్రశ్నలు అసలు పరీక్షలో యథాతథంగా దర్శనమిచ్చాయని కథనాలు వెలువడ్డాయి. ఇలాంటివాటిపై ఫిర్యాదులెన్నో వెల్లువెత్తాక 45 రోజులకు తీరిగ్గా స్పందించిన ఎన్టీఏ- ఆ మూడు పరీక్షల రద్దుకు నిశ్చయించింది. ప్రశ్నపత్రాల రూపకల్పనలో అలవిమాలిన నిర్లక్ష్యం, వాటిని గోప్యంగా ఉంచడంలో దారుణ వైఫల్యం, వేగంగా నిర్ణయాలు తీసుకుని విద్యార్థులకు భరోసా కల్పించడంలో లెక్కలేనితనం... ఇవేవీ క్షమార్హం కావు!
యూజీసీ-నెట్ ప్రహసనం దరిమిలా అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి నివేదిక సమర్పించాలని కేంద్ర విద్యాశాఖ మొన్న ఎన్టీఏను ఆదేశించింది. ఆ సంస్థలోని యాభై మందికి పైగా సిబ్బందిపైనా వేటుపడింది. ఇటువంటివి మళ్లీ జరగకూడదంటే- ఎన్టీఏ పనితీరును మెరుగుపరచడానికి రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను పూర్తిగా అమలుచేయాలి. నందన్ నీలేకని ఆధ్వర్యంలో కేంద్రం ఇటీవల నియమించిన టాస్క్ఫోర్స్ సైతం పోటీపరీక్షల సాకల్య క్షాళనకు ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై నిశిత సూచనలు చేయాలి. ప్రభుత్వోద్యోగాలకు ఎంపికల్లోనూ పారదర్శకతకు పట్టంకట్టాలి. రేయింబవళ్లు కష్టపడి చదువుకుని పరీక్షలకు హాజరయ్యే యువతకు ఏ రూపంలోనూ అన్యాయం జరగకుండా ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి!
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 02:38 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.