రేడియో ముచ్చట్లు!

- A
- A+
- A++

కొన్ని మాధ్యమాలు కేవలం సమాచారాన్ని అందించవు, అవి సమాజాల గుండెచప్పుడుగా మారతాయి. అలాంటివాటిలో రేడియో ఒకటి. ఇది మన సామూహిక వినికిడి సంస్కృతికి నిదర్శనం. ఒకప్పుడు ఒకే రేడియో గ్రామపంచాయతీ నుంచి మైక్ ద్వారా ఊరంతా వినిపించేది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 93 శాతం ప్రజలను చేరగల సామర్థ్యం ఉన్న ఈ మాధ్యమం, నేటి డిజిటల్ యుగంలో కూడా తన స్థానాన్ని కోల్పోలేదు. అన్ని తరాలవారినీ అలరించగలగడం రేడియో ప్రత్యేకత.
చాలామంది దినచర్యలో రేడియో ఒక భాగం. టెలివిజన్‌లో 24 గంటల ప్రసారాలు మొదలయ్యేవరకూ రేడియోది ఏకఛత్రాధిపత్యమంటే అతిశయోక్తి కాదు. అందులో ప్రసారమయ్యే కార్యక్రమాల సమయాన్ని బట్టి పనులు చేసుకునే అలవాటు ఎందరికో ఉండేది. టీవీ, ఆ తర్వాత మొబైల్ వచ్చి ఈ షెడ్యూల్‌ను దెబ్బతీసినా ఇప్పటికీ కారులో వెళ్తూ రేడియో వినేవాళ్లకు కొదవ లేదు. ప్రసార మాధ్యమాలు ఎన్ని ఉన్నా రేడియో శ్రోతలకు ఒకలాంటి అంతర్గత శాంతినిస్తుంది. సమయాన్ని గౌరవించడం, ప్రశాంతంగా వినడం నేర్పిస్తుంది. మాట్లాడే ముందు వినడం ముఖ్యమని చెబుతుంది. వినడమంటే అర్థం చేసుకోవడం, విభిన్న స్వరాలకు స్థానం ఇవ్వడం. ఈ వినికిడి సంస్కృతి బలంగా ఉన్నప్పుడే, సామాజిక సంభాషణలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు, దేన్నయినా చూసేటప్పుడు మనిషి నిష్క్రియాపరుడవుతాడు. కళ్లప్పగించి చూడటం తప్ప మరేమీ చేయలేడు. అదే వినేటప్పుడు చురుగ్గా, అప్రమత్తంగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూనే వింటున్న సమాచారానికి దృశ్యాన్ని ఊహించుకుంటాడు. ఈ స్వేచ్ఛే రేడియోను ప్రత్యేకంగా నిలబెడుతుంది.
రేడియో ఒక సమానత్వ వేదిక. చదువు, సంపద, వయసు... ఇవేవీ శ్రోతగా మారడానికి అడ్డంకులు కావు. ఎన్ని ఇంచులు, ఎంత క్లారిటీ, ఏ కంపెనీ... ఇవన్నీ అప్రస్తుతం. రిక్షావాలాకైనా, లగ్జరీ కారులో అయినా అదే రేడియో. అదే ఆనందం. అదే నమ్మకం. ఒకప్పుడు వాతావరణ సమాచారానికి, పాడీ పంటా తాలూకు సలహాలకు, మార్కెట్ ధరలు తెలుసుకోవడానికి... పల్లెటూళ్లలో రేడియోపైనే ఆధారపడేవాళ్లు. పొలంలో ఓ చెట్టుకింద పెట్టో, వెదురుగుంజకు కట్టో రేడియో వింటూ పొలం పనులు చేసుకునే రైతుల దృశ్యం సుపరిచితం. ఉరుకుల పరుగుల నగరజీవితంలోనూ రేడియో ఒక నిదానాన్ని నేర్పుతుంది. అది మనల్ని తొందరపెట్టదు, మనమూ దాన్ని తొందరపెట్టలేం. రేడియోలో మాటకి విలువెక్కువ. ఎందుకంటే దాంట్లో ముఖాలు కనిపించవు. అందుకే ఆచితూచి పదాలను వాడతారు. హాస్యం సున్నితంగా ఉండాలి, విమర్శ సమతూకంగా ఉండాలి, సమాచారం కచ్చితంగా ఉండాలి. ఈ నైతిక క్రమశిక్షణే రేడియోను నమ్మదగిన మాధ్యమంగా నిలబెట్టింది. సంగీత ప్రసారాల్లో కూడా ఇదే లోతు కనిపిస్తుంది. రేడియోలో మనకు నచ్చిన ప్లేలిస్ట్ ఉండదు, వాళ్లు వేసిన పాటలే వినాలి. అయినా సరే, లేటెస్ట్ హిట్స్ మధ్యలో అనుకోకుండా ఒక ఆపాత మధురం వినిపిస్తుంది. మనసును ఆనందడోలికల్లో విహరింప జేస్తుంది. అందుకే చాలా మందికి రేడియో ఒక నోస్టాల్జియా!

భయం ఉన్నచోట న్యాయం ఉండలేదు. విధేయమైన న్యాయవ్యవస్థ, అంతరాత్మను అణచి పెట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సమాజం... నియంతృత్వానికి సూచనలు. న్యాయస్థానాలు సత్యానికి కట్టుబడి తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. రూల్ ఆఫ్ లాని పణంగా పెట్టకూడదు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.