
సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాం!
వయసు పెరగడమంటే అనుభవాన్ని పోగేసుకోవడమే! ఒకప్పుడు అలాంటి పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే నిశ్చింత. ఇప్పుడు వాళ్లని పట్టించుకోవడమే మానేస్తున్నారు. కాబట్టే, వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోతున్నవాళ్లే ఎక్కువ. అలాంటివాళ్లకి జీవితంలో ‘రెండో అవకాశం’ ఇస్తున్నారు మతీన్ అన్సారీ.

- A
- A+
- A++

వయసు పెరగడమంటే అనుభవాన్ని పోగేసుకోవడమే! ఒకప్పుడు అలాంటి పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే నిశ్చింత. ఇప్పుడు వాళ్లని పట్టించుకోవడమే మానేస్తున్నారు. కాబట్టే, వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోతున్నవాళ్లే ఎక్కువ. అలాంటివాళ్లకి జీవితంలో ‘రెండో అవకాశం’ ఇస్తున్నారుమతీన్ అన్సారీ. ఆ వివరాలు ‘వసుంధర’తో పంచుకున్నారిలా...
ఒకప్పుడు అన్నీ ఉమ్మడి కుటుంబాలే. పెధ్దవాళ్లుంటే ప్రేమకు నిలయాలుగా ఉండేవి. అలాంటి వాతావరణంలోనే పెరిగాన్నేను. పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశా. 18 ఏళ్లకే పెళ్లైంది. మావారు హబీబ్ అన్సారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జడ్జిగానూ చేశారు. ఆయన కోల్‌కతాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కొందరు పెద్దవాళ్లని చూశా. మాట్లాడేవాళ్లు లేక ఒంటరితనంతో బాధ పడేవారు. సంపాదన లేక నిరాదరణకు గురయ్యేవారు. మాదీ పెద్ద కుటుంబమే. ఇంట్లోవాళ్లంతా లాయర్లు, అడ్మినిస్ట్రేటర్లుగా పనిచేశారు. అమ్మమ్మ, నానమ్మల్ని ప్రేమగా చూసుకునేది మా అమ్మ. అది చూస్తూ పెరిగిన నాకు ఈ తీరు ఆశ్చర్యపరచడమే కాదు... నాపై చాలా ప్రభావాన్నీ చూపింది. కొన్నేళ్లయ్యాక మా మనవళ్లు, మనవరాళ్ల కోసం అమెరికా వెళ్లా. అప్పటికి నాకు 50 ఉంటాయేమో! నేనూ వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నా కదా... నా ప్రయాణం ఎలా సాగుతుందోనన్న కుతూహలం కలిగింది. అందుకే అక్కడే కొన్ని కోర్సులు చేశా. అవి నా దృక్పథాన్ని మార్చాయి. దీంతో వయసు పెరిగేకొద్దీ జరిగే శారీరక, మానసిక, భావోద్వేగ మార్పుల గురించి లోతుగా తెలుసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి జెరెంటాలజీలో మాస్టర్స్‌నీ పూర్తిచేశా. నన్ను నేను అర్థం చేసుకున్నాక ఇతరులకోసం ‘దొబారా’ ప్రారంభించా. ఈ పేరుని మా అమ్మాయి సమీన్ సూచించింది.
అందుకే ఆ పేరు
నేర్చుకోవడం, స్నేహితుల్ని ఏర్పరచుకోవడం, ఆస్వాదించడం... ముఖ్యంగా జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి ప్రతి ఒక్కరికీ మరో అవకాశం దొరకాలి అన్నది నా ఉద్దేశం. అందుకే అదే అర్థమొచ్చేలా ‘దొబారా’ అని పెట్టాం. నిజానికి సేవలు 2014లోనే ప్రారంభించినా ఫౌండేషన్‌ని 2017లో రిజిస్టర్ చేయించా. మాది వృద్ధాశ్రమం కాదు. వయసు పైబడిన వాళ్లు తిరిగి జీవితాన్ని ఆస్వాదించడానికీ, సృజనాత్మకతను పంచుకోవడానికీ, తమకేం కావాలో తెలుసుకోవడానికీ సాయపడే వేదిక. పదవీ విరమణ పొందాక చూడండి... పలకరింపులు తగ్గుతాయి. మనవళ్లు, మనవరాళ్లు, పిల్లలు ఎవరి పనుల్లో వాళ్లు బిజీ. దీంతో చాలామంది ఆర్థికంగా స్థిరపడినా, అన్ని సౌకర్యాలున్నా పలకరించేవాళ్లు లేక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వాళ్లలో దీన్ని పోగొట్టి ఆనందంగా, నలుగురి మధ్యా గడిపేలా చేయడమే మా ప్రధాన లక్ష్యం. మార్నింగ్ వాక్స్, పిక్నిక్‌లు, బుక్ రీడింగ్, తంబోలా సెషన్లు, పాట్‌లక్ లంచ్‌లు, బోర్డు గేమ్‌లు ఆడించడం, ఆర్ట్, క్రాఫ్ట్, మొక్కల పెంపకం... వంటివెన్నో నిర్వహిస్తుంటాం. సహాయకులను సూచించడం, సీనియర్ కమ్యూనిటీలతో కలిసేలా చేయడం, భావోద్వేగపరంగా అండ, లీగల్, సామాజిక అంశాల్లో సాయం వంటివీ అందిస్తాం. సభ్యుల నుంచి వార్షికంగా నామమాత్రపు ఫీజు తీసుకుంటాం. మాకు వలంటీర్లూ ఉన్నారు. దొబారా అల్మారి అనే సస్టెయినబుల్ సంస్థ ఉంది. అక్కడ పాత వస్తువులను రీసైకిల్, అప్‌సైకిల్ చేసి అమ్ముతాం. వాటితో నిధులు సమకూర్చుకుంటాం.
అదే ఆనందం...
ఇప్పటివరకూ 8వేలకుపైగా మందికి సాయపడ్డాం. మా ప్రోత్సాహంతో తమలోని ప్రతిభను గుర్తించుకున్న వారెందరో. కవితలు, అల్లికలు, పాటలు పాడటం, ఆర్ట్స్ ఇలా ఎన్నో కొత్తగా ప్రయత్నిస్తున్నారు. కొందరు యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వివిధ అంశాల్లో వలంటీర్లుగా చేస్తున్నారు. శారీరక వైకల్యం ఉన్నా... ఇతరులకు మానసికంగా అండగా ఉండటానికి ప్రయత్నిస్తున్న పెద్దవాళ్లు ఉన్నారు. ఇలా జీవితాన్ని మరోసారి కొత్తగా తీర్చిదిద్దుకున్న వాళ్లు చాలామందే! పెద్దవాళ్లని చాలామంది ఏం తెలియదు అని కొట్టిపారేస్తారు కానీ... నడిచొచ్చే చరిత్ర వాళ్లు. అందుకే సంస్కృతి, వాళ్లు చూసిన మార్పులు, ఎదుర్కొన్న సమస్యలు వంటివి ఈ తరానికీ తెలియాలనే పిల్లలతో వాళ్లని కలిపిస్తుంటాం. సహానుభూతిని పరిచయం చేయాలి, పెద్దవాళ్లతో గడిపేలా చేయాలని స్కూలు పిల్లలతోపాటు వృద్ధులనూ వృద్ధాశ్రమాలు, ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళతాం. ఈక్రమంలో ఎన్నో పురస్కారాలూ అందుకున్నా. అయితే పెద్దవాళ్ల ముఖాల్లో తిరిగి ఆనందం, వాళ్లు ఒకరికొకరు అండగా నిలవటం, సంతోషంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం చూసినప్పుడు కలిగే సంతృప్తే వేరు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :